జనం చచ్చిపోతుంటే.. నిద్రపోతున్నారా? | supreme court committee report on road safety | Sakshi
Sakshi News home page

జనం చచ్చిపోతుంటే.. నిద్రపోతున్నారా?

Published Wed, Sep 7 2016 8:01 AM | Last Updated on Sun, Sep 2 2018 5:45 PM

జనం చచ్చిపోతుంటే.. నిద్రపోతున్నారా? - Sakshi

జనం చచ్చిపోతుంటే.. నిద్రపోతున్నారా?

► జాతీయ రహదారుల మృతులు మీ రాష్ట్రంలోనే ఎక్కువ
► ప్రమాదాలు తగ్గాయంటున్నారు.. మరి మృతులెందుకు పెరిగారు?
► సీఎం బావమరిది కొడుకే మృతిచెందారు కదా.. చర్యలు తీసుకున్నారా?
► ఏపీ రవాణా, పోలీసు, ఆరోగ్యశాఖ అధికారులపై ‘సుప్రీం’కమిటీ ఆగ్రహం
► 9లోగా అఫిడవిట్‌ దాఖలుకు ఆదేశాలు

సాక్షి, హైదరాబాద్‌
‘‘రాష్ట్రంలో జాతీయ రహదారులన్నీ మృత్యుకుహరాలుగా మారాయి. రోడ్డెక్కితే భద్రత లేకుండా పోయింది. జనం పిట్టల్లా రాలిపోతున్నారు. మీ రాష్ట్రంలో జాతీయ రహదారులపై మృతి చెందినంత మంది దేశంలో మరే రాష్ట్రంలోనూ చనిపోలేదు. ఇంత జరుగుతున్నా నిద్రపోతున్నారా?’’ అంటూ సుప్రీంకోర్టు కమిటీ రాష్ట్ర అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రమాదాల నేపథ్యంలో నివారణకు ఎటువంటి చర్యలు తీసుకున్నారో ఈనెల 9లోగా అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. జాతీయ రహదారులమీద జరుగుతున్న ప్రమాదాలపై సుప్రీంకోర్టు గతంలోనే రిటైర్డ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ రాధాకృష్ణన్‌ అధ్యక్షతన కమిటీ వేసింది. కమిటీ ఈనెల 2న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పోలీసు, రవాణా, ఆరోగ్యశాఖ అధికారులతో సమావేశమైంది. ఈ సందర్భంగా వారిపై తీవ్రంగా మండిపడింది. రాష్ట్రంలో ఒక్క ఏడాదిలో కేవలం జాతీయ రహదారులపై జరిగిన ప్రమాదాల్లో 432 మంది మృతిచెందారని కమిటీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమావేశానికి వెళ్లిన అధికారుల్లో ఒకరు తెలిపారు.

దేశంలోనే రోడ్డు ప్రమాద మృతుల్లో రాష్ట్రం అగ్రస్థానంలో ఉందంటూ.. దీనిపై అధికారులు చర్యలు తీసుకున్నట్టు కనిపించట్లేదని కమిటీ ఆక్షేపించింది. ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయని రాష్ట్ర అధికారులు పేర్కొనగా.. మరి మృతులు ఎక్కువ ఎందుకున్నారని ప్రశ్నించింది. దీంతో వారినుంచి జవాబు కరువైంది. గత రెండేళ్లుగా వరుసగా ఏపీనే ప్రమాద మృతుల్లో తొలిస్థానంలో ఉందంటూ.. స్వయానా రాష్ట్ర సీఎం చంద్రబాబు బావమరిది కుమారుడే తెలంగాణ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన విషయాన్ని కమిటీ గుర్తుచేసింది. రోడ్డు ప్రమాదాలపై చర్చిద్దామంటే సీఎం బిజీగా ఉన్నారని అధికారులు జవాబివ్వగా కమిటీ స్పందిస్తూ.. సీఎం బిజీగా ఉంటే చీఫ్‌ సెక్రటరీ ఉన్నారు లేదా సంబంధిత మంత్రి ఉన్నారు కదా వాళ్లనెందుకు భాగస్వాముల్ని చేయలేదని ప్రశ్నించినట్టు సమాచారం.

ఇంత ఘోరంగా ఉన్నా పట్టించుకోవట్లేదు
రాష్ట్ర రవాణా, పోలీసు, ఆరోగ్యశాఖ అధికారుల బృందంపై పలు అంశాల్లో కమిటీ తీవ్రంగా ఆక్షేపించింది. ఏ పనైనా పత్రాల్లో చూపిస్తున్నారు తప్పితే అమలు కావట్లేదని తప్పుపట్టింది. సమావేశంలో రాష్ట్ర అధికారుల్ని కమిటీ నిలదీసిన అంశాలివీ..

ఇప్పటివరకూ రోడ్డు ప్రమాదాల నివారణకు నోడల్‌ ఏజెన్సీ ఏర్పాటు చేయలేదు.
దీనికోసం ప్రత్యేక నిధి(స్పెషల్‌ ఫండ్‌)ని  కేటాయించలేదు.
ఓవర్‌లోడ్‌తో లారీలు వెళుతున్నా పట్టించుకోవట్లేదు. దీనివల్ల రోడ్లు పాడవుతున్నాయి.
ఒక్కో ఆటోలో 20 మంది వెళుతున్నా పట్టించుకోవట్లేదు.
ఇసుక లోడ్‌లతో వెళుతున్న ట్రాక్టర్లపై 20 మందిదాకా వెళుతున్నా మీకు కనపడట్లేదు.
ప్రమాదాలు తగ్గాయంటున్నారు.. మరి మృతులు పెరగడానికి కారణం తెలుసుకోలేదు.
రహదారుల్లో బ్లాక్‌స్పాట్స్‌ గుర్తించామంటున్నారు. మరి దీనివల్ల ప్రమాదాలు తగ్గలేదేం..
ప్రమాద బాధితులకు వైద్యమందడానికి ట్రామాకేర్‌ సెంటర్ల ఏర్పాటు ఇప్పటికీ
సరిగా లేదు.
20 ఆస్పత్రుల్ని ఉన్నతీకరించమంటే ఇప్పటికీ ఏడు ఆస్పత్రులను సరిగా చేయలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement