గుంతకల్లు: భార్య వేధింపులు తాళలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. బాధిత కుటుంబసభ్యులు, పోలీసులు తెలిపిన మేరకు.... పాత గుంతకల్లుకు చెందిన వడ్డె రోహిత్‌కుమార్ (24) బజాజ్ షోరూంలో మెకానిక్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఏడాది క్రితం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుకు చెందిన లక్ష్మీదేవితో ఆయనకు వివాహమైంది. పెళ్లి అయినప్పటి నుంచి భర్తను సూటిపోటి మాటలతో లక్ష్మీదేవి మానసిక క్షోభకు గురి చేస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే ఈ ఏడాది జనవరిలో లక్ష్మీదేవి మగ బిడ్డకు జన్మనిచ్చింది.
అప్పటి నుంచి ఆమె కాపురానికి రాకుండా పుట్టింట్లోనే ఉండిపోయింది. కాపురానికి రావాలని భర్త పలుమార్లు ప్రాధేయపడ్డాడు. అయితే తాను పెట్టిన కండీషన్లు ఒప్పుకుంటే కాపురానికి వస్తానని ఆ సమయంలో ఆమె చెబుతూ వచ్చింది. విషయం తెలుసుకున్న రోహిత్‌కుమార్ తల్లిదండ్రులు కోడలి కండీషన్ల మేరకు ఆమె పేరుతో కొంత, బాబు పేరుతో మరికొంత స్థలం రాసిచ్చిన తర్వాత కాపురానికి వచ్చింది. ఈ క్రమంలో మూడు నెలల క్రితం బాబు చనిపోయాడు.
ఆ తర్వాత భర్తను వదిలి లక్ష్మీదేవి పుట్టింటికి వెళ్లిపోయింది. తన భార్య వేధిస్తున్న విషయంపై ఆరు రోజుల క్రితం గుంతకల్లు రెండో పట్టణ పోలీసులకు రోహిత్ ఫిర్యాదు చేశాడు. దీంతో సీఐ గణేష్ ఇరువురి వాదనలు విన్నారు. తర్వాత పెద్దల సమక్షంలో తామే పంచాయితీ చేసుకుంటామని బాధితులు తెలపడంతో వారిని అక్కడి నుంచి పంపించేశారు. సమస్య మరింత జఠిలం కావడంతో జీవితంపై విరక్తి పెంచుకున్న రోహిత్ గురువారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఆందోళన
లక్ష్మీదేవిపై చర్య తీసుకోవడంతో పాటు సీఐ గణేష్ అక్కడకు వచ్చి సమాధానం చెప్పాలంటూ శుక్రవారం ఉదయం ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ప్రధాన రహదారిపై రోహిత్ బంధువులు బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... లక్ష్మీదేవి పెట్టిన కండీషన్ల మేరకు 20 సెంట్ల స్థలాన్ని బాబుతో పాటు ఆమె పేరుతో రాసిచ్చినట్లు తెలిపారు. బాబు చనిపోయినప్పుడు లక్ష్మీదేవి ప్రవర్తనపై అనుమానం వచ్చిందన్నారు.
ఆ సమయంలో భార్యాభర్తల మధ్య పెద్ద గొడవ జరిగిందని, బాబు చనిపోయిన రాత్రే ఆమె పుట్టింటికి వెళ్లిపోయిందని వివరించారు. అప్పటి నుంచి భర్తకు తరచూ ఫోన్లు చేస్తూ వేధిస్తూ వచ్చిందన్నారు. న్యాయం చేయాలని సీఐ గణేష్‌ను ఆశ్రయిస్తే ఆయన సైతం తమకు వ్యతిరేకంగా మాట్లాడడంతో పాటు రోహిత్‌ను దుర్భాషలాడడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. టూటౌన్ సీఐ గణేష్ అందుబాటులో లేకపోవడంతో వన్‌టౌన్ సీసీ రామసుబ్బయ్య అక్కడకు చేరుకుని బాధితులకు సర్దిచెప్పి ఆందోళన విరమింపజేశారు. మృతుడి తండ్రి క్రిష్టప్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment