
లెసైన్సు లేకుండా నడిపితే బండి జఫ్తు
ఇప్పటి వరకు 6900 డ్రైవింగ్ లెసైన్స్‌లు సస్పెన్షన్
రహదారి భద్రతా నిబంధనలు మరింత కఠినతరం
సుప్రీంకోర్టు సాధికార కమిటీ ఆదేశాలతో ఆర్టీఏ చర్యలు
సిటీబ్యూరో: రోడ్డు భద్రతా నిబంధనలు ఉల్లంఘించేవారిపై రవాణాశాఖ మరోసారి కొరడా ఝళిపించింది. వివిధ రకాల ఉల్లంఘనలపై ఇప్పటి వరకు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 6900లకు పైగా డ్రైవింగ్ లెసైన్స్‌లు సస్పెండ్ చేసింది. లెసైన్సులపై సస్పెన్షన్ కొనసాగుతున్నా.. లెక్కచేయకుండా వాహనాలు నడిపే వారిపై ప్రత్యేక దృష్టి సారించింది. అలాంటివారి లెసైన్సులు రద్దు చేయడంతో పాటు తీవ్రమైన నేరానికి పాల్పడినట్లు కే సులు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చాలని నిర్ణయించింది. రోడ్డు భద్రతా నిబంధనల అమలు పర్యవేక్షణపై సుప్రీంకోర్టు నియమించిన సాధికార కమిటీ ఆదేశాల మేరకు రవాణాశాఖ నిబంధనలను మరింత కఠినతరం చేసింది. ఇప్పటి వరకు పోలీసుల నుంచి అందిన వివరాల మేరకు రవాణా అధికారులు రంగారెడ్డి జిల్లా పరిధిలో 6 వేలు, హైదరాబాద్ జిల్లా పరిధిలో 900 డ్రైవింగ్ లెసైన్సులను సస్పెండ్ చేశారు. మూడు నెలల పాటు ఈ తాత్కాలిక నిలుపుదల అమల్లో ఉంటుంది.
ఆ నాలుగు కీలకం....
మద్యం తాగి వాహనాలు నడిపినా, సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసినా లెసైన్సులపై వేటు పడుతుంది. అలాగే అధిక వేగం, పరిమితికి మించి ప్రయాణికులను తరలించడం వంటి ఉల్లంఘనలను సుప్రీంకోర్టు సాధికార కమిటీ తీవ్రంగా పరిగణించింది. ఈ నాలుగు రకాల ఉల్లంఘనల కారణంగానే దే శవ్యాప్తంగా ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నట్లు గుర్తించారు. సాధికార కమిటీ ఆదేశాల మేరకు పోలీసులు, రవాణాశాఖ కార్యాచరణ చేపట్టారు. ఇప్పటి వరకు వేల సంఖ్యలో డ్రైవింగ్ లెసైన్సులను తాత్కాలికంగా నిలుపుదల చేయడమే కాకుండా, సస్పెన్షన్ టైమ్‌లో తిరిగి రోడ్డెక్కకుండా వారిపై నిఘా పెడుతున్నారు. మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నా.. ఇంకా ఎక్కడో ఒకచోట ప్రమాదాలు జరుగుతుండటంతో నిబంధనలను మరింత కఠినతరం చేయాలని ఆర్టీఏ అధికారులు భావిస్తున్నారు.
నిరంతర సమీక్ష...
రోడ్డు భద్రతా నిబంధనల అమల్లో ప్రతి నెలా ఆర్టీఏ అధికారులు సమీక్ష నిర్వహిస్తారు. అలాగే మూడు నెలలకు ఒకసారి న్యూఢిల్లీలోని సుప్రీంకోర్టు సాధికార కమిటీకి నివేదికను అందజేస్తారు. ఈ కమిటీ ఆదేశాల మేరకు అన్ని చోట్ల చర్యలు చేపడుతున్నప్పటికీ ఇంత పెద్ద మొత్తంలో డ్రైవింగ్ లెసైన్సులపై సస్పెన్షన్ విధించడం, అలాంటి ఉల్లంఘనులు మరోసారి రోడ్డెక్కకుండా నిఘా కొనసాగించడం ఇదే మొట్టమొదటిసారి అని హైదరాబాద్ జేటీసీ రఘునాథ్ అభిప్రాయపడ్డారు. చిన్నారి రమ్య మతి ఉదంతం నేపథ్యంలో రోడ్డు భద్రతా నిబంధనలు, లెసైన్సుల జారీని మరింత పటిష్టంగా అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు.నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.