ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో నూతన రామాలయానికి నేటితో (జనవరి 22)తో ఒక ఏడాది పూర్తయ్యింది. ఇప్పుడు రామాలయం దేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా మారింది. ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం రామాలయ ప్రాణ ప్రతిష్ఠ వేడుక మొదటి వార్షికోత్సవం నేడు. ఈ సందర్భంగా రామ్‌లల్లాను దర్శనం చేసుకునేందుకు సుదూర ప్రాంతాల నుండి భక్తులు అయోధ్యకు చేరుకుంటున్నారు. చలి వాతావరణం ఉన్నప్పటికీ, ఇక్కడికి వస్తున్న రామ భక్తులు ఎంతో ఉత్సాహంగా కనిపిస్తున్నారు.
శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ హిందూ పంచాంగాన్ని అనుసరించి జనవరి 11న తొలి ప్రాణప్రతిష్ఠ వార్షికోత్సవాన్ని నిర్వహించింది. అయోధ్యలో రామమందిర ప్రాణ ప్రతిష్ఠ వార్షికోత్సవం సందర్భంగా.. ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళాకు వచ్చినవారు అయోధ్యకు కూడా తరలివస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని, భక్తులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అయోధ్య ధామ్‌లో ట్రస్ట్ పలు సదుపాయాలు కల్పించింది.
అయోధ్య ఎస్పీ మధుసూదన్ సింగ్ విలేకరులతో మాట్లాడుతూ, అయోధ్యకు భక్తుల రాక అధికంగా ఉన్నందున పోలీసు యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసిందని, ఇన్‌స్పెక్టర్లు, సబ్-ఇన్‌స్పెక్టర్లు, కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు అయోధ్యలో ప్రత్యేక విధులు నిర్వహిస్తున్నారన్నారు. సెక్టార్ జోన్ వద్ద పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేశామన్నారు. సరయు ఘాట్‌లో స్నానం చేసిన తర్వాత, భక్తులు నాగేశ్వర్ ధామ్, హనుమాన్ హనుమాన్ గర్హి, రామ్ లల్లాను సందర్శిస్తారని ఆయన తెలిపారు.
అందరికీ బాలరాముని దర్శనం కల్పించేందుకు సౌకర్యవంతమైన ఏర్పాట్లు చేశామన్నారు. రామ మందిర భవననిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా మాట్లాడుతూ ఆలయంలోని గ్రౌండ్ ఫ్లోర్, మొదటి, రెండవ అంతస్తుల పనులు మార్చి నాటికి పూర్తవుతాయని తెలిపారు. అదేవిధంగా ఆలయం లోపల ఐకానోగ్రఫీ, ఇతర క్లాడింగ్ పనులు, గ్రౌండ్ ఫ్లోర్, మొదటి ఫ్లోర్ రెండవ ఫ్లోర్ పనులు చురుకుగా సాగుతున్నాయన్నారు.
ఇది కూడా చదవండి: Mahakumbh: నాగసాధువులుగా మారిన మహిళా సాధకులు
Comments
Please login to add a commentAdd a comment