
అడుగడుగునా అభద్రత
ఏటా మన రాష్ట్రంలో సగటున 15 వేల మంది మృత్యువాత పడుతుండగా, దాదాపు 60 వేల మంది క్షతగాత్రులుగా మిగులుతున్నారు.
విశాఖ జిల్లా పరిధిలో ఏటా సగటున 500 మంది బలైపోతుండగా, రెండు వేల మంది అంగవికలురవుతున్నారు.
రహదారి భద్రత పట్ల ప్రభుత్వం చిన్న చూపు.. ప్రమాదాల నియంత్రణ పట్ల అశ్రద్ధ.. ఇటీవలి రోడ్డు ప్రమాదాలే ఇందుకు నిదర్శనం.
2010లో కేంద్రం తెరపైకి తెచ్చిన ‘జాతీయ రహ దారి భద్రత విధానం’ ప్రతిపాదనలకే పరిమితం. విధివిధానాలను బోర్డు పర్యవేక్షిస్తుందని కేంద్రం ప్రకటించింది. క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స, త్వరితగతిన నష్టపరిహారం చెల్లింపు తదితర అంశాలు బోర్డు పరిశీలనలో ఉంటా యని తెలిపింది. అయితే రహదారి భద్రత బోర్డు ఏర్పాటుకు ప్రతిపాదనలు జరిగినా.. ఆచరణలో మాత్రం సఫలం కాలేదు.
మర్రిపాలెం:ప్రభుత్వాధినేతలు, అధికారులు రహదారి భద్రత గురించి ప్రకటనలు చేస్తున్నారు. ఆచరణలో మాత్రం శ్రద్ధ కనిపించడం లేదు. ప్రమాదాల నియంత్రణకు, ప్రయాణికుల భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని సీఎం చంద్రబాబు మళ్లీ తాజాగా ప్రకటించారు. ప్రతి వంద కిలోమీటర్లకు డ్రైవర్లకు విశ్రాంతి గదులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సీఎం ప్రకటన బాగానే ఉన్నా.. ఎంత వరకు ఫలిస్తుందో చూడాలి. హైవేల్లో మద్యం షాపులు నిషేధిస్తామని గతంలో ప్రభుత్వం చెప్పింది. హైవేలలో మద్యం షాపుల బోర్డులు ఆకర్షించేటట్లు ఉండరాదని తాజాగా ప్రకటించడంతో.. షాపులు యథావిధిగా ఉంటాయని తెలుస్తోంది.
సమన్వయ లోపం...
ప్రమాదాల నియంత్రణలో రవాణా, ఆర్టీసీ, పోలీస్ శాఖల మధ్య సమన్వయం కొరవడింది. రహదారి భద్రతకు ఆయా శాఖలు ఐక్యంగా కృషి చేయడం లేదు. ప్రతి ఏడాది రహదారి భద్రతా వారోత్సవాలు జరపడం ‘ఓ పనైపోయింది’ అన్నట్టుగా ఆయా శాఖల అధికారులు వ్యవహరించడం ఆనవాయితీగా వస్తోంది. రవాణా, ఆర్టీసీ, పోలీస్ శాఖలు ‘రహదారి భద్రత’లో ప్రత్యక్షంగా, ఆర్ అండ్ బీ శాఖ పరోక్షంగా ముడిపడి ఉన్నాయి. ఆయా శాఖలు ‘రహదారి భద్రత’కు ఐక్యంగా కృషి చేస్తే ప్రమాదాలు తగ్గించవచ్చు. ఏడాదిలో ఒకటి రెండుసార్లు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఆయా శాఖల అధికారులు సమీక్ష సమావేశాలు జరిపి ప్రమాదాలు తగ్గుముఖానికి కొన్ని ప్రతిపాదనలు చేయడం.. ఆ తర్వాత పట్టించుకోకపోవడం తెలిసిందే.
పరిశోధనలకు తావు లేదు...
ఎక్కడైనా ప్రమాదం జరిగినా, ఆయా ప్రాంతాలలో వరుస ప్రమాదాల చోటుచేసుకున్నా పరిశోధన జరగాలి. ప్రమాదం జరిగిన తీరు, కారణాలు వెలికితీయాలి. అక్కడ మరో ప్రమాదం జరగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలి. ముందు జాగ్రత్త చర్యలకు ఉపక్రమించాలి. కానీ ఎక్కడా అలాంటి దాఖలాలు లేవు. ప్రమాదం తర్వాత పోలీసులు కేసు నమోదు చేయడం, తూతూ మంత్రంగా రవాణా అధికారి ఓ రిపోర్ట్ ఇవ్వడం జరుగుతోంది. మరో ప్రమాదం జరిగినా అదే విధానం అమలు జరుగుతోంది.
ప్రమాద ప్రాంతాలలో ప్రత్యేక నిఘా
జిల్లాలో అనకాపల్లి నుంచి ఆనందపురం, అనకాపల్లి నుంచి అడ్డరోడ్డు ప్రమాద ప్రాంతాలుగా గుర్తించాం. అక్కడ ప్రత్యేక తనిఖీలు ముమ్మరం చేస్తాం. విద్యుత్ దీపాలు సక్రమంగా వెలిగేటట్టు హైవే అధికారుల సహాయం తీసుకుంటాం. అరుకు, పాడేరు, తదితర ఘాట్ రోడ్డుల పక్కగా రెయిలింగ్ ఏర్పాటు చేయాలి. ఘాట్ ప్రాంతాలలో జీపులు, ఆటోలు అదుపు తప్పడంతో ప్రాణ నష్టం జరుగుతోంది. ప్రతి మండలంలో ఓ ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారిని నియమించి రెయిలింగ్, రక్షణ ఏర్పాట్ల అవసరాన్ని గుర్తించి సంబంధిత శాఖలకు తెలియజేస్తాం. జిల్లా కలెక్టర్‌కు పరిస్థితి వివరించి అవసరమైన సహాయం కోరతాం.
- ఎస్.వెంకటేశ్వరరావు, డీటీసీ