కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పెరుగుతున్న ప్రమాదాలు
ఏటా వందలాదిమంది మృతి
వీరిలో ద్విచక్ర వాహనచోదకులే అధికం
జాతీయ రహదారుల పరిధి అధికమే కారణం
విజయవాడ : రాజధాని పరిధిలోని కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రోడ్డు ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. నిత్యం ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాల్లో నిండుప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఏటా వందల సంఖ్యలో వాహనదారులు మృత్యువాత పడుతున్నా పరిస్థితిలో మార్పు రావడం లేదు. కేవలం అతి వేగం, నిర్లక్ష్యం వల్ల జరిగే ప్రమాదాలే అధికంగా ఉన్నాయి. సోమవారం రాత్రి విజయవాడ శివారులోని నల్లకుంట వద్ద జరిగిన బస్సు ప్రమాదం కూడ కేవలం డ్రైవర్ మద్యం తాగి నిర్లక్ష్యంగా వాహనాన్ని నడపడం వల్లే నలుగురు వైద్య విద్యార్థులు మృతి చెందారు. ముఖ్యంగా రహదారుల విస్తరణ, రవాణా శాఖ అధికారులు వాహన సామర్థ్యాన్ని సమగ్రంగా పరిశీలించకపోవడం, జాతీయ రహదారులపై కొన్నిచోట్ల సంకేత సూచికలు లేకపోవడం.. వెరసి ప్రమాదాలకు కారణమవుతున్నాయి. పర్యవసానంగా ఏటా వాహన ప్రమాదాల్లో వేల సంఖ్యలో జనం గాయలపాలవుతుండగా వందల సంఖ్యలో చనిపోతున్నారు.
ఇతర జిల్లాలకు లేని విధంగా కృష్ణా జిల్లాలో జాతీయ రహదారుల విస్తీర్ణం అధికంగా ఉంది. దీంతోపాటు కరకట్ట మార్గాలు, రాష్ట్ర రహదారులు కూడా ఉన్నాయి. విజయవాడ మీదుగా విశాఖపట్నం, హైదరాబాద్‌లకు కలిపే జాతీయ రహదారి సుమారు 176 కిలోమీటర్లు జిల్లాలో ఉంది.
ఇది కాకుండా రాష్ట్ర రహదారులు వందల కిలోమీటర్లు ఉన్నాయి. విజయవాడ నుంచి అవనిగడ్డకు కరకట్ట మార్గం, విజయవాడ నుంచి జగదల్‌పూర్‌కు మైలవరం మీదుగా వెళ్లే రహదారులున్నాయి. ఈ క్రమంలో జాతీయ రహదారులపై మితిమీరిన వేగం వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. అది కూడా ఇబ్రహీంపట్నం జంక్షన్, కంచికచర్ల, నందిగామ మధ్య అధికంగా జరుగుతున్నాయి. వాహన వేగాన్ని అంచానాలు వేసే స్పీడ్ గన్లు జాతీయ రహదారులపై ఏర్పాటు చేయకపోవడం, రవాణా శాఖ అధికారులు అధిక వేగంతో ప్రయాణించే వాహనాలను గుర్తించి కేసులు నమోదుచేయకపోవడం వల్ల వాహనాల వేగం రోజురోజుకీ అధికమవుతోంది.
సోమవారం రాత్రి నల్లకుంట వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో నలుగురు వైద్య విద్యార్థులు, బస్సు డ్రైవర్ మృతిచెందారు. అమలాపురానికి చెందిన ధనుంజయ ట్రావెల్స్‌కు చెందిన బస్సు డ్రైవర్ అతిగా మద్యం సేవించడంతో పాటు అధికవేగంతో వెళ్ళటం వల్ల వాహనాన్ని నియంత్రించలేకపోవటం వల్లే ప్రమాదం జరిగిందని రవాణా శాఖ అధికారులు అంచనా వేశారు. ఇదిలా ఉంటే జాతీయ రహదారులపై సైన్ బోర్డులు, అవసరమైన చోట్ల రేడియం స్టికర్లు ఉండాలి. కాని విజయవాడ జగ్గయ్యపేట మధ్య అతి తక్కువగానే కనిపిస్తుండటంతో వాహనాల వేగానికి హద్దు లేకుండా పోయింది.
రహదారి భద్రత గాలికి
కృష్ణా జిల్లా వాహన ప్రమదాలు అధికంగా జరిగే జిల్లాలో మొదటి మూడు స్థానాల్లో నిలుస్తుంది. ప్రతిఏటా జరిగే వాహన ప్రమదాల్లో అనేక మంది వాహనదారులతో పాటు అభంశుభం తెలియని అనేక మంది బలి అవుతున్నారు. రవాణా శాఖ అధికారులు, పోలీసులు, కేవలం రహదారి భద్రతా వారోత్సవాల సమయంలో మినహా మిగిలిన సమయంలో వాహన ప్రమాదాలను పట్టించుకుంటున్న దాఖలాలు లేకపోవడంతో ప్రమాదాలు పెరగుతున్నాయే తప్ప తగ్గుముఖం పట్టడం లేదు. జిల్లాలో విజయవాడ కమిషనరేట్ పరిధిలో కూడా అధికంగానే ప్రమాదాలు జరుగుతున్నాయి. ఉదాహరణకు గత ఏడాది జనవరి నుంచి డిసెంబర్ నెల వరకు విజయవాడ కమిషనరేట్ పరిధిలో 1634 వాహన ప్రమదాలు జరగ్గా వాటిలో 1609 మంది గాయాలపాలయ్యారు. 366 మంది మృత్యువాత పడ్డారు.
రాజధాని రోడ్లపై మృత్యుఘంటికలు
Published Wed, Mar 16 2016 12:58 AM | Last Updated on Thu, Aug 30 2018 5:35 PM
Advertisement