
ఓటీటీలో ఇది చూడొచ్చు అనేప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో మలయాళ చిత్రం ‘హలో మమ్మీ’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.
హాలీవుడ్‌లో మమ్మీ సినిమాల పరంపర మీకు గుర్తుండే ఉంటుంది. పురాతన కాలంలో గ్రీకు సాంప్రదాయం ప్రకారం సజీవంగా మనుషులను రాతి కట్టడాల్లో పాతి పెట్టడంతో, అందులో చనిపోయిన వారి ఆత్మల రూపంలో తిరిగి వస్తే కథేంటి? అన్నదే హాలీవుడ్ మమ్మీల కథా కమామీషు. కాకపోతే ఈ ‘హలో మమ్మీ’ కథ మాత్రం పూర్తిగా వినూత్నం, వైవిధ్యం... మరీ ముఖ్యంగా వినోదాత్మకం. ఇదో హారర్ కామెడీ. వైశాఖ్ ఎలాన్స్ ఈ సినిమాకి దర్శకుడు.
ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమ్ అవుతున్న ఈ మలయాళ సినిమా నిడివి రెండున్నర గంటలు. చూసినంతసేపు ఈ సినిమా ఓ పక్క కాస్త భయపెడుతూనే మరో పక్క గిలిగింతలు పెడుతుంటుంది. షరీఫ్, ఐశ్వర్య ప్రధాన పాత్రధారులుగా నటించిన ఈ సినిమా ఆద్యంతం వినోదభరితమనే చెప్పాలి. అంతలా ఏముందో ఈ సినిమా కథను ఓసారి తెలుసుకుందాం. స్టెఫీని బోనీ ప్రేమిస్తాడు. స్టెఫీ తన తండ్రి శామ్యూల్‌తో ఉంటుంది. స్టెఫీ తల్లి 20 ఏళ్ల క్రిందటే చనిపోతుంది.
కానీ ఈ 20 ఏళ్లు స్టెఫీని ఆ తల్లి ఆత్మ రూపంలో అంటిపెట్టుకునే ఉంటుంది. ఎందుకంటే స్టెఫీ అంటే తల్లికి చాలా ఇష్టం. స్టెఫీ మీద ఈగ కూడా వాలనీయదు. అలాగే ఇంట్లో ఆత్మ రూపంలోనే బోలెడన్ని రూల్స్ పెడుతుంది. స్టెఫీ తల్లి ఆత్మ విషయం ఈ ప్రపంచంలో స్టెఫీకి, ఆమె తండ్రికి తప్ప మరెవరికీ తెలియదు.
బోనీని స్టెఫీ ఇష్టపడినపుడు తన తల్లి విషయాన్ని బోనీకి చెబుతుంది. కానీ బోనీ వినిపించుకోడు. పెళ్లై స్టెఫీ ఇంట్లోకి అడుగుపెట్టిన తరువాత స్టెఫీ తల్లి ఆత్మ పరిచయమవుతుంది అతనికి. దాంతో బోనీ ఖంగు తింటాడు. ఇక అక్కడ నుండి కథ ఎలా మలుపులు తిరుగుతుందో ప్రైమ్ వీడియో ఓటిటీలోనే చూడాలి. కొన్ని కథలు చాలా అరుదుగా వస్తుంటాయి. వాటిని మిస్ చేసుకోకూడదు. వర్త్‌ఫుల్ వాచ్... ఇంకెందుకు ఆలస్యం... ‘హలో మమ్మీ’ని పలకరించండి... భయంతో కాదు... ప్రేమతో... – ఇంటూరు హరికృష్ణ
Comments
Please login to add a commentAdd a comment