‘రోడ్ సేఫ్టీ క్లబ్’
దేశంలో సంభవించే మరణాల్లో అధిక శాతం రోడ్డు ప్రమాదాలే. వాహనదారులే కాదు... రోడ్డు మీద నడిచే వాళ్ల తప్పుల వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. రహదారిపై రకరకాల గీతలుంటాయి. సిగ్నల్స్ కనిపిస్తాయి. కానీ... వాటి గురించిన క్షుణ్ణంగా ఎంత మందికి తెలుసు! చిన్న చిన్న పొరపాట్లు, తప్పుల వల్ల విలువైన ప్రాణాలు గాల్లో కలసిపోతున్నాయి. వీటిని నివారించాలంటే నిబంధనలపై అవగాహన ఉండాలి. వాటిని కచ్చితంగా పాటించాలి. అదే పని చేస్తోంది నగరంలోని ‘రోడ్ సేఫ్టీ క్లబ్’. ప్రజలను చైతన్యవంతులను చేయడానికి అవేర్‌నెస్సే సరైన మార్గమంటున్న ఈ క్లబ్ విశేషాలు...
-ఓ మధు
ఫుట్‌పాత్ ఉంటే ఓకే... లేనప్పుడు ఎక్కడ నడవాలి? చాలా మందికి ఈ విషయం తెలియదు. అలాగే వివిధ సూచీలు కనిపిస్తాయి. వాటిపై ప్రజల్లో అవగాహన చాలా తక్కువ. ఇది చిన్న విషయమే అనుకోవడం వల్లే కొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. నిబంధనలు పాటించేలా చేయడం రోడ్ సేఫ్టీలో భాగమే. అదే ఈ క్లబ్ లక్ష్యం. ఎక్కువగా దీనిపై పిల్లల్లో అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు క్లబ్ మెంబర్స్. ఈ కార్యక్రమాలన్నింటినీ స్కూళ్లు, కాలేజీలకు చేరువ చేయడానికి ఇండియన్ డెవలప్‌మెంట్ ఫౌండేషన్... క్లబ్‌కు సహకారం అందిస్తోంది. ఇప్పటి వరకు అరవైకి పైగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. వీరితో పాటు ఆటో, ట్యాక్సీ, బస్, లారీ డ్రైవర్లకూ ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు. ‘రోడ్డు ఎవరి ప్రాపర్టీ కాదు. అందరిదీ. కానీ ఎవరిష్టం వచ్చినట్టు వారు వాడతారు. నిబంధనల ఉల్లంఘనకూ పాల్పడతారు. అలా కాకుండా సూచించిన సిస్టమ్‌లో వెళితే చాలా ప్రమాదాలు నివారించవచ్చు. ఈ దిశలోనే అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాం’ అంటారు రోడ్ సేఫ్టీ క్లబ్ ఫౌండర్, మోటర్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్.
మార్పు సాధ్యమేనా!
‘1983లో 40 లక్షల మంది లెప్రసీ రోగులుండేవారు. ఆ వ్యాధిని అదుపు చెయ్యటం అప్పుడు కష్టం. కానీ... భారత్‌ను ఇప్పుడు పోలియో రహిత దేశంగా డబ్ల్యూహెచ్‌ఓ గుర్తించింది. ఈ మార్పు కేవలం అవగాహనతో వచ్చిందే. తమ తప్పు లేకుండా ప్రమాదానికి గురైనవారు లెక్కకు మించే ఉన్నారు. రోడ్డుపై కాలు పెట్టిన మరుక్షణం నుంచి అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండక తప్పదు. రోడ్డు ప్రమాదాలు ఒక ప్రాంతానికే పరిమితం కాలేదు. దేశమంతటా ఇదే పరిస్థితి. విషయం ఇంత తీవ్రమైనదైనప్పుడు దాని గురించి అవగాహన కల్పించి ప్రజలను చైతన్యవంతులను చేయడం అత్యంత ముఖ్యమైనదని భావించాం’ అన్నారు క్లబ్ ఆర్గనైజర్, ఐడీఎఫ్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ సంజయ్‌రామ్.
వాకథాన్...
రోడ్డు ప్రమాదం జరిగిన చాలా సేపటికి గానీ బాధితులు ఆసుపత్రికి చేరడం లేదు. సరైన సమయానికి తేగలిగితే వారి ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుంది. డాక్టర్‌గా ఇలాంటి సంఘటనలు చాలా చూశాను. ఈ దిశగా కూడా అవేర్‌నెస్ తెచ్చే కార్యక్రమాలు చేస్తున్నాం. అన్ని స్థాయిల్లో రోడ్డు నిబంధనలు పకడ్బందీగా పాటించేలా చేయగలిగితే ఎన్నో ప్రమాదాలు అరికట్టవచ్చు. ఈ నెల 11న నెక్లెస్‌రోడ్ పీపుల్స్ ప్లాజా వద్ద రహదారి భద్రతా వారోత్సవంలో భాగంగా వాకథాన్ నిర్వహిస్తున్నాం. గతేడాది జరిగిన వాకథాన్‌కు ఖర్చు మేమే భరించాం. ఈ ప్రజోపయోగ కార్యక్రమానికి కార్పొరేట్ సంస్థలు కూడా సహకరిస్తే సేవలు మరింత విస్తరిస్తాం’ అని క్లబ్ కోఆర్గనైజర్, పిడియాట్రిస్ట్ డాక్టర్ గీతాంజలి చెబుతున్నారు.
అందరికీ అవగాహన...
చిన్నప్పటి నుంచే రహదారి భద్రతపై అవగాహన కల్పించడం ద్వారా భవిష్యత్తులో మంచి ఫలితాలు ఉంటాయన్నది క్లబ్ ఉద్దేశం. అందులో భాగంగా ఐదు నుంచి పదో తరగతి పిల్లలకు క్లబ్ సభ్యులు శిక్షణ ఇస్తున్నారు. ఒక్కో స్కూల్‌లో కొంత మంది పిల్లలను ఎంపిక చేసి వారి ద్వారా అక్కడ సేఫ్టీ క్లబ్ ఏర్పాటు చేసేలా చూస్తున్నారు. పోస్టర్లు, స్లోగన్స్, ఎస్సే రైటింగ్ వంటివి పెడుతున్నారు.అలాగే కార్పొరేట్ సంస్థలకు కూడా కార్యక్రమాలు విస్తరించారు. వారి కోసం వీడియో ప్రజంటేషన్, ఇంటరాక్షన్ సెషన్స్ నిర్వహిస్తున్నారు.
చదువుకోని హెవీ వెహికిల్ డ్రైవర్లకు వారానికి రెండుసార్లు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఏడాదికోసారి సేఫ్టీ వీక్ ప్రోగ్రామ్ ఉంటుంది. స్కూల్ బస్ డ్రైవర్లకూ అవగాహన కల్పిస్తున్నారు. నగరంలోని పాఠశాలల నుంచి చాలా మంది పిల్లలు ఆసక్తిగా కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్టు క్లబ్ సభ్యులు చెబుతున్నారు. హెల్మెట్, సీట్‌బెల్ట్ పెట్టుకోవడం, సిగ్నల్స్ పాటించడం, రోడ్ క్రాసింగ్, ఓవర్‌లోడ్ వంటివి ప్లకార్డులతో ప్రచారం చేస్తున్నారు.
మెదక్ ఘటన సమయంలో...
‘మెదక్‌లో స్కూల్ బస్ ప్రమాదం వార్త తెలియగానే సంఘటనా స్థలికి చేరుకున్నాం. ఆ ప్రాంతంలో స్కూల్ బస్ డ్రైవర్స్ కోసం రోడ్ సేఫ్టీ గురించి నాలుగు సెషన్స్ నిర్వహించాం. ఆ తర్వాత ఆ జిల్లాలోని అన్ని స్కూల్స్‌లోనూ అవగాహన కల్పించాం. కార్యక్రమాలను మరింత విస్తరించడానికి కొందరికి శిక్షణ ఇచ్చి ఆయా ప్రాంతాల్లో కార్యక్రమాలు చేపట్టేలా ప్రోత్సహిస్తున్నాం’ అంటారు శ్రీనివాస్. క్లబ్ వివరాలకు http://www.meetup.com/ROADSAFETYCLUB/లింక్ క్లిక్ చేయవచ్చు.