దేశంలో స్తంభించిన రవాణా
పలు రాష్ట్రాల్లో పూర్తిగా నిలిచిపోయిన వాహనాలు
న్యూఢిల్లీ: ‘రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ సేఫ్టీ బిల్లు’ను నిరసిస్తూ గురువారం దేశవ్యాప్తంగా పలు రాష్ట్ర రవాణా కార్పొరేషన్ల సిబ్బంది, ప్రైవేటు ఆపరేటర్లు చేపట్టిన ఒకరోజు సమ్మె విజయవంతమైంది. పెద్ద సంఖ్యలో వాహనాలను ఎక్కడికక్కడే నిలిపివేయడంతో సాధారణ జనజీవనంపై ప్రభావం పడింది. పలు రాష్ట్రాల్లో ప్రయాణికులకు, రవాణాకు తీవ్రంగా ఇబ్బంది ఎదురైంది. ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ సేఫ్టీ బిల్లు-2015’ను వ్యతిరేకిస్తూ జాతీయ కార్మిక సంఘాలైన ఏఐటీయూసీ, సీఐటీయూ, బీఎంఎస్, ఐఎన్‌టీయూసీ, హెచ్‌ఎంఎస్, ఏఊసీసీటీయూ, ఎల్‌పీఎఫ్‌తో పాటు రాష్ట్ర కార్మిక సంఘాలు గురువారం ఒకరోజు సమ్మెకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
ఆ బిల్లు రాష్ట్రాల రవాణా సంస్థ హక్కులనేమీ దెబ్బతీయదని, ఈ సమ్మెను విరమించుకోవాలని కేంద్ర రవాణా మంత్రి గడ్కారీ విజ్ఞప్తి చేసినా.. కార్మిక సంఘాలు వెనక్కి తగ్గలేదు. కేరళలో ఉదయం నుంచే బస్సులు, ట్యాక్సీలు, ఆటోలు కూడా రోడ్డుపైకి రాలేదు. దీంతో అక్కడి యూనివర్సిటీలు గురువారం జరగాల్సిన పరీక్షలను వాయిదా వేశాయి. కర్ణాటక, పంజాబ్, గుజరాత్, అస్సాం, హర్యానాల్లోనూ జనజీవనం స్తంభించింది. బస్సులతో పాటు ప్రైవేటు వాహనాలు కూడా సమ్మె పాటిం చాయి. కర్ణాటకలోని బెంగళూరు, హుబ్బలి, బళ్లారి, రాయచూర్, మైసూర్ వంటి చోట్ల రోడ్లపైకి వచ్చిన పలు ఆర్టీసీ బస్సులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. తమిళనాడులో పెద్ద సంఖ్యలో వాహనాలు సమ్మెను పాటించాయి. బిల్లు వ్యతిరేకంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో నిరసన ప్రదర్శనలు జరిగాయి.