గుర్గావ్: రోడ్డు భద్రత గురించి ప్రతి ఒక్కరికీ అవగాహన కలిగించాలనే ప్రయత్నంలో భాగంగా అన్ని కాలేజీల్లోనూ కార్యక్రమాలు నిర్వహిస్తామని గుర్గా వ్ ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. కొన్ని నెలల క్రితం ట్రాఫిక్ పోలీసులు నగరవ్యాప్తంగా ఉన్న స్కూళ్లలోనూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించి నియమాలను ఉల్లంఘిస్తే ఎంతటి ప్రమాదాలు జరుగుతాయో కూలంకషంగా వివరించారు. ఇక నుంచి కాలేజీ విద్యార్థులకు కూడా మోటారు వాహనాల చట్టం ప్రాధాన్యం గురించి విశదీకరించనున్నారు. ‘ఏదైనా మార్పు తేవాలని కోరుకుంటే, అందుకోసం ముందుగా యువతను ఎంచుకోవాలి. వాళ్లే మన భవిత. ప్రజలంతా ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని కోరుకుంటే ముం దుగా కాలేజీ విద్యార్థులకు అవగాహన కలిగించాలి.
కొత్తగా వాళ్లు బైకులు కొనుక్కోగానే ఎంతో ఎనలేని ఉత్సాహంతో ఉంటారు. కావాలనే నియమాలను ఉల్లంఘిస్తారు. ఈ పరిస్థితిని నిరోధించాలి. రోడ్డు నిబంధనలను ఉల్లంఘిస్తూ ప్రతిరోజూ కనీసం 1,400 మంది దొరికిపోతున్నారు. చలానాలు విధిం చడం వల్ల మా లక్ష్యం నెరవేరడం లేదు. ప్రజలే స్వచ్ఛందంగా రోడ్డు భద్రత నియమాలు పాటిం చాలి. అందుకే ఈ ప్రచారోద్యమాలు నిర్వహిస్తున్నాం’ అని ట్రాఫిక్ విభాగం డిప్యూటీ కమిషనర్ వినోద్ కౌశిక్ వివరించారు.ఇందుకోసం సీనియర్ పోలీసు అధికారులు ముందుగా కాలేజీల ప్రిన్సిపాల్స్‌తో చర్చించి తేదీ లు, సమయం ఖరారు చేస్తారు.
వాళ్ల తరగతులకు ఇబ్బంది లేని సమయంలో ఇన్‌స్పెక్టర్, ఏసీపీ స్థాయి అధికారులు వచ్చి నిబంధనల ప్రాధాన్యం గురించి వివరిస్తారు. నాటకాలు ప్రదర్శించడంతోపాటు క్విజ్ పోటీలు పెడతారు. వీటికితోడు చిన్న పుస్తకాలు, కరపత్రాలను పంపిణీ చేస్తారు. తమ విభాగానికి సిబ్బంది తక్కువ కాబట్టి వారానికి ఒక కాలేజీని ఎంచుకుంటామని కౌశిక్ వివరించారు. అన్ని వివరాలను ఖరారు చేశాక తేదీలు ప్రకటిస్తామని ఆయన తెలిపారు.
విద్యార్థులకు రోడ్డు భద్రతపై పాఠాలు
Published Mon, Jul 28 2014 10:36 PM | Last Updated on Thu, Sep 27 2018 2:34 PM
Advertisement