prayojanam
-
చికుబుకు రైలు...సేవలెన్నో చూడు
ప్రయోజనం రైలు...అనగానే ఒక గమ్యస్థానం నుంచి మరో గమ్యస్థానానికి చేరుస్తుందని మాత్రమే చాలా మందికి అనుకుంటుంటారు. కానీ రైల్వే టికెట్ బుక్ చేసుకోవడం ఎలా...ప్లాట్ఫారం టికెట్ ఎందుకు కొనాలి..రద్దు చేసుకునే ఎంత మొత్తం వెనక్కు వస్తుంది..తదితర వివరాలేవీ చాలా మందికి తెలియవు. మరోవైపు రైల్వేశాఖ ప్రయాణికుల సౌకర్యార్థం ఎన్నో సేవలు అందిస్తోంది. ద్విచక్రవాహనాలను తరలింపు నుంచి కల్యాణ వేదికలను అద్దెకివ్వడం వరకూ ఎన్నో విధాలుగా ఉపయోగపడుతోంది. ఇలా రైల్వే అందిస్తున్న సేవల సమాహారమే ఈ కథనం. గుంతకల్లు: సుదూర ప్రాంతాలకు వెళ్లే రైలు ప్రయాణికులు మూడు నెలల ముందుగానే టికెట్లు రిజర్వేషన్ చేసుకునే అవకాశం ఉంది. టిక్కెట్ కన్ఫర్మ్ అయిన తర్వాత ప్రయాణ సమయానికి 24 గంటల్లోపు టికెట్ రద్దు చేసుకుంటే ఒక రేటు, వెయిటింగ్ లిస్టు టికెట్ రద్దు చేసుకుంటే ఒకవిధంగా డబ్బు వెనక్కు వస్తుంది. కన్ఫర్మేషన్ టికెట్ రద్దు చేసుకుంటే.. – స్లీపర్ టికెట్ రద్దు చేసుకుంటే రూ.120 పోను మిగతా సొమ్ము వెనక్కు వస్తుంది. – ఏసీ చైర్, త్రీటైర్ టికెట్లు రద్దు చేసుకుంటే రూ.190 కట్ అవుతుంది. రైలు బయలుదేరే ముందు 4 గంటల్లోపు రద్దు చేసుకోవాలి. లేకపోతే టిక్కెట్ ధర మొత్తం వాపసు ఇవ్వడం కుదరదని రైల్వే వర్గాలు తెలిపాయి. వెయిటింగ్ లిస్టు టికెట్ రద్దు చేసుకుంటే... – స్లీపర్ క్లాస్ టికెట్ రద్దు చేసుకుంటే రూ.60, ఏసీ చైర్, త్రీటైర్ టికెట్లకు రూ.65 కట్ అవుతుంది. రైలు బయలుదేరడానికి 4 గంటల ముందు టికెట్ రద్దు చేసుకుంటే రైల్వే వర్గాలు నిర్ణయించిన ప్రకారం డబ్బు వాపసు వస్తుంది. తత్కాల్ టికెట్ పొందడం ఇలా... –ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారా తత్కాల్ టికెట్ పొందవచ్చు. ప్రయాణ తేదీకి ఒక రోజు ముందు ఈ టికెట్ జారీ చేస్తారు. – ఉదయం 10.00 గంటలకు ఏసీ క్లాస్ టికెట్లు, 11.00 గంటలకు ద్వితీయ శ్రేణి టికెట్లను తత్కాల్ పద్ధతిన బుక్ చేసుకోవచ్చు. – రిజర్వేషన్ సౌలభ్యం ఉన్న ప్రతి రైలులో తత్కాల్ టికెట్ ద్వారా బెర్త్‌లు రిజర్వు చేసుకోవచ్చు. సీనియర్ సిటిజన్స్‌కు రాయితీలు వర్తించవు. – ఒక దరఖాస్తు ద్వారా గరిష్టంగా నలుగురు సభ్యులు మాత్రమే తత్కాల్ టికెట్లు రిజర్వు చేసుకోవచ్చు. – టికెట్ బుక్ చేసుకునే సమయంలో ఏవిధమైన గుర్తింపు కార్డు అవసరం లేదు. కానీ ప్రయాణ సమయంలో మాత్రం తత్కాల్ టికెట్ (ఒరిజినల్) చూపించడంతోపాటు ఆధార్, ఓటరు కార్డు లేదా పాన్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ వీటిల్లో ఏదైనా ఒక పత్రం చూపించాల్సి ఉంటుంది. – తత్కాల్ టికెట్ పొందాలంటే ప్రయాణించే దూరాన్ని బట్టి చార్జీలు వసూలు చేస్తారు. స్లీపర్ క్లాస్‌కు కనిష్టంగా రూ.100, గరిష్టంగా రూ.200, అదేవిధంగా ఏసీ చైర్‌కార్‌కు కనిష్టంగా రూ.125, గరిష్టంగా రూ.225, ఏసీ త్రీటైర్‌కు కనిష్టంగా రూ.300, గరిష్టంగా రూ.400, ఏసీ 2టైర్‌కు కనిష్టంగా రూ.400 గరిష్టంగా రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. – కన్ఫర్మ్ అయిన తత్కాల్ టికెట్ రద్దు చేసుకుంటే డబ్బు వాపసు ఇవ్వరు. వెయిటింగ్ లిస్టులో ఉండి రైలు బయలుదేరడానికి 4 గంటల ముందు రద్దు చేసుకుంటే 50 శాతం నగదు వెనక్కు ఇస్తారు. ద్విచక్ర వాహనం బుక్ చేసుకోవడం ఇలా... ద్విచక్ర వాహనాలను యజమానులు స్లీపర్ టికెట్, జనరల్ టికెట్‌తో తమ ద్విచక్రవాహనాన్ని రైలులో రవాణా చేసుకోవచ్చు. వాహనదారుడు ఒరిజినల్ ఆర్సీ జిరాక్స్ ప్రతులు ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా వాహనంలో పెట్రోల్ లేకుండా చూసుకోవాలి. రైల్వే పార్శిల్ కార్యాలయంలోని కూలీలు గోనెసంచి, గడ్డి, ప్లాస్టిక్ కవర్లతో ప్యాకింగ్ చేసినందుకు రూ.200 కూలీ చెల్లించాల్సి ఉంటుంది. వాహనం బరువు ప్రకారం 100 కి.మీలకు లగేజీ టిక్కెట్ కింద రూ.345, ఆ తర్వాత రైలును బట్టి కి.మీ కొంత చొప్పున చార్జీలు వసూలు చేస్తారు. అదేవిధంగా వాహనం రైల్వేస్టేషన్‌కు చేరుకున్నాక కూడా తీసుకోకపోతే గంటకు రూ.10 చొప్పున అదనంగా చెల్లించాల్సి ఉంటుందన్నారు. ప్లాట్ఫారం టిక్కెట్ ఎందుకు తీసుకోవాలి... 1989 రైల్వే చట్టం ప్రకారం రైల్వేస్టేషన్‌లోని ప్లాట్‌ఫారాల్లోకి ప్రవేశించే ప్రతి వ్యక్తీ తప్పనిసరిగా ప్లాట్ఫారం టిక్కెట్ కొనాల్సి ఉంది. స్టేషన్, ప్లాట్‌ఫారాల పరిసరాల్లో ఉండే వ్యక్తి సంబంధిత అధికారులు అడిగినప్పుడు తప్పకుండా టిక్కెట్ లేదా ప్లాట్ఫారం టిక్కెట్ చూపాల్సి ఉంటుంది. ఈ రెండూ టికెట్లు లేకుండా రైల్వే టికెట్ చెకింగ్ ఇన్స్పెక్టర్కు పట్టుబడితే రూ.250 జరిమానా, మినిమం చార్జీ కింద రూ.50 కలిపి మొత్తం రూ.300 ఫైన్‌గా కట్టాల్సి ఉంటుంది. ప్లాట్ఫారం టికెట్ గానీ, ప్రయాణ టిక్కెట్ గానీ ఉంటే స్టేషన్లో అనుకోని ప్రమాదం జరిగినప్పుఽడు సంబంధిత వ్యక్తికి రైల్వే సంస్థ ద్వారా నష్టపరిహారం అందే అవకాశం ఉంటుంది. రైలు ప్లాట్ఫారం టిక్కెట్ చెల్లుబాటు సమయం 3 గంటలు. పోర్టర్ చార్జీలు ఇలా.... వృద్ధులు, జబ్బుపడిన వారు, వికలాంగులను రైల్వేస్టేషన్ లోపలికి, బయటికి తీసుకురావడానికి మినిమం చార్జీ (కూలీ) కింద రూ.50 వసూలు చేస్తారు. అదే విధంగా సాధారణ ప్రయాణీకులు తమ లగేజీని రైల్వేస్టేషన్ లోపలికి, బయటికి తీసుకురావడానికి మినిమం (40 కిలోల తూకం కల్గిన బ్యాగులను మోసుకెళ్లడానికి) రూ.50, లగేజ్ ట్రాలీలో తరలించడానికి రూ.80 చొప్పున పోర్టర్లు వసూలు చేస్తారు. రైల్వే కల్యాణ మండపాల బుకింగ్ ఇలా.... డివిజన్ కేంద్రం గుంతకల్లులోని రైల్వే కమ్యూనిటీహాల్, రైల్వే ఇన్స్టిట్యూట్లు శుభకార్యాలకు అద్దెకు ఇస్తుంటారు. రైల్వే ఉద్యోగుల ఇంట జరిగే శుభకార్యాలకు కల్యాణవేదిక, ఫంక్షన్ హాళ్ల ఇబ్బంది తలెత్తకూడదన్న ఉద్దేశంతో 1978లో అప్పటి రైల్వే శాఖ మంత్రి మధుదండవళె వీటిని నిర్మించారు. రైల్వే ఉద్యోగులకు నామమాత్రపు రేట్లతో ఈ వేదికలను అద్దెకు ఇస్తారు. ఈ వేదిక ఖాళీగా ఉన్న సమయంలో ఇతరులకు కూడా అవకాశం ఇస్తారు. – తొలి ప్రాధాన్యత మహిళా ఉద్యోగులకు ఉంటుంది. ఆ తరువాత పురుష రైల్వే ఉద్యోగులకు ఈ వేదికలను కేటాయిస్తారు. – సర్వీసులో ఉన్న రైల్వే సిబ్బందికి తొలి ప్రాధాన్యం కాగా, పదవీ విరమణ పొందిన ఉద్యోగుల తర్వాత ప్రాధాన్యతనిస్తారు. – రైల్వే ఉద్యోగులు ఏటా ఇచ్చే డిక్లరేషన్ పత్రాల ఆధారంగా ఈ కల్యాణ వేదికల కేటాయింపు జరుగుతుంది. – కల్యాణ వేదికల్లో ఒక్కటైన రైల్వే కమ్యూనిటీహాల్ రోజుకు (సాయంత్రం 4.00 గంటల నుంచి మరుసటి రోజు సాయంత్రం 4.00 గంటల) రూ.5 వేలు చొప్పున రైల్వే ఉద్యోగులకు, ఇతరులకు రూ.30 వేలు చొప్పున అద్దె వసూలు చేస్తారు. – రైల్వే ఇన్స్టిట్యూట్ను సభ్యత్వం కల్గిన ఉద్యోగులకు రోజుకు (సాయంత్రం 4.00 గంటల నుంచి మరుసటి రోజు సాయంత్రం 4.00 గంటల) రూ.3 వేలు చొప్పున, రైల్వే ఉద్యోగులకు రోజుకు రూ.5 వేలు, పదవీ విరమణ పొందిన రైల్వే ఉద్యోగుల కుటంబాలకు రూ.4 వేలు, ఇతరులకు రూ.13 వేలు చొప్పున అద్దె వసూలు చేస్తారు. రైల్వే గదులను ఎలా బుక్ చేసుకోవాలంటే... రిజర్వేషన్ టికెట్ కొన్న (టికెట్ కన్ఫార్మ్) ప్రయాణీకులకు మాత్రమే రైల్వే గదులను కేటాయిస్తారు. గదులను ‘‘ఐఆర్సీటీసీ’’ వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రయాణీకులు రైలు ఎక్కే స్టేషన్, రైలు దిగే స్టేషన్ల ఆధారంగా రైల్వే గదుల బుకింగ్ సదుపాయం ఉంటుంది. గదుల్లో ఏసీ, నాన్ ఏసీ, సింగిల్, డబుల్ బెడ్రూమ్లు ఉంటాయి. డివిజన్లోని అన్ని ప్రధాన రైల్వేస్టేషన్లలో ఈ సౌకర్యం ఉంది. గుంతకల్లు రైల్వే జంక్షన్‌లోని గదుల ధరలు ఇలా... జంక్షన్లో మొత్తం 10 గదులున్నాయి. వీటిలో ఒకటి ఏసీ. మిగిలినవి డబుల్ బెడ్రూమ్, సింగిల్ బెడ్ గదులు. ఏసీ గది రోజుకు (ఉదయం 6.00 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6.00 గంటల వరకు) రూ.600, డబుల్‌కాట్ బెడ్రూం రోజుకు రూ.300, సింగిల్‌కాట్ బెడ్రూం రూ.100 అద్దె వసూలు చేస్తారు. – డివిజన్ పరిధిలోని తిరుపతి, రేణిగుంట జంక్షన్లలో ఏసీ డీలక్స్, నాన్ ఏసీ డబుల్, సింగిల్, డార్మెటరీ హాళ్లు ఉన్నాయి. ఏసీ గదికి రూ.600, డబుల్‌కాట్ బెడ్రూంకు రూ.450, సింగిల్‌కాట్ బెడ్రూం రూ.90, డార్మెటరీ హాల్‌కు రూ.175 చొప్పున అద్దె వసూలు చేస్తారు. -
చేనేత గుర్తింపు కార్డులు పొందడం ఇలా..
ధర్మవరం టౌన్ : జిల్లాలో వ్యవసాయం తర్వాత చేనేత రంగానికి అంతటి ప్రాధాన్యత ఉంది. చేనేత కార్మికులకు ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నా.. క్షేత్రస్థాయిలో అమలు కాలేదు. అందుకు కారణం.. చేనేత కార్మికులకు ప్రభుత్వ గుర్తింపు కార్డులు లేకపోవడమే. సంక్షేమ పథకాలు వర్తించాలంటే ప్రతి కార్మికుడికీ గుర్తింపు కార్డులు తప్పనిసరి. అధికారుల ప్రచారలోపం, చేనేత కార్మికుల అవగాహన లేమితో ఇప్పటికీ జిల్లా వ్యాప్తంగా సగానికి పైగా చేనేత కార్మికులు గుర్తింపుకార్డులకు నోచుకోలేదు. జిల్లాలో 1.20 లక్షల మంది చేనేత కార్మికులు ఉండగా కేవలం 62 వేల మంది మాత్రమే గుర్తింపు కార్డులు కలిగి ఉన్నారు. ఫలితంగా చేనేత కార్మికులు రాయితీ రుణాలు, చేనేత ముడిపట్టు రాయితీ, ఎన్‌హెచ్‌డీసీ తదితర పథకాలకు అర్హత పొందలేక పోతున్నారు. చేనేత కార్మికులు ప్రతి ఒక్కరూ ప్రభుత్వ గుర్తింపు కార్డులు పొందడానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలుసుకుందాం. చేనేత గుర్తింపు కార్డులకు ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే.. : - చేనేత కార్మికులు ప్రభుత్వ గుర్తింపు కోసం దరఖాస్తు ఫారం పూర్తి వివరాలతో పూరించాలి. సొంత మగ్గమా..? కూలీ కార్మికుడా అనేది దరఖాస్తు ఫారంలో స్పష్టం చేయాలి. - పూరించిన దరఖాస్తుకు ఆధార్‌కార్డు, రేషన్‌కార్డులను జత చేసి మండల వీఆర్వోతో ధ్రువీకరణ సంతకం చేయించాలి. - ఈ దరఖాస్తును జిల్లా కేంద్రంలో ఉన్న హ్యాండ్లూమ్ ఏడీ కార్యాలయంలోగానీ, డీవో, ఏడీవో ఆయా మండలాలకు సంబంధించిన అధికారికి గానీ ఇవ్వాలి. అధికారులు దరఖాస్తులు స్వీకరించిన అనంతరం వారం రోజుల్లో విచారణ జరిపి ప్రభుత్వ గుర్తింపు కార్డును మంజూరు చేస్తారు. - పై విధంగా చేనేత కార్మికులు దరఖాస్తు చేసుకొని గుర్తింపు కార్డు పొందితే ఎన్నో ప్రయోజనాలు ప్రభుత్వం నుంచి అందే అవకాశం ఉంటుంది. -
మహిళలకు మాస్టర్ హెల్త్ చెకప్
ధర్మవరం అర్బన్ : మహిళలు తమ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ప్రభుత్వం మహిళా మాస్టర్ హెల్త్ చెకప్ (ఎంఎంహెచ్‌సీ) అనే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని కింద 35 ఏళ్లు పైబడిన మహిళలందరికీ 14 రకాల వైద్య పరీక్షలను ఉచితంగా చేస్తారు. 35 ఏళ్లు పైబడిన వారికే ఎందుకంటే.. ? మహిళా ఆరోగ్య సూచి 2015 ప్రకారం 35 ఏళ్లు పైబడిన వారు ఆరోగ్యపరంగా ప్రమాదకర పరిస్థితిలో ఉన్నారు. వారిలో శారీరకంగా ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. పోషకాహార లోపం, ఎముకల బలహీనత, రుతుక్రమంలో వచ్చే మార్పులు, మానసిక ఆందోళనలకు గురవుతున్నారు. ఎక్కువ మంది ప్రాణాంతక కేన్సర్ వ్యాధిబారిన పడుతున్నారు. – జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వివరాల ప్రకారం మన రాష్ట్రంలో 35 నుంచి 40 ఏళ్ల వయసు కలిగిన మహిళల్లో 40 శాతం మందికి రక్తహీనత సమస్య ఉంది. – 17.6 శాతం మంది స్థూలకాయం, 18.1శాతం మంది మధుమేహంతో, 10శాతం మంది అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. ఉచిత పరీక్షలు ఇవే... : ఎంఎంహెచ్‌సీ కార్యక్రమం కింద 14 రకాల పరీక్షల్ని మహిళలకు ఉచితంగా నిర్వహిస్తున్నారు. – పోషకాహారస్థాయి, రక్తంలో చక్కెరస్థాయి, రక్తపోటు, మూత్రపిండాల పనితీరు పరీక్షలు, అల్ట్రాసౌండ్, థైరాయిడ్ పరీక్ష, విటమిన్ డీ3, రక్తంలో కాల్షియం స్థాయి, రక్తహీనత, రక్తంలో కొలెస్ట్రాల్, కంటి పరీక్షలు, సర్వైకల్ కేన్సర్, రొమ్ము కేన్సర్ పరీక్షలు, ఈసీజీ, దంత పరీక్షలు తదితర పరీక్షలు చేస్తారు. నెలలో రెండు వారాలు : – ఎంఎంహెచ్‌సీ అమలుపై క్లస్టర్ల అదనపు జిల్లా ఆరోగ్య వైద్యశాఖాధికారులు, వైద్యాధికారులు, ఆరోగ్య కార్యకర్తలకు ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. ప్రతినెలా రెండో గురువారం, నాలుగో గురువారంలో ఈ కార్యక్రమాన్ని ఎంపిక చేసిన ఆస్పత్రుల్లో అమలు చేస్తున్నారు. ఆయా ఆస్పత్రులకు మహిళల్ని ఆరోగ్య కార్యకర్తలు తీసుకురావాల్సి ఉంటుంది. వైద్య పరీక్షలే కాకుండా వ్యాధి నిర్ధారణయితే చికిత్స ప్రారంభిస్తారు. – మహిళల్లో కేన్సర్ వ్యాధి వ్యాప్తి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో దాన్ని నిలువరించడంపైనే ప్రధాన శ్రద్ధ చూపిస్తారు. అన్ని రకాల కేన్సర్లకు వైద్య సేవలు అందించేలా ఆస్పత్రుల్లో ఏర్పాట్లు చేశారు. – 35 ఏళ్లు పైబడిన మహిళలు 100కు 30 మంది ఉంటారని వైద్య ఆరోగ్యశాఖ అంచనా వేస్తోంది. ఒక్కో ఆరోగ్య కార్యకర్త ప్రతి వారం తమ పరిధిలోని గ్రామాల నుంచి నలుగురిని ఉచిత పరీక్షలకు తీసుకురావాలనే లక్ష్యాన్ని నిర్దేశించారు. – వైద్య సేవలతోపాటు సదరు మహిళలకు వైద్యాధికారులు కౌన్సెలింగ్ ఇస్తారు. శారీరకంగా, మానసికంగా, ధృఢంగా ఉండేలా వారికి కొన్ని అంశాలపై అవగాహన కల్పిస్తారు. -
మహిళా ఉద్యోగుల సెలవులివిగో..!
ధర్మవరం అర్బన్ : ప్రభుత్వశాఖలో పనిచేసే మహిళా ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు అనేక రకాలైన సెలవులు ఉన్నాయి. కానీ వాటి జీవోలు, ఎలాంటి వాటికి సెలవులు ఇస్తారో తెలియక చాలా మంది మహిళా ఉద్యోగులు వాటిని సద్వినియోగం చేసుకోలేక పోతున్నారు. అనారోగ్య పరిస్థితుల్లోనూ విధులకు హాజరై ఇబ్బందులు పడుతుంటారు. మహిళా ఉద్యోగుల కోసం ఈ సమాచారం... – జీఓలు సెలవుల వివరాలు.... – జీఓ ఎంఎస్‌నెం.374 పురుషుల కంటే మహిళా టీచర్లకు 5 సీఎల్‌లు అధికం. – జీఓ ఎంఎస్‌నెం.1415 ఫ్యామిలీ ప్లానింగ్ కోసం 14 రోజులు సెలవు ఇస్తారు. – జీఓ ఎంఎస్‌నెం.124 మొదటి ఆపరేషన్ ఫెయిల్ అయితే రెండో ఆపరేషన్‌కు 14 రోజులు సెలవు ఇస్తారు. – జీఓ ఎంఎస్‌నెం.128 లూప్ వేయించుకున్న రోజు స్పెషల్ సీఎల్ ఇస్తారు. – జీఓ ఎంఎస్‌నెం.102 ఆపరేషన్ తరువాత పిల్లలు చనిపోతే రీకానలైజేషన్ చేయించుకున్న ఉద్యోగికి 21 రోజులు సెలవు ఇస్తారు. – జీఓ ఎంఎస్‌నెం.52 గర్భసంచి తొలగిస్తే సివిల్ అసిస్టెంట్ సర్జన్ సిఫార్స్ మేరకు 45 రోజుల ప్రత్యేక సెలవు ఇస్తారు. – జీఓ ఎంఎస్‌నెం.152, 38 180 రోజుల ప్రసూతి సెలవు ఇస్తారు. ఇది ఇద్దరూ జీవించి ఉన్న పిల్లలకు మాత్రమే వర్తిస్తుంది. – జీఓ ఎంఎస్‌నెం.463 సమ్మర్ హాలిడేస్‌లో ప్రసవించినా, ఇక్కడి నుంచి 180 రోజులు ఇస్తారు. – జీఓ ఎంఎస్‌నెం.762 అబార్షన్‌కు 6 వారాల సెలవు ఇస్తారు. – జీఓ ఎంఎస్‌నెం.39 వివాహానికి రూ.75 వేలు అప్పుగా ఇస్తారు. దీన్ని 70 వాయిదాల్లో 5.50 శాతం వడ్డీతో చెల్లించాలి. -
రోడ్డు భద్రత నిబంధనలు ఇవీ
అనంతపురం సెంట్రల్ : రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. రోడ్డు నియమ నిబంధనలు ఉల్లంఘించి నడుపుతున్న వారిపై కొరఢా ఝుళిపిస్తున్నారు. ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా రోడ్డు నియమ నిబంధనలు పాటించాలి. లేకుంటే చట్ట ప్రకారం శిక్షార్హులు అవుతారని రోడ్డు, రవాణాశాఖ అధికారులు తెలియజేస్తున్నారు. ఎవరైనా వాహనం నడపాలంటే రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, డ్రైవింగ్ లైసెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్ సర్టిఫికెట్ తప్పనిసరి. – రిజిస్ట్రేషన్ లేకపోతే వాహన చట్టం సెక్షన్ 39, 192 ప్రకారం జరిమానా విధిస్తారు. – డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే సెక్షన్ 3, 4 , 180, 181 ప్రకారం జరిమానా లేదా జైలు శిక్ష వేస్తారు. – పొల్యూషన్ సర్టిఫికెట్స్ లేకపోతే సెక్షన్ 190(2) ప్రకారం రూ. 1000 జరిమానా విధిస్తారు. – ఇన్సూరెన్స్ లేకపోతే సెక్షన్ 196(ఏ) ప్రకారం 3 నెలలు జైలు శిక్ష, రూ. 1000 జరిమానా విధిస్తారు. మద్యం తాగి నడిపితే : మద్యం సేవించి వాహనం నడుపరాదు. మోటారు వాహన చట్టం సెక్షన్ 185 ప్రకారం ఆరు నెలల వరకు జైలు శిక్ష విధించబడుతుంది. ర్యాష్ డ్రైవింగ్‌కు పాల్పడితే : ర్యాష్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్ నేరంగా పరిగణిస్తారు. మోటారు వాహన చట్టం సెక్షన్ 184 ప్రకారం 6 నెలల వరకు జైలు శిక్ష లేదా రూ.1000 జరిమానా విధిస్తారు. పరిమితికి మించి ఆటోల్లో ప్రయాణిస్తే : పరిమితికి మించి ఆటోల్లో ప్రయాణికులకు ఎక్కించుకొని వెలితే మోటారు వాహన చట్టం సెక్షన్ 86 ప్రకారం జరిమానా లేదా పర్మిట్‌పై చర్యలు తీసుకుంటారు. సీట్ బెల్ట్ ధరించకపోతే : సీఎంవీ రూల్ 138(3) ప్రకారం విధిగా సీట్ బెల్ట్ ధరించాలి. సీట్ బెల్ట్ ధరించకపోతే మోటారు వాహన చట్టం సెక్షన్ 177 ప్రకారం జరిమానా రూ.100 విధించబడుతుంది. స్కూల్ బస్సులు నిబంధనలు పాటించకపోతే : ఏపీ మోటారు వాహనాల నియమావళి 1989 నందు 185(జి) ప్రకారం పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించుకున్నా, 60 ఏళ్లు దాటిన వారు డ్రైవింగ్ చేసినా, పర్మిట్ నిబంధనలు ఉల్లంఘించినా మోటారు వాహన చట్టం సెక్షన్ 86 ప్రకారం జరిమానా లేదా పర్మిట్‌పై చర్యలు తీసుకుంటారు. సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనం నడిపితే : సెల్ఫోన్లో మాట్లాడుతూ వాహనాలు నడపడం అత్యంత ప్రమాదకరం, నిబందన అతిక్రమించిన వారికి వాహన చట్టం సెక్షన్ 184 ప్రకారం రూ. 1000 జరిమానా లేదా సీఎంవీ రూల్ 21(6) ప్రకారం డ్రైవింగ్ లైసెన్స్ తాత్కాలికంగా నిలిపివేస్తారు. హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే : హెల్మెట్ ధారణ ప్రాణానికి రక్షణ. మోటారు వాహనాల చట్టం సెక్షన్ 129 ప్రకారం హెల్మెట్ తప్పని సరిగా ధరించాలి. లేని రూ.100 జరిమానా విధిస్తారు. అతి వేగం ప్రమాదకరం : వాహనాలను అతివేగంగా నడపటం అత్యంత ప్రమాదకరం. మోటారు వాహనాల చట్టం సెక్షన్ 112, 183 (1) ప్రకారం జరిమానా లేదా జైలు శిక్ష పడుతుంది.