ప్రమాదాలు జరిగితే కలెక్టర్లు, ఎస్పీలదే బాధ్యత
శాఖాధిపతుల సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు
సాక్షి, అమరావతి: జిల్లాల్లో జరిగే ఏ ప్రమాద ఘటనకైనా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలే బాధ్యత వహించాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. మంగళవారం వెలగపూడి తాత్కాలిక సచివాలయంలోని తన కార్యాలయంలో మంత్రులు, శాఖాధిపతులు, ఉన్నతాధికారులతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. రోడ్డు భద్రతపై జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు సమీక్షలు జరపాలని సూచించారు. ఉచిత ఇసుక విధానాన్ని సమర్థంగా అమలు చేయడంపై దృష్టి పెట్టాలని, ఎక్కడైనా వసూళ్లు జరిగితే పీడీ చట్టం ప్రయోగించాలని ఆదేశించారు.
అధికారులు తప్పు చేసినా ఉపేక్షించనని, ఏ స్థాయి అధికారి అవకతవకలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవన్నారు. అధికారు ల్లో నైపుణ్యం, సామర్థ్య పెంపు బాధ్యతల్ని విశ్రాం త సీఎస్ ఎస్‌పీ టక్కర్‌కు అప్పగిస్తున్నట్లు తెలిపారు. ఇంట్లో మరుగుదొడ్డి కట్టుకోని వారిని ఎన్నికల్లో అనర్హులుగా ప్రకటించేందుకు త్వరలో చట్టాన్ని తెస్తున్నట్లు తెలిపారు. పర్యాటక శాఖపై సమీక్ష సందర్భంగా భవానీ ద్వీపాన్ని ప్రధాన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రూ.10 కోట్లతో వాటర్ స్క్రీన్ల ఏర్పాటుకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మాకు అనుకూలంగా పనిచేయాల్సిందే..
అధికారులంతా తమకు అనుకూలంగా పనిచేయాల్సిందేనని, లేకపోతే చర్యలు తప్పవని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. తమ ప్రభుత్వానికి, పార్టీకి కొందరు అధికారులు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని, దీన్ని తాము అంగీకరించబోమని స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా కలెక్టర్‌గా పనిచేసి ఇటీవలే బదిలీ అయిన కాంతీలాల్ దండే.. పెన్షన్ల పంపిణీలో ప్రభుత్వ విధానం సరిగా లేకపోవడంతో పేదలు ఇబ్బందులు పడుతున్నారని, ఈ విషయాన్ని తాను పలుమార్లు సీఎం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని వ్యాఖ్యానించారు. అయితే అందులోని వాస్తవాన్ని పట్టించుకోకుండా సీఎం ఏకంగా శాఖాధిపతుల సమావేశంలో ఈ అంశాన్ని లేవనెత్తి విరుచుకుపడ్డారు. హద్దు మీరితే ఉన్నతాధికారులయినా సరే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇసుక అక్రమ రవాణా అరికట్టే బాధ్యతను రెవెన్యూ, హోం, మైనింగ్ శాఖ మంత్రులకు అప్పగిస్తున్నానన్నారు.