రోడ్డు భద్రతకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ
సాక్షి, హైదరాబాద్: రహదారులు రక్తమోడుతూ ఆందోళన కలిగిస్తున్న తరుణంలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోబోతోంది. ఇందుకోసం ప్రత్యేకంగా రోడ్డు భద్రత కోసం మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తోంది. రోడ్డు భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాలను ఆదేశించిన నేపథ్యంలో.. రోడ్డు భద్రత నిధిని ఏర్పాటు చేసిన రాష్ట్రప్రభుత్వం మరిన్ని చర్యలకు సిద్ధమవుతోంది. జాతీయ రహదారులపై క్షతగాత్రులకు వేగంగా వైద్యసాయం అందేలా 108 తరహాలో ప్రత్యేక అత్యవసర వైద్య సేవల అంబులెన్సులను ప్రారంభించాలని యోచిస్తోంది.
జీపీఆర్‌ఎస్‌తో అనుసంధానమయ్యే ఈ అంబులెన్సులు వేగంగా ప్రమాద స్థలికి చేరుకునేలా నిర్ధారిత పరిధికి ఒకటి చొప్పున అందుబాటులో ఉంచాలని భావిస్తున్నారు. ఇందులో తక్షణం వైద్యం అందించేలా అన్ని రకాల వసతులుంటాయి. ఇక రాష్ట్రంలో 50 పోలీసు స్టేషన్‌ల పరిధిలో జాతీయ రహదారులు విస్తరించి ఉన్నాయి. దీంతో ఆయా పోలీసు స్టేషన్‌లకు ప్రత్యేకంగా పెట్రోలింగ్ వాహనాలు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. రహదారులకు వంద మీటర్ల లోపు మద్యం దుకాణాలు ఉండకూడదనే నిబంధన అమలు విషయంలో కూడా సమాలోచనలు జరుపుతోంది.
ఆసుపత్రులను మెరుగుపరుస్తాం: మంత్రి మహేందర్‌రెడ్డి
క్షతగాత్రులకు సకాలంలో సరైన వైద్యం అందితే ప్రాణాపాయం తప్పే అవకాశం ఉన్నందున ప్రభుత్వ ఆసుపత్రుల్లో వసతులు మెరుగుపరచాలని నిర్ణయించినట్టు రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి వెల్లడించారు. దీంతోపాటు ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీసేవలను విస్తరిస్తామని చెప్పారు. గురువారం సచివాలయంలో జరిగిన రహదారి భద్రత మండలి సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. 2020 నాటికి రోడ్డు ప్రమాదాలను కనీసం 50 శాతానికి తగ్గించాలనే గత తీర్మానానికి కట్టుబడి చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. రహదారులపై ఏర్పాటైన బెల్టుషాపుల విషయంలో కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు.
ఇక నుంచి ఎంతమంది రోడ్డు ప్రమాద బాధితులకు వైద్య సేవలందించిందీ ప్రభుత్వానికి లెక్కలు సమర్పించాలని ప్రైవేటు ఆసుపత్రులను ఆదేశించనున్నట్టు పేర్కొన్నారు. ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాల్లో జాతీయ రహదారులపై లోపాలు సరిచేస్తామని, వాటి వివరాలను కేంద్రానికి పంపితే రూ.900 కోట్ల ఆర్థిక సాయం అందుతుందన్నారు.
ఇప్పటికే నాగార్జునసాగర్, జహీరాబాద్ రహదారులపై బ్లాక్ స్పాట్లు లేకుండా చేస్తున్నట్టు వెల్లడించారు. సమావేశంలో ఆర్థిక, హోం, రవాణా శాఖల కార్యదర్శులు నవీన్ మిట్టల్, రాజీవ్ త్రివేది, సునీల్ శర్మ, రవాణా శాఖ కమిషనర్ సుల్తానియా, రోడ్ సేఫ్టీ అథారిటీ అదనపు డీజీ కృష్ణప్రసాద్, జాతీయ రహదారుల విభాగం ఈఎన్‌సీ గణపతిరెడ్డి, రాష్ట్ర రహదారుల ఈఎన్‌సీ రవీందర్‌రావు, ఆర్టీసీ ఎండీ రమణారావు, డీఎంఈ రమణి, ఇతర అధికారులు పాల్గొన్నారు.