కోహ్లికి అవమానం.. ఇంత నీచంగా ప్రవర్తిసారా? | Furious Kohli Confronts As Fans Stoop To Absolute Low Guard Intervenes Video | Sakshi
Sakshi News home page

కోహ్లికి అవమానం.. ఇంత నీచంగా ప్రవర్తిసారా?.. తగ్గేదేలే అంటూ దూసుకొచ్చిన కింగ్‌

Published Fri, Dec 27 2024 3:52 PM | Last Updated on Fri, Dec 27 2024 5:09 PM

Furious Kohli Confronts As Fans Stoop To Absolute Low Guard Intervenes Video

మెల్‌బోర్న్‌ టెస్టులో టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లికి అవమానం జరిగింది. ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌ పెవిలియన్‌కు వెళ్తున్న సమయంలో.. ప్రేక్షకులు పరుష పదజాలంతో అతడిని దూషించారు. దీంతో వెనక్కి తిరిగి వచ్చిన కోహ్లి సీరియస్‌గా చూస్తూ.. వారికి బదులిచ్చేందుకు సిద్ధం కాగా.. అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది అతడికి నచ్చజెప్పి పంపించారు.

ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న టీమిండియా ఆతిథ్య జట్టుతో ఐదు టెస్టులు ఆడుతోంది. ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య గురువారం బాక్సింగ్‌ డే టెస్టు(Boxing Day Test) మొదలైంది.

ఆసీస్‌ స్కోరు 474
ప్రఖ్యాత మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో కంగారూ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 474 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఈ క్రమంలో శుక్రవారం నాటి రెండో రోజు ఆట సందర్భంగా బ్యాటింగ్‌ మొదలుపెట్టిన భారత జట్టు కష్టాల్లో కూరుకుపోయింది. టాపార్డర్‌లో ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌(Yashasvi Jaiswal- 82) అద్బుత అర్ధ శతకంతో మెరవగా.. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(3) విఫలమయ్యాడు.

ఆది నుంచే తడ‘బ్యాటు’​.. ఆదుకున్న జోడీ
వన్‌డౌన్‌లో వచ్చిన కేఎల్‌ రాహుల్‌ 24 పరుగులకే నిష్క్రమించగా.. విరాట్‌ కోహ్లి(86 బంతుల్లో 36).. జైస్వాల్‌తో కలిసి 102 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశాడు. దీంతో కాస్త కోలుకున్నట్లే కనిపించిన టీమిండియాకు.. వరుస ఓవర్లలో జైస్వాల్‌- కోహ్లి అవుట్‌ కావడంతో గట్టి షాక్‌ తగిలింది. రెండో రోజు ఆట ముగిసే సరికి భారత్‌ 46 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది.

ఇదిలా ఉంటే.. ఆసీస్‌ పేసర్‌ స్కాట్‌ బోలాండ్‌ బౌలింగ్‌లో వికెట్‌ కీపర్‌కు క్యాచ్‌ అవుటైన కోహ్లి.. పెవిలియన్‌కు వెళ్తుండగా.. ఆసీస్‌ ఫ్యాన్స్‌ అభ్యంతర వ్యాఖ్యలు చేశారు. 

ఏంటీ మీ సంగతి?
దీంతో వెనక్కి తిరిగి వచ్చిన కోహ్లి.. ‘‘ఏంటీ మీ సంగతి?’’ అన్నట్లుగా సీరియస్‌ లుక్‌ ఇచ్చాడు. అంతలో అక్కడ ఉన్న భద్రతా అధికారి.. కోహ్లిని అనునయించి.. నచ్చజెప్పి లోపలికి తీసుకువెళ్లాడు.

కాగా బాక్సింగ్‌ డే టెస్టు తొలిరోజు ఆట సందర్భంగా ఆసీస్‌ యువ ఓపెనర్‌, అరంగేట్ర బ్యాటర్‌ సామ్‌ కొన్‌స్టాస్‌(60)తో కోహ్లికి గొడవ(Virat Kohli- Sam Konstas Altercation) జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐసీసీ కోహ్లి మ్యాచ్‌ ఫీజులో ఇరవై శాతం మేర కోత కూడా విధించింది. 

ఇంత నీచంగా ప్రవర్తిస్తారా? 
అయితే, ఈ గొడవను దృష్టిలో పెట్టుకుని ఆసీస్‌ మీడియాతో పాటు ఆ దేశ అభిమానులు కోహ్లి పట్ల అవమానకర రీతిలో వ్యవహరించారు. కోహ్లిని ఉద్దేశించి.. జోకర్‌ అన్న అర్థంలో ఆసీస్‌ మీడియా కథనాలు ప్రచురించింది. 

ఇక కంగారూ జట్టు అభిమానులేమో ఇలా గ్రౌండ్‌లో కోహ్లిని హేళన చేస్తూ అభ్యంతరకర భాష ఉపయోగించారు. ఈ నేపథ్యంలో టీమిండియా ఫ్యాన్స్‌ ఘాటుగా స్పందించారు. దిగ్గజ ఆటగాడి పట్ల ఇంత నీచంగా ప్రవర్తిస్తారా? అని సోషల్‌ మీడియా వేదికగా #Viratkohli #KingKohli అంటూ ట్రెండ్‌ చేస్తున్నారు.

విమర్శించండి.. కానీ
భారత పేస్‌ దళ నాయకుడు జస్‌ప్రీత్‌ బుమ్రా సతీమణి, స్పోర్ట్స్‌ ప్రజెంటర్‌ సంజనా గణేషన్‌ కూడా ఈ ఘటనపై స్పందించారు. ‘‘అత్యుత్తమ బ్యాటర్‌ పట్ల ఇలా అగౌరవంగా ప్రవర్తించడం సరికాదు. విమర్శించే హక్కు అందరికీ ఉంటుంది. కానీ హద్దులు మీరి.. అసభ్యంగా వ్యవహరించకూడదు’’ అని సంజనా పేర్కొన్నారు.

చదవండి: టీమిండియా అంటే చాలు, రెచ్చిపోతాడు.. స్టీవ్‌ స్మిత్‌ ప్రపంచ రికార్డు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement