9 పట్టణాల్లో ట్రాఫిక్ పార్కులు
Published Wed, Mar 15 2017 1:44 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
ఏలూరు సిటీ : జిల్లాలోని 9 పట్టణాల్లో మే 15 నాటికి 9 ట్రాఫిక్ పార్కులు ఏర్పాటు చేస్తున్నట్టు కలెక్టర్ డాక్టర్ కె.భాస్కర్ చెప్పారు. మంగళవారం జిల్లాస్థాయి రోడ్డు భద్రతా కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల్లో జిల్లా దేశంలోనే ప్రథమస్థానంలో ఉందని, ఈ పరిస్థితిని నివారించేందుకు రోడ్డు భద్రతపై అనేక కఠిన నిర్ణయాలు అమలు చేయాల్సిన బాధ్యత జిల్లా యంత్రాంగంపై ఉందన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఏలూరు నగరపాలక సంస్థతో పాటు 9 పురపాలక సంఘాల్లో ట్రాఫిక్ పార్కులు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు ఈ పార్కులను మే 15 నాటికి పట్టణాల్లో ఏర్పాటు చేస్తే కమిషనర్లకు అదనపు ఇంక్రిమెంట్లు మంజూరు చేసేలా ప్రభుత్వానికి సిఫార్సు చేస్తానని చెప్పారు. జిల్లాలో తరచూ రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయని ప్రతిరోజూ రెండు, మూడు ప్రమాదాలు జరిగుతుంటే ఐదారుగురు చనిపోతున్నారని, ఈ పరిస్థితిని నివారించాలి్సన బా«ధ్యత అందరిపై ఉందన్నారు.
ఏప్రిల్ 1 నుంచి ప్రధాన రహదారుల్లో మద్యం షాపులు తొలగింపు
జిల్లాలోని జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులపై ఏప్రిల్ 1 నుంచి ఒక్క మద్యం దుకాణాలు కనిపించేందుకు వీలులేదని కలెక్టర్ భాస్కర్ అధికారులను ఆదేశించారు. ప్రధాన రహదారుల్లో మద్యం షాపులు లేకుండా చర్యలు తీసుకోవాలని, మద్యం తాగాలనే కోరిక కలిగించే ప్రచార బోర్డులు కూడా కనిపించేందుకు వీలులేదన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు జాతీయ రహదారులతో పాటు రాష్ట్ర ప్రధాన రహదారుల్లోనూ మద్యంషాపులు ఇకపై కనిపించబోవని స్పష్టం చేశారు. జాతీయ రహదారిపై ఏ చిన్న గొయ్యి కనిపించినా సహించబోమని, టోల్‌ప్లాజాలు ఏర్పాటు చేసుకుని ప్రజల నుంచి ఎలా పన్నులు వసూలు చేస్తున్నారో అదేస్థాయిలో జాతీయ రహదారులపై నిబంధనలు కచ్చితంగా పాటించాలని కలెక్టర్ చెప్పారు. జాతీయ రహదారులపై 27 చోట్ల గుంటలు ఉన్నట్లు పరిశీలనలో తేలిందని, వాటిని మూడురోజుల్లోగా మరామ్మత్తులు చేయాలని ఎన్‌హెచ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఇకపై గొయ్యి కన్పించిందని ఎవరైనా ఫిర్యాదు చేస్తే 24 గంటల్లో గోతులు సంబంధిత అధికారులు పూడ్చివేయకుంటే కలెక్టర్‌గా కాకుండా జిల్లా మేజిస్ట్రేట్ హోదాలో బా«ధ్యులను జైలుకు పంపించేందుకు వెనుకాడబోనని స్పష్టం చేశారు. జిల్లాలో 45 ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు అధికంగా జరిగేందుకు అవకాశాలు ఉన్నాయని గుర్తించామని తెలిపారు. సమావేశంలో డీటీసీ సత్యనారాయణమూర్తి, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ ఎంవీ నిర్మల, పంచాయితీరాజ్ ఎస్‌ఈ ఇ.మాణిక్యం, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ కె.కోటేశ్వరి, డీఈవో ఆర్‌ఎస్ గంగాభవాని, నగరపాలక సంస్థ కమిషనర్ యర్రా సాయి శ్రీకాంత్, నేషనల్ హైవే అథారిటీ అధికారి వెంకటరత్నం, నేషనల్ హైవే విజయవాడ పీడీ టి.సురేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement