వేటు పడింది
Published Wed, Mar 22 2017 12:47 AM | Last Updated on Sat, Sep 15 2018 8:03 PM
సాక్షి ప్రతినిధి, ఏలూరు : తప్పు చేసిన వారిని శిక్షించాలి్సన పోలీసులే వారికి రక్షణగా మారితే.. అక్రమాలకు ఊతమిస్తే.. ఏదో ఒక రోజున పట్టుబడి ఊచలు లెక్కించక తప్పదు. ఈ విషయాన్ని మర్చిపోయి గంజాయి అక్రమ రవాణాకు వెన్నుదన్నుగా నిలిచిన చింతలపూడి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ జి.దాసుపై పోలీస్ ఉన్నతాధికారులు ఎట్టకేలకు సస్పెన్షన్ వేటు వేశారు. నాన్ బెయిలబుల్ కేసులు సైతం నమోదు చేశారు. అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలో గంజాయి రవాణా వెనుక ఒక సర్కిల్ ఇ¯ŒSస్పెక్టర్ హస్తం వెలుగుచూసిన నెలరోజుల వ్యవధిలోనే పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మరో సీఐ పాత్ర నిరూపణ కావడం చర్చనీయాంశంగా మారింది. ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళితే.. గత నెల 21న జిల్లాలో గంజాయి తరలిస్తున్న లారీని పట్టుకున్న విషయం తెలిసిందే. ఆ కేసులో ప్రధాన నిందితుడిని వదిలిపెట్టేందుకు ఒక అధికారి రూ.5.50 లక్షల్ని లంచంగా తీసుకున్నట్టు సమాచారం. దీనికి స్థానికంగా పనిచేస్తున్న కొందరు టీవీ చానల్ విలేకరులు డీల్ కుదిర్చారని, ప్రధాన నిందితుడు ప్రతి లోడుకు కొంత నగదు ఇచ్చేలా ఒప్పందం కుదిర్చారని నిర్ధారణ అయ్యింది. కొంతకాలంగా విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో పండించిన గంజాయిని హైదరాబాద్, మహా రాష్ట్రకు చింతలపూడి మీదుగా సరిహద్దు దాటిస్తున్నారు. గంజాయి రవాణా చేసే వాహనాలను ఎక్కడా నిలుపుదల చేయకుండా ఉండేందుకు ప్రతి లోడుకు రేటు కట్టి వసూలు చేస్తున్నారు. గత నెల 21న ఆపిన గంజాయి లారీకి సంబంధించిన వివరాలు స్పెషల్ బ్రాంచి వద్ద ఉండటం, ఆ బ్రాంచి పోలీసులు ఇచ్చిన సమాచారంతోనే లారీని పట్టుకున్నా.. చింతలపూడి సీఐ ఆ కేసులో ప్రధాన నిందితుణ్ణి వదిలివేయడాన్ని ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. మొత్తం వ్యవహారంపై ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించింది. దీంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ దాసు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల ఏలూరు ప్రాంతానికి రాగా.. బందోబస్తు విధులు నిర్వర్తించాలి్సన సీఐ దాసు డుమ్మా కొట్టారు. తనకు అరోగ్యం బాగుండక అసుపత్రిలో చేరానని, వైద్యులు 21 రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారంటూ ఉన్నతాధికారులకు ఎస్‌ఎంఎస్ పెట్టారు. అనంతరం ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేశారు. ఈ ఘటనలో ఎవరెవరు ఉన్నారన్న దానిపై విచారణ జరిపిన అధికారులు ముగ్గురిని అరెస్టు చేసి, మరికొందరి పాత్రపై విచారణ జరుపుతున్నారు. పోలీసుల అదుపులో ఉన్న ప్రధాన నిందితునితోపాటు సీఐ దాసు, అతని జీప్ డ్రైవర్, మరికొందరు పోలీసు సిబ్బందికి సంబంధించిన ఫోన్ కాల్ జాబితాలను రప్పించుకుని విచారణ జరిపారు. ఈ వ్యవహారంలో చింతలపూడికి చెందిన ఒక చానల్ విలేకరితోపాటు స్టేషన్‌లో పనిచేసే కీలక సిబ్బందికి కూడా సంబంధం ఉన్నట్టు గుర్తించారు. ప్రధాన నిందితునికి, సీఐకి మధ్య సంబంధాలు ఉన్నట్టు నిర్ధారణ కావడంతో పోలీసులు ఆయనపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. ఇతని పాత్ర నిర్ధారణ అయినప్పటికీ సస్పెన్షన్ వేటు వేసే విషయంలో పోలీసు అధికారులు మీనమేషాలు లెక్కించడం విమర్శలకు దారితీసింది. ఈ తరుణంలో ఎట్టకేలకు సీఐ దాస్‌ను సస్పెండ్ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.
Advertisement
Advertisement