జాతీయ రహదారి భద్రత వర్క్‌షాప్‌లో సిఫారసులు
సాక్షి, విశాఖపట్నం: రహదారి భద్రతకు సంయుక్తంగా పాటుపడాలని అన్ని రాష్ట్రాలు నిర్ణయించాయి. ఇందుకోసం వినూత్న విధానాలను ప్రవేశపెట్టాలని సిఫారసు చేశాయి. రక్తమోడుతున్న రహదారుల్లో 2020 నాటికి ప్రమాదాల సంఖ్య సగానికి తగ్గించాలనే బ్రెజీలియా డిక్లరేషన్ స్ఫూర్తిగా విశాఖలో రెండు రోజులపాటు జరిగిన జాతీయ రహదారి భద్రత వర్క్‌షాప్ శనివారం సాయంత్రం ముగిసింది. వివిధ రాష్ట్రాల మంత్రులు, రవాణాశాఖ కమిషనర్లు, ఐదు దేశాల ప్రతినిధులు ఇందులో పాల్గొని రహదారి భద్రతపై విస్తృతంగా చర్చించి సిఫార్సులు చేశారు.
వచ్చే పార్లమెంటు సమావేశాల్లో వీటి ఆమోదానికి చర్యలు తీసుకోవాలంటూ కేంద్రానికి సూచించారు. పర్వతప్రాంతాలు ఎక్కువున్న హిమాచల్, మేఘాలయలాంటి రాష్ట్రాల్లో రోడ్డుభద్రతపై చర్చించి సిఫార్సులు చేయాలని నిర్ణయించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి రాష్ట్రంలోనూ లీడ్ ఏజెన్సీని ఏర్పాటు చేయాలని, కేరళ ప్రభుత్వం అనుసరిస్తున్న ‘నో హెల్మెట్-నో పెట్రోల్’ విధానాన్ని అన్నిరాష్ట్రాల్లో అమలు చేయడంపై దృష్టి పెట్టాలని, రోడ్ల వెంబడి ఉండే ప్రైవేటు ఆస్పత్రుల్లో ట్రామాకేర్ సెం టర్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టడంతోపాటు పరికరాల కొనుగోలుకు ఆర్థికసాయమందించాలని సిఫారసు చేసింది.