విశాఖ మన్యం టు హైదరాబాద్
జీలుగుమిల్లి : ఎవరికీ అనుమానం రీతిలో గుట్టు చప్పుడు కాకుండా విశాఖ మన్యం నుంచి హైదరాబాద్‌కు తరలిపోతున్న గంజాయిని పక్కా సమాచారంతో జీలుగుమిల్లి పోలీసులు మంగళవారం రాత్రి పట్టుకున్నారు. మినీ బస్సులోని సీలింగ్‌లో దాచి తరలిస్తున్న సుమారు 400 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విశాఖ మన్యం నుంచి హైదరాబాద్ తదితర ప్రాంతాలకు గంజాయి భారీగా రవాణా అవుతున్నట్టు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పోలవరం డీఎస్పీ ఏటీవీ రవికుమార్ బుధవారం విలేకరులకు వివరాలు తెలిపారు. గంజాయి తరలింపుపై పక్కా సమాచారం అందడంతో జిల్లా పోలీసులు అప్రమత్తమై మంగళవారం రాత్రి జాతీయ రహదారిపై వాహనాల తనిఖీ చేపట్టారు. మినీ బస్సు కొవ్వూరు, దేవరపల్లి, కొయ్యలగూడెం మూడు పోలీస్ స్టేషన్లను దాటుకుని జీలుగుమిల్లి సమీపంలో పోలీసులకు చిక్కింది. అయితే మూడు గంటల పాటు ఎంత తనిఖీ చేసినా గంజాయి ఆచూకీ లభ్యం కాలేదు. చివరకు మెకానిక్‌ను రప్పించి బస్సులోని సీలింగ్ రేకు బోల్టులు ఇప్పించి చూడగా అందులో గంజాయి ప్యాకెట్లు లభ్యమయ్యాయి. డీఎస్పీ, తహసీల్దార్ రాజశేఖరరావు సమక్షంలో గంజాయిని స్వా«ధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.40 లక్షలు ఉంటుందని డీఎస్పీ చెప్పారు. మినీ బస్సును సీజ్ చేసి విశాఖ జిల్లాకు చెందిన డ్రైవర్ ఈగల రమణ, హైదరాబాద్‌కు చెందిన లతీఫ్ వజీర్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి కోర్టుకు తరలించినట్టు డీఎస్పీ చెప్పారు. కాగా లతీఫ్ వజీర్ విశాఖ మన్యంలో గంజాయి కొనుగోలు చేసి హైదబాద్‌కు తరలిస్తున్నట్టు సమాచారం. పోలవరం సీఐ బాలరాజు, ఎస్సై కాళీ చరణ్, ఏఎస్సై భాస్కర్, ఉమ ఈ తనిఖీల్లో పాల్గొన్నారు.