అనంతపురం సెంట్రల్ : రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. రోడ్డు నియమ నిబంధనలు ఉల్లంఘించి నడుపుతున్న వారిపై కొరఢా ఝుళిపిస్తున్నారు. ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా రోడ్డు నియమ నిబంధనలు పాటించాలి. లేకుంటే చట్ట ప్రకారం శిక్షార్హులు అవుతారని రోడ్డు, రవాణాశాఖ అధికారులు తెలియజేస్తున్నారు. ఎవరైనా వాహనం నడపాలంటే రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, డ్రైవింగ్ లైసెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్ సర్టిఫికెట్ తప్పనిసరి.
– రిజిస్ట్రేషన్ లేకపోతే వాహన చట్టం సెక‌్షన్ 39, 192 ప్రకారం జరిమానా విధిస్తారు.
– డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే సెక్షన్ 3, 4 , 180, 181 ప్రకారం జరిమానా లేదా జైలు శిక్ష వేస్తారు.
– పొల్యూషన్ సర్టిఫికెట్స్ లేకపోతే సెక్షన్ 190(2) ప్రకారం రూ. 1000 జరిమానా విధిస్తారు.
– ఇన్సూరెన్స్ లేకపోతే సెక‌్షన్ 196(ఏ) ప్రకారం 3 నెలలు జైలు శిక్ష, రూ. 1000 జరిమానా విధిస్తారు.
మద్యం తాగి నడిపితే :
మద్యం సేవించి వాహనం నడుపరాదు. మోటారు వాహన చట్టం సెక‌్షన్ 185 ప్రకారం ఆరు నెలల వరకు జైలు శిక్ష విధించబడుతుంది.
ర్యాష్ డ్రైవింగ్‌కు పాల్పడితే :
ర్యాష్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్ నేరంగా పరిగణిస్తారు. మోటారు వాహన చట్టం సెక‌్షన్ 184 ప్రకారం 6 నెలల వరకు జైలు శిక్ష లేదా రూ.1000 జరిమానా విధిస్తారు.
పరిమితికి మించి ఆటోల్లో ప్రయాణిస్తే :
పరిమితికి మించి ఆటోల్లో ప్రయాణికులకు ఎక్కించుకొని వెలితే మోటారు వాహన చట్టం సెక‌్షన్ 86 ప్రకారం జరిమానా లేదా పర్మిట్‌పై చర్యలు తీసుకుంటారు.
సీట్ బెల్ట్ ధరించకపోతే :
సీఎంవీ రూల్ 138(3) ప్రకారం విధిగా సీట్ బెల్ట్ ధరించాలి. సీట్ బెల్ట్ ధరించకపోతే మోటారు వాహన చట్టం సెక‌్షన్ 177 ప్రకారం జరిమానా రూ.100 విధించబడుతుంది.
స్కూల్ బస్సులు నిబంధనలు పాటించకపోతే :
ఏపీ మోటారు వాహనాల నియమావళి 1989 నందు 185(జి) ప్రకారం పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించుకున్నా, 60 ఏళ్లు దాటిన వారు డ్రైవింగ్ చేసినా, పర్మిట్ నిబంధనలు ఉల్లంఘించినా మోటారు వాహన చట్టం సెక‌్షన్ 86 ప్రకారం జరిమానా లేదా పర్మిట్‌పై చర్యలు తీసుకుంటారు.
సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనం నడిపితే :
సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ వాహనాలు నడపడం అత్యంత ప్రమాదకరం, నిబందన అతిక్రమించిన వారికి వాహన చట్టం సెక‌్షన్ 184 ప్రకారం రూ. 1000 జరిమానా లేదా సీఎంవీ రూల్ 21(6) ప్రకారం డ్రైవింగ్ లైసెన్స్ తాత్కాలికంగా నిలిపివేస్తారు.
హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే :
హెల్మెట్ ధారణ ప్రాణానికి రక్షణ. మోటారు వాహనాల చట్టం సెక‌్షన్ 129 ప్రకారం హెల్మెట్ తప్పని సరిగా ధరించాలి. లేని రూ.100 జరిమానా విధిస్తారు.
అతి వేగం ప్రమాదకరం :
వాహనాలను అతివేగంగా నడపటం అత్యంత ప్రమాదకరం. మోటారు వాహనాల చట్టం సెక‌్షన్ 112, 183 (1) ప్రకారం జరిమానా లేదా జైలు శిక్ష పడుతుంది.
రోడ్డు భద్రత నిబంధనలు ఇవీ
Published Sun, May 14 2017 11:49 PM | Last Updated on Thu, Aug 30 2018 5:35 PM
Advertisement
Advertisement