రోడ్డు సేఫ్టీపై డీజీపీ రివ్యూ
Published Wed, Apr 26 2017 12:23 PM | Last Updated on Thu, Aug 30 2018 5:35 PM
విజయవాడ: రోడ్డు ప్రమాదాల నివారణపై బుధవారం డీజీపీ క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మంత్రి అచ్చెన్నాయుడుతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ సాంబశివరావు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా రోడ్డు సేఫ్టీ రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల్లో మన రాష్ట్రం ఏడో స్థానంలో ఉంది.. అధికారులకు చెడ్డపేరు వచ్చినా నిబంధనలను కఠినంగా అమలు చేసి హెల్మెట్ తప్పనిసరి చేయాలి. రాష్ట్రంలో జరుగుతున్న ప్రమాదాల్లో 77 శాతం డ్రైవర్ల నిర్లక్ష్యం వల్లే జరుగుతున్నాయి. ద్విచక్రవాహనాలు ప్రమాదానికి గురైనప్పుడు 32 శాతం మంది, నాలుగు చక్రాల వాహనాలు ప్రమాదాలకు గురైనప్పుడు 17 శాతం మంది మృతి చెందుతున్నారని అన్నారు.
మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. 'రోడ్డు ప్రమాదాలపై శాశ్వత చర్యలు తీసుకోవడం లేదు. ఏదైనా ప్రమాదం జరిగితే హడావిడి చేసి ఆ తర్వాత వదిలేస్తున్నారు. ఏర్పేడులో జరిగిన ప్రమాదం పై ముఖ్యమంత్రి చాలా ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై ఏర్పేడు తరహా ప్రమాదాలు జరగకూడదని సీఎం సీరియస్‌గా చెప్పారు. యాక్సిడెంట్ జరిగితే డ్రైవర్ బాధ్యత కూడా ఓనర్‌పై ఉండాలి. రోడ్డు సేఫ్టీ బోర్డు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది' అని ఆయన అన్నారు.
హోం మంత్రి చినరాజప్ప మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలను కళ్లారా చూసి కూడా ఏం చేయలేకపోతున్నాం.. పెద్దాపురం రోడ్లు వర్షం వస్తే చాలు అధ్వాన్నంగా తయారవుతున్నాయి. రోడ్డు భద్రత చర్యలపై స్థానిక ప్రజాప్రతినిధుల అభిప్రాయం తీసుకోవాలని అన్నారు.
Advertisement
Advertisement