అయోధ్య రామ భక్తులకు శుభవార్త
దేశంలోని రామభక్తుల కల నెరవేరింది. అయోధ్యలో రామాలయం నిర్మితమయ్యింది. లక్షలాది భక్తులు రాములోరిని చూసేందుకు తరలివస్తున్నారు. అయితే వారు అక్కడ సరైన వసతి సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇకపై ఇటువంటి సమస్యలకు ఫుల్స్టాప్ పడనుంది.
అయోధ్య ధామ్‌లో భక్తుల కోసం 158 కొత్త హోటళ్లను నిర్మించేందుకు సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ హోటళ్లను వీలైనంత త్వరగా నిర్మించనున్నారని సమాచారం. ఈ ఏడాది ఎనిమిది వేల గదులు భక్తులకు అందుబాటులోకి రానున్నాయి.
ప్రస్తుతానికి పర్యాటకులకు 175 హోటళ్లు, అతిథి గృహాలు, డేరా సిటీలలో 30 వేల మంది భక్తులకు బస చేసేందుకు ఏర్పాట్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే రిజిస్టర్ అయిన 158 కొత్త హోటళ్ల నిర్మాణం పూర్తయ్యాక అయోధ్య ధామ్‌లోని హోటళ్లు, అతిథి గృహాల సంఖ్య 333కి పెరగనుంది.
ఇది కూడా చదవండి: తొలిరోజు విరాళాలు రూ.3.17 కోట్లు!
యూపీ పర్యాటక మంత్రిత్వ శాఖ అయోధ్యలో నిర్మిస్తున్న హోటళ్లను కాంస్య (ఒక నక్షత్రం), వెండి (రెండు నక్షత్రాలు), బంగారం (త్రీ స్టార్), డైమండ్ (నాలుగు నక్షత్రాలు), ప్లాటినం (ఫైవ్ స్టార్)గా వర్గీకరించే సదుపాయాన్ని కూడా కల్పించింది.
కొత్త టూరిజం పాలసీ ప్రకారం నూతనంగా నిర్మితమవుతున్న ఈ హోటళ్లకు ఇంటి పన్ను, నీటి పన్ను, ఇతర పన్నుల్లో 50 శాతం వరకు రాయితీని ప్రభుత్వం అందిస్తోంది. జనరల్ కేటగిరీకి 25 శాతం, మహిళలు, షెడ్యూల్డ్ కులాలకు 30 శాతం సబ్సిడీ కల్పిస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి ఈ హోటళ్ల నిర్మాణం పూర్తికానున్నదని యూపీ పర్యాటక శాఖ మంత్రి జైవీర్ తెలిపారు.