సాక్షి, అమరావతి: మొక్కుబడి నిధుల కేటాయింపు, తగినంత మంది సిబ్బంది లేకపోవడంతో రాష్ట్రంలో రహదారి భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది. రాష్ట్రంలో రోజు రోజుకు అంతకంతకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు కళ్లెం వేయాలంటే ఏటా రహదారి భద్రతకు రూ.30 కోట్లు కేటాయించాలని రవాణా శాఖ రెండేళ్ల క్రితం ప్రభుత్వానికి ప్రతిపాదించింది. అయితే ప్రభుత్వం మొక్కుబడిగా రూ.10 కోట్లు నిధులు కేటాయించి చేతులు దులుపుకుంది.
రవాణా శాఖలో అదనపు పోస్టులతో పాటు అవసరమయ్యే నిధులను, మౌలిక వసతులు కేటాయించాలని రవాణా శాఖ సమగ్ర ప్రతిపాదనలు రూపొందించినా.. సర్కారు నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తోంది. రవాణా శాఖకు అదనంగా సిబ్బంది, నిధులు కేటాయిస్తే 2020 నాటికి రోడ్డు ప్రమాద మరణాలను 15 శాతానికి తగ్గిస్తామని ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో రోడ్ సేఫ్టీ లీడ్ ఏజెన్సీలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఎన్‌ఫోర్సుమెంట్ యూనిట్లు ఏర్పాటు చేస్తే ఉపయుక్తంగా ఉంటుందని రవాణా శాఖ ప్రతిపాదించింది. రాష్ట్ర స్థాయి రోడ్ సేఫ్టీ లీడ్ ఏజెన్సీ కింద 18 పోస్టులు, జిల్లా స్థాయిలో 21 పోస్టులు మంజూరు చేయాలని ప్రభుత్వానికి అధికారులు నివేదించారు.
రవాణా శాఖ ప్రతిపాదనలివే...
రాష్ట్ర స్థాయిలో రోడ్డు భద్రతకు ప్రత్యేకంగా 18 పోస్టులు, జిల్లా స్థాయిలో 21 పోస్టులను కేటాయించాలి. రాష్ట్ర స్థాయిలో డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్, ప్రాంతీయ రవాణా అధికారి స్థాయిలో ఓ అసిస్టెంట్ సెక్రటరీ, మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్–2 పోస్టులు, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు, సర్కిల్ ఇన్‌స్పెక్టర్–2, ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు (ఆర్‌అండ్‌బీ), హోం గార్డులు–5, డేటా ఎంట్రీ ఆపరేటర్లు–2, పరిపాలనాధికారి స్థాయిలో ఓ మేనేజరు, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ మొత్తం 18 పోస్టులు మంజూరు చేయాలి.
జిల్లా స్థాయిలో ప్రాంతీయ రవాణా అధికారి, మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టరు, అసిస్టెంట్ మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టరు–2, హోం గార్డులు–10, సర్కిల్ ఇన్‌స్పెక్టరు, సబ్ ఇన్‌స్పెక్టర్లు–2, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు, మేనేజరు, జూనియర్, సీనియర్ అసిస్టెంట్ పోస్టులు మొత్తం 21 మందిని రహదారి భద్రత కోసం కేటాయించాలి. ఈ పోస్టులకుగాను పే అండ్ అలవెన్సుల కింద మొత్తం రూ.15.10 కోట్లు, వాహనాలకు రూ.81 లక్షలు, కార్యాలయ భవనాలకు రూ.45 లక్షలు కలిపి మొత్తం ఏడాదికి రూ.16.36 కోట్లు, రహదారి భద్రత కింద స్పీడ్ గన్లు, బ్రీత్ ఎనలైజర్లు, ఇతర సాంకేతిక పరికరాలకు రూ.15 కోట్ల కలిపి మొత్తం రూ.30 కోట్లు మంజూరు చేయాలని ప్రతిపాదించారు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ఈ నిధులు కేటాయించాలని రవాణా శాఖ ప్రభుత్వానికి నివేదించినా.. ఇంతవరకు పట్టించుకోలేదు.
రూ.3 వేల కోట్లకు పైగా రవాణా ఆదాయం
రవాణా శాఖ ఆదాయం రూ.3 వేల కోట్లకు చేరింది. రయ్ రయ్‌మని ఆదాయం ఏ ఏటికాయేడు గణనీయంగా పెరుగుతోంది. కానీ ప్రభుత్వం రహదారి భద్రత కోసం నిధుల కేటాయింపులు మాత్రం మొక్కుబడిగా విదిల్చడం గమనార్హం.
రోడ్డు ప్రమాదాలు అడ్డుకునేదెలా?
Published Tue, Jun 26 2018 2:51 AM | Last Updated on Thu, Aug 30 2018 5:35 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment