
తెలుగులో కమర్షియల్ సినిమాలతో పాటు సోషల్ మెసేజ్ ఉన్న చిత్రాలు కూడా అప్పుడప్పుడు రిలీజ్ అవుతుంటాయి. అలా మహిళలు సమస్యలకు అద్దం పట్టేలా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ 'నారి'. తాజాగా థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందనేది రివ్యూలో చూద్దం.
కథేంటి?
మంత్రి భూపతి(నాగ మహేశ్) కొడుకు తన స్నేహితులతో కలిసి ఓ అమ్మాయిపై అఘాయిత్యం చేస్తారు. ఈ కేసులో నిందితులకు కఠిన శిక్ష విధించేందుకు సిద్ధమవుతుంది లాయర్ శారద (ప్రగతి). ఆమెను మంత్రి బెదిరించాలని చూసినా భయపడదు. ఈ క్రమంలో తన లైఫ్ లో చూసిన భారతి అనే మహిళ జీవితాన్ని గుర్తు చేసుకుంటుంది. సమాజంలో సగటు స్త్రీ జీవితానికి అద్దం పట్టేలా భారతి (ఆమని) పాత్ర సాగుతుంది. ఇంట్లో తండ్రి చూసే చిన్నచూపు, అర్థం చేసుకోలేని తండ్రి వ్యక్తిత్వంతో ఇబ్బందులు పడుతుంది భారతి. తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తుంటే ఇంట్లో నుంచి ప్రేమించిన వాడితో వెళ్లిపోతుంది. ఆ తర్వాత భారతి జీవితం ఎలాంటి మలుపు తిరిగింది. అప్పటినుంచి భారతి తన చుట్టూ ఉన్న మహిళలు, ఆడపిల్లల మంచికోసం ఎలాంటి పనులు చేసిందే మిగతా స్టోరీ.
ఎలా ఉందంటే?
ఆడపిల్లకు ఎన్నో కట్టుబాట్లు విధిస్తుంది మన కుటుంబం, సమాజం. ఆడపిల్ల పుట్టినప్పటి నుంచే వివక్ష. అబ్బాయికి చదువు, అమ్మాయికి పెళ్లి అనేది ఎక్కువశాతం తల్లిదండ్రులు రాసే శాసనం. కానీ ఆడపిల్ల ఎదగాలి, ఆడపిల్లకు మంచి చదువులు చెప్పించాలి, మగ పిల్లలు తప్పు చేయకుండా తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతూ దర్శకుడు సూర్య.. నారి చిత్రాన్ని రూపొందించారు.
టీచర్ గా భారతి పాత్రలో ఆమని నటన నారి చిత్రానికి ప్రధాన ఆకర్షణ. అర్థం చేసుకోలేని తండ్రి తిట్టినప్పుడు బాధపడే యువతిగా, ప్రేమించిన వాడు మోసం చేస్తే నరకాన్ని చూసే భార్యగా, గొప్పవాడు అవుతాడనుకున్న కొడుకు తప్పుచేసినప్పుడు కుంగిపోయే తల్లిగా ఆమని నటన సహజంగా అద్భుతంగా ఉంది.
భారతి టీనేజ్ క్యారెక్టర్ లో మౌనిక రెడ్డి నటించింది. ఆడపిల్లగా ఉండొద్దు టీచర్ అంటూ విద్యార్థిని అర్చన పాత్రలో నిత్య శ్రీ బాగా చేసింది. మిగిలిన పాత్రధారులు ఓకే. వినోద్ కుమార్ సంగీతం బాగుంది. దర్శకుడు సూర్యతో పాటు మిగిలిన సాంకేతిక నిపుణులు కూడా తమ తమ పనికి పూర్తి న్యాయం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment