మహిళలకు మాస్టర్ హెల్త్ చెకప్
ధర్మవరం అర్బన్ : మహిళలు తమ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ప్రభుత్వం మహిళా మాస్టర్ హెల్త్ చెకప్ (ఎంఎంహెచ్‌సీ) అనే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని కింద 35 ఏళ్లు పైబడిన మహిళలందరికీ 14 రకాల వైద్య పరీక్షలను ఉచితంగా చేస్తారు.
35 ఏళ్లు పైబడిన వారికే ఎందుకంటే.. ?
మహిళా ఆరోగ్య సూచి 2015 ప్రకారం 35 ఏళ్లు పైబడిన వారు ఆరోగ్యపరంగా ప్రమాదకర పరిస్థితిలో ఉన్నారు. వారిలో శారీరకంగా ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. పోషకాహార లోపం, ఎముకల బలహీనత, రుతుక్రమంలో వచ్చే మార్పులు, మానసిక ఆందోళనలకు గురవుతున్నారు. ఎక్కువ మంది ప్రాణాంతక కేన్సర్ వ్యాధిబారిన పడుతున్నారు.
– జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వివరాల ప్రకారం మన రాష్ట్రంలో 35 నుంచి 40 ఏళ్ల వయసు కలిగిన మహిళల్లో 40 శాతం మందికి రక్తహీనత సమస్య ఉంది.
– 17.6 శాతం మంది స్థూలకాయం, 18.1శాతం మంది మధుమేహంతో, 10శాతం మంది అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు.
ఉచిత పరీక్షలు ఇవే... :
ఎంఎంహెచ్‌సీ కార్యక్రమం కింద 14 రకాల పరీక్షల్ని మహిళలకు ఉచితంగా నిర్వహిస్తున్నారు.
– పోషకాహారస్థాయి, రక్తంలో చక్కెరస్థాయి, రక్తపోటు, మూత్రపిండాల పనితీరు పరీక్షలు, అల్ట్రాసౌండ్, థైరాయిడ్ పరీక్ష, విటమిన్ డీ3, రక్తంలో కాల్షియం స్థాయి, రక్తహీనత, రక్తంలో కొలెస్ట్రాల్, కంటి పరీక్షలు, సర్వైకల్ కేన్సర్, రొమ్ము కేన్సర్ పరీక్షలు, ఈసీజీ, దంత పరీక్షలు తదితర పరీక్షలు చేస్తారు.
నెలలో రెండు వారాలు :
– ఎంఎంహెచ్‌సీ అమలుపై క్లస్టర్ల అదనపు జిల్లా ఆరోగ్య వైద్యశాఖాధికారులు, వైద్యాధికారులు, ఆరోగ్య కార్యకర్తలకు ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. ప్రతినెలా రెండో గురువారం, నాలుగో గురువారంలో ఈ కార్యక్రమాన్ని ఎంపిక చేసిన ఆస్పత్రుల్లో అమలు చేస్తున్నారు. ఆయా ఆస్పత్రులకు మహిళల్ని ఆరోగ్య కార్యకర్తలు తీసుకురావాల్సి ఉంటుంది. వైద్య పరీక్షలే కాకుండా వ్యాధి నిర్ధారణయితే చికిత్స ప్రారంభిస్తారు.
– మహిళల్లో కేన్సర్ వ్యాధి వ్యాప్తి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో దాన్ని నిలువరించడంపైనే ప్రధాన శ్రద్ధ చూపిస్తారు. అన్ని రకాల కేన్సర్లకు వైద్య సేవలు అందించేలా ఆస్పత్రుల్లో ఏర్పాట్లు చేశారు.
– 35 ఏళ్లు పైబడిన మహిళలు 100కు 30 మంది ఉంటారని వైద్య ఆరోగ్యశాఖ అంచనా వేస్తోంది. ఒక్కో ఆరోగ్య కార్యకర్త ప్రతి వారం తమ పరిధిలోని గ్రామాల నుంచి నలుగురిని ఉచిత పరీక్షలకు తీసుకురావాలనే లక్ష్యాన్ని నిర్దేశించారు.
– వైద్య సేవలతోపాటు సదరు మహిళలకు వైద్యాధికారులు కౌన్సెలింగ్ ఇస్తారు. శారీరకంగా, మానసికంగా, ధృఢంగా ఉండేలా వారికి కొన్ని అంశాలపై అవగాహన కల్పిస్తారు.