చికుబుకు రైలు...సేవలెన్నో చూడు | uses of trains | Sakshi
Sakshi News home page

చికుబుకు రైలు...సేవలెన్నో చూడు

Published Fri, Sep 15 2017 10:01 PM | Last Updated on Tue, Sep 19 2017 4:36 PM

చికుబుకు రైలు...సేవలెన్నో చూడు

చికుబుకు రైలు...సేవలెన్నో చూడు

ప్రయోజనం

రైలు...అనగానే ఒక గమ్యస్థానం నుంచి మరో గమ్యస్థానానికి చేరుస్తుందని మాత్రమే చాలా మందికి అనుకుంటుంటారు. కానీ రైల్వే టికెట్‌ బుక్‌ చేసుకోవడం ఎలా...ప్లాట్‌ఫారం టికెట్‌ ఎందుకు కొనాలి..రద్దు చేసుకునే ఎంత మొత్తం వెనక్కు వస్తుంది..తదితర వివరాలేవీ చాలా మందికి తెలియవు. మరోవైపు రైల్వేశాఖ ప్రయాణికుల సౌకర్యార్థం ఎన్నో సేవలు అందిస్తోంది. ద్విచక్రవాహనాలను తరలింపు నుంచి కల్యాణ వేదికలను అద్దెకివ్వడం వరకూ ఎన్నో విధాలుగా ఉపయోగపడుతోంది. ఇలా రైల్వే అందిస్తున్న సేవల సమాహారమే ఈ కథనం.

గుంతకల్లు: సుదూర ప్రాంతాలకు వెళ్లే రైలు ప్రయాణికులు మూడు నెలల ముందుగానే టికెట్లు రిజర్వేషన్‌ చేసుకునే అవకాశం ఉంది. టిక్కెట్‌ కన్ఫర్మ్‌ అయిన తర్వాత ప్రయాణ సమయానికి 24 గంటల్లోపు టికెట్‌ రద్దు చేసుకుంటే ఒక రేటు, వెయిటింగ్‌ లిస్టు టికెట్‌ రద్దు చేసుకుంటే ఒకవిధంగా డబ్బు వెనక్కు వస్తుంది.

కన్ఫర్మేషన్‌ టికెట్‌ రద్దు చేసుకుంటే..
– స్లీపర్‌ టికెట్‌ రద్దు చేసుకుంటే రూ.120 పోను మిగతా సొమ్ము వెనక్కు వస్తుంది.
– ఏసీ చైర్, త్రీటైర్‌ టికెట్లు రద్దు చేసుకుంటే రూ.190 కట్‌ అవుతుంది. రైలు బయలుదేరే ముందు 4 గంటల్లోపు రద్దు చేసుకోవాలి. లేకపోతే టిక్కెట్‌ ధర మొత్తం వాపసు ఇవ్వడం కుదరదని రైల్వే వర్గాలు తెలిపాయి.

వెయిటింగ్‌ లిస్టు టికెట్‌ రద్దు చేసుకుంటే...
– స్లీపర్‌ క్లాస్‌ టికెట్‌ రద్దు చేసుకుంటే రూ.60, ఏసీ చైర్, త్రీటైర్‌ టికెట్లకు రూ.65 కట్‌ అవుతుంది. రైలు బయలుదేరడానికి 4 గంటల ముందు టికెట్‌ రద్దు చేసుకుంటే రైల్వే వర్గాలు నిర్ణయించిన ప్రకారం డబ్బు వాపసు వస్తుంది.

తత్కాల్‌ టికెట్‌ పొందడం ఇలా...
–ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ ద్వారా తత్కాల్‌ టికెట్‌  పొందవచ్చు. ప్రయాణ తేదీకి ఒక రోజు ముందు ఈ టికెట్‌ జారీ చేస్తారు.
– ఉదయం 10.00 గంటలకు ఏసీ క్లాస్‌ టికెట్లు, 11.00 గంటలకు ద్వితీయ శ్రేణి టికెట్లను తత్కాల్‌ పద్ధతిన బుక్‌ చేసుకోవచ్చు.
– రిజర్వేషన్‌ సౌలభ్యం ఉన్న ప్రతి రైలులో తత్కాల్‌ టికెట్‌ ద్వారా బెర్త్‌లు రిజర్వు చేసుకోవచ్చు. సీనియర్‌ సిటిజన్స్‌కు రాయితీలు వర్తించవు.
– ఒక దరఖాస్తు ద్వారా గరిష్టంగా నలుగురు సభ్యులు మాత్రమే తత్కాల్‌ టికెట్లు రిజర్వు చేసుకోవచ్చు.
– టికెట్‌ బుక్‌ చేసుకునే సమయంలో ఏవిధమైన గుర్తింపు కార్డు అవసరం లేదు. కానీ ప్రయాణ సమయంలో మాత్రం తత్కాల్‌ టికెట్‌ (ఒరిజినల్‌) చూపించడంతోపాటు ఆధార్, ఓటరు కార్డు లేదా పాన్‌కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ వీటిల్లో ఏదైనా ఒక పత్రం చూపించాల్సి ఉంటుంది.
– తత్కాల్‌ టికెట్‌ పొందాలంటే ప్రయాణించే దూరాన్ని బట్టి చార్జీలు వసూలు చేస్తారు. స్లీపర్‌ క్లాస్‌కు కనిష్టంగా రూ.100, గరిష్టంగా రూ.200, అదేవిధంగా ఏసీ చైర్‌కార్‌కు కనిష్టంగా రూ.125, గరిష్టంగా రూ.225, ఏసీ త్రీటైర్‌కు కనిష్టంగా రూ.300, గరిష్టంగా రూ.400, ఏసీ 2టైర్‌కు కనిష్టంగా రూ.400 గరిష్టంగా రూ.500 చెల్లించాల్సి ఉంటుంది.
– కన్ఫర్మ్‌ అయిన తత్కాల్‌ టికెట్‌ రద్దు చేసుకుంటే డబ్బు వాపసు ఇవ్వరు. వెయిటింగ్‌ లిస్టులో ఉండి రైలు బయలుదేరడానికి 4 గంటల ముందు రద్దు చేసుకుంటే 50 శాతం నగదు వెనక్కు ఇస్తారు.

ద్విచక్ర వాహనం బుక్‌ చేసుకోవడం ఇలా...
ద్విచక్ర వాహనాలను యజమానులు స్లీపర్‌ టికెట్, జనరల్‌ టికెట్‌తో తమ ద్విచక్రవాహనాన్ని రైలులో రవాణా చేసుకోవచ్చు. వాహనదారుడు  ఒరిజినల్‌ ఆర్‌సీ జిరాక్స్‌ ప్రతులు ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా వాహనంలో పెట్రోల్‌ లేకుండా చూసుకోవాలి. రైల్వే పార్శిల్‌ కార్యాలయంలోని కూలీలు గోనెసంచి, గడ్డి, ప్లాస్టిక్‌ కవర్లతో ప్యాకింగ్‌ చేసినందుకు రూ.200 కూలీ చెల్లించాల్సి ఉంటుంది. వాహనం బరువు ప్రకారం 100 కి.మీలకు లగేజీ టిక్కెట్‌ కింద రూ.345, ఆ తర్వాత రైలును బట్టి కి.మీ కొంత చొప్పున చార్జీలు వసూలు చేస్తారు. అదేవిధంగా వాహనం రైల్వేస్టేషన్‌కు చేరుకున్నాక కూడా తీసుకోకపోతే గంటకు రూ.10 చొప్పున అదనంగా చెల్లించాల్సి ఉంటుందన్నారు.

ప్లాట్‌ఫారం టిక్కెట్‌ ఎందుకు తీసుకోవాలి...
1989 రైల్వే చట్టం ప్రకారం రైల్వేస్టేషన్‌లోని ప్లాట్‌ఫారాల్లోకి ప్రవేశించే ప్రతి వ్యక్తీ తప్పనిసరిగా ప్లాట్‌ఫారం టిక్కెట్‌ కొనాల్సి ఉంది. స్టేషన్, ప్లాట్‌ఫారాల పరిసరాల్లో ఉండే వ్యక్తి సంబంధిత అధికారులు అడిగినప్పుడు తప్పకుండా టిక్కెట్‌ లేదా ప్లాట్‌ఫారం టిక్కెట్‌ చూపాల్సి ఉంటుంది. ఈ రెండూ టికెట్లు లేకుండా రైల్వే టికెట్‌ చెకింగ్‌ ఇన్‌స్పెక్టర్‌కు పట్టుబడితే రూ.250 జరిమానా, మినిమం చార్జీ కింద రూ.50 కలిపి మొత్తం రూ.300 ఫైన్‌గా కట్టాల్సి ఉంటుంది. ప్లాట్‌ఫారం టికెట్‌ గానీ, ప్రయాణ టిక్కెట్‌ గానీ ఉంటే స్టేషన్‌లో అనుకోని ప్రమాదం జరిగినప్పుఽడు సంబంధిత వ్యక్తికి రైల్వే సంస్థ ద్వారా నష్టపరిహారం అందే అవకాశం ఉంటుంది. రైలు ప్లాట్‌ఫారం టిక్కెట్‌ చెల్లుబాటు సమయం 3 గంటలు.

పోర్టర్‌ చార్జీలు ఇలా....
వృద్ధులు, జబ్బుపడిన వారు, వికలాంగులను రైల్వేస్టేషన్‌ లోపలికి, బయటికి తీసుకురావడానికి మినిమం చార్జీ (కూలీ) కింద రూ.50 వసూలు చేస్తారు. అదే విధంగా సాధారణ ప్రయాణీకులు తమ లగేజీని రైల్వేస్టేషన్‌ లోపలికి, బయటికి తీసుకురావడానికి మినిమం (40 కిలోల తూకం కల్గిన బ్యాగులను  మోసుకెళ్లడానికి) రూ.50, లగేజ్‌ ట్రాలీలో తరలించడానికి రూ.80 చొప్పున పోర్టర్లు వసూలు చేస్తారు.

రైల్వే కల్యాణ మండపాల బుకింగ్‌ ఇలా....
డివిజన్‌ కేంద్రం గుంతకల్లులోని రైల్వే కమ్యూనిటీహాల్, రైల్వే ఇన్‌స్టిట్యూట్‌లు శుభకార్యాలకు అద్దెకు ఇస్తుంటారు. రైల్వే ఉద్యోగుల ఇంట జరిగే శుభకార్యాలకు కల్యాణవేదిక, ఫంక్షన్‌ హాళ్ల ఇబ్బంది తలెత్తకూడదన్న ఉద్దేశంతో  1978లో అప్పటి రైల్వే శాఖ మంత్రి మధుదండవళె వీటిని నిర్మించారు. రైల్వే ఉద్యోగులకు నామమాత్రపు రేట్లతో ఈ వేదికలను అద్దెకు ఇస్తారు. ఈ వేదిక ఖాళీగా ఉన్న సమయంలో ఇతరులకు కూడా అవకాశం ఇస్తారు.

– తొలి ప్రాధాన్యత మహిళా ఉద్యోగులకు ఉంటుంది. ఆ తరువాత పురుష రైల్వే ఉద్యోగులకు ఈ వేదికలను కేటాయిస్తారు.
– సర్వీసులో ఉన్న రైల్వే సిబ్బందికి తొలి ప్రాధాన్యం కాగా, పదవీ విరమణ  పొందిన ఉద్యోగుల తర్వాత ప్రాధాన్యతనిస్తారు.
– రైల్వే ఉద్యోగులు ఏటా ఇచ్చే డిక్లరేషన్‌ పత్రాల ఆధారంగా ఈ కల్యాణ వేదికల కేటాయింపు జరుగుతుంది.
– కల్యాణ వేదికల్లో ఒక్కటైన రైల్వే కమ్యూనిటీహాల్‌ రోజుకు (సాయంత్రం 4.00 గంటల నుంచి మరుసటి రోజు సాయంత్రం 4.00 గంటల) రూ.5 వేలు చొప్పున రైల్వే ఉద్యోగులకు, ఇతరులకు రూ.30 వేలు చొప్పున అద్దె వసూలు చేస్తారు.
– రైల్వే ఇన్‌స్టిట్యూట్‌ను సభ్యత్వం కల్గిన ఉద్యోగులకు రోజుకు (సాయంత్రం 4.00 గంటల నుంచి మరుసటి రోజు సాయంత్రం 4.00 గంటల) రూ.3 వేలు చొప్పున, రైల్వే ఉద్యోగులకు రోజుకు రూ.5 వేలు, పదవీ విరమణ పొందిన రైల్వే ఉద్యోగుల కుటంబాలకు రూ.4 వేలు, ఇతరులకు రూ.13 వేలు చొప్పున అద్దె వసూలు చేస్తారు.

రైల్వే గదులను ఎలా బుక్‌ చేసుకోవాలంటే...
రిజర్వేషన్‌ టికెట్‌ కొన్న (టికెట్‌ కన్ఫార్మ్‌) ప్రయాణీకులకు మాత్రమే రైల్వే గదులను కేటాయిస్తారు. గదులను ‘‘ఐఆర్‌సీటీసీ’’ వెబ్‌సైట్‌ ద్వారా బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రయాణీకులు రైలు ఎక్కే స్టేషన్, రైలు దిగే స్టేషన్‌ల ఆధారంగా రైల్వే గదుల బుకింగ్‌ సదుపాయం ఉంటుంది. గదుల్లో ఏసీ, నాన్‌ ఏసీ, సింగిల్, డబుల్‌ బెడ్‌రూమ్‌లు ఉంటాయి. డివిజన్‌లోని అన్ని ప్రధాన రైల్వేస్టేషన్లలో ఈ సౌకర్యం ఉంది.

గుంతకల్లు రైల్వే జంక్షన్‌లోని గదుల ధరలు ఇలా...
జంక్షన్‌లో మొత్తం 10 గదులున్నాయి. వీటిలో ఒకటి ఏసీ. మిగిలినవి డబుల్‌ బెడ్‌రూమ్, సింగిల్‌ బెడ్‌ గదులు. ఏసీ గది రోజుకు (ఉదయం 6.00 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6.00 గంటల వరకు) రూ.600, డబుల్‌కాట్‌ బెడ్‌రూం రోజుకు రూ.300, సింగిల్‌కాట్‌ బెడ్‌రూం రూ.100 అద్దె వసూలు చేస్తారు.
– డివిజన్‌ పరిధిలోని తిరుపతి, రేణిగుంట జంక్షన్‌లలో ఏసీ డీలక్స్, నాన్‌ ఏసీ డబుల్, సింగిల్, డార్మెటరీ హాళ్లు ఉన్నాయి. ఏసీ గదికి రూ.600, డబుల్‌కాట్‌ బెడ్‌రూంకు రూ.450, సింగిల్‌కాట్‌ బెడ్‌రూం రూ.90, డార్మెటరీ హాల్‌కు రూ.175 చొప్పున అద్దె వసూలు చేస్తారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement