మెల్‌బోర్న్ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో టీమిండియా తొలి రోజు ఆటముగిసే సమయానికి ఒక వికెట్ నష్టానికి 36 పరుగులు చేసింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ స్టార్క్ బౌలింగ్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు. వన్‌డౌన్‌లో వచ్చిన పుజారాతో కలిసి మరో ఓపెనర్ శుబ్‌మన్ గిల్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ రోజును ముగించారు. గిల్ 28 పరుగులు, పుజారా 7 పరుగులతో క్రీజులో ఉన్నారు. మొత్తానికి టీమిండియా తొలి రోజు మూడు సెషన్లలోనూ తన ఆధిపత్యం చూపించింది. అంతకముందు టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 195 పరుగులకే ఆలౌట్ అయింది. టీమిండియా బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు తీయడంతో ఆసీస్ ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. ఆసీస్ బ్యాటింగ్‌లో వేడ్ 48 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. హెడ్ 38 పరుగులు చేశాడు. భారత బౌలింగ్‌లో బుమ్రా 4, అశ్విన్ 3, సిరాజ్ 2, జడేజా ఒక వికెట్ తీశాడు.
ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్‌కు టీమిండియా బౌలర్ బుమ్రా తొలి షాక్ ఇచ్చాడు .ఆసీస్ ఓపెనర్ బర్న్స్‌ను బుమ్రా డకౌట్ చేశాడు. దీంతో ఆసీస్ 10 పరుగుల వద్ద మొదటి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన మార్నస్ లబుషేన్‌తో కలిసి మరో ఓపెనర్ మాథ్యూ వేడ్ ఇన్నింగ్స్‌ను నిర్మించే ప్రయత్నం చేశాడు. వీరి జోడి బలపడుతున్న తరుణంలో బౌలింగ్‌కు వచ్చిన రవిచంద్రన్ అశ్విన్ వేడ్‌ను 30 పరుగుల వద్ద ఔట్ చేయడంతో ఆసీస్ 35 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన స్టార్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ క్రీజులో కుదురుకోవడానికి ఇబ్బంది పడ్డాడు. ఈ దశలో మరోసారి బౌలింగ్‌కు వచ్చిన అశ్విన్ స్మిత్‌ను డకౌట్‌గా పెవిలియన్ చేర్చాడు. దీంతో ఆసీస్ 38 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన హెడ్‌తో కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. లబుషేన్,హెడ్‌లు భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ ఆచితూచి ఆడారు. (చదవండి : అతనికి అరుదైన గౌరవం.. ఇది రహానేకే సాధ్యం)
టీ విరామానికి ముందు బుమ్రా బౌలింగ్‌లో 38 పరుగులు చేసిన హెడ్ ఔట్ కాగా.. కాసేపటికే అర్థసెంచరీకి రెండు పరుగుల దూరంలో ఉన్న లబుషేన్‌ను సిరాజ్ ఔట్ చేయడంతో ఆసీస్ 136 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి టీ విరామానికి వెళ్లింది. విరామం అనంతరం భారత బౌలర్లు మరింత విజృంభించడంతో 59 పరుగులు మాత్రమే నమోదు చేసి మరో 5 వికెట్లను కోల్పోయింది. కాగా సిరాజ్ లబుషేన్‌ను అవుట్ చేయడం ద్వారా అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో మెయిడెన్ వికెట్ తీశాడు.
Comments
Please login to add a commentAdd a comment