ఏదో అవసరం పడి రోడ్డెక్కేవారిని మోటారు వాహనం రూపంలో మృత్యువు నీడలా వెంటాడుతుంది. అయినవాళ్లంతా ఆత్రంగా ఎదురుచూస్తున్న వేళ ఏ చౌరస్తాలోనో, మరే మలుపులోనో నడి రోడ్డుపై నెత్తుటి ముద్దగా మారుస్తుంది. నిత్యమూ వందలాది కుటుంబాలను విషాదంలో ముంచేసే ఈ ప్రమాదాలను అరికట్టడంపై సాగుతున్న నిర్లక్ష్యాన్ని గమనించి నిరుడు సుప్రీంకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీచేయడంతోపాటు అవసరమైన సూచనలు చేసేందుకు ముగ్గురు సభ్యులతో కమిటీని కూడా నియమించింది.
ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన కొన్ని రోజులకే కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గోపీనాథ్ ముండే ఢిల్లీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాక కేంద్ర ప్రభుత్వంలో కదలిక వచ్చింది. నెల రోజుల వ్యవధిలోనే మోటారు వాహనాల చట్టం సవరణ బిల్లుకు రూపకల్పనచేసి పార్లమెంటులో ప్రవేశపెడతామని కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. అమెరికా, బ్రిటన్, సింగపూర్, జపాన్, కెనడా, జర్మనీ వంటి వివిధ దేశాల చట్టాలను అధ్యయనం చేసి అందులోని మంచి అంశాలను ఈ బిల్లులో పొందుపరుస్తామని కూడా ఆయన చెప్పారు.
మన రహదార్లపై రోజుకు నాలుగొందలమంది...ఏటా దాదాపు లక్షన్నరమంది మరణిస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి. మరో అయిదున్నర లక్షలమంది ఈ ప్రమాదాల్లో క్షతగాత్రులవుతున్నారు. సగటున ప్రతి నాలుగు నిమిషాలకూ ఒకరు రోడ్డు ప్రమాదంలో మరణిస్తున్నారని కేంద్ర రహదారుల మంత్రిత్వ శాఖ సుప్రీం కోర్టుకు సమర్పించిన నివేదిక వెల్లడించింది. ఈ పరిస్థితిని సరిచేసి ప్రయాణికులు క్షేమంగా, వేగంగా, తక్కువ వ్యయంతో గమ్యస్థానాలు చేరేలా కృషిచేస్తామని... సరుకు రవాణా సులభమయ్యేలా చర్యలు తీసుకుంటామని తాజా సవరణ బిల్లు చెబుతున్నది. అంతేకాదు... వచ్చే అయిదేళ్లలో రహదార్లపై 2 లక్షల మరణాలను నివారిస్తామని, కేవలం రవాణా భద్రత, సామర్థ్యాలను మెరుగుపరచడం ద్వారా జీడీపీ మరో నాలుగు శాతం పెరిగేలా చర్యలు తీసుకుంటామని, ఈ రంగంలో పెట్టుబడుల ద్వారా కొత్తగా 10 లక్షల ఉద్యోగాలను సృష్టిస్తామని ప్రకటించింది. వాహనాల క్రమబద్ధీకరణకు, రహదారి భద్రతకు ఒక స్వతంత్ర సంస్థ ఏర్పాటుకు బిల్లు వీలు కల్పిస్తున్నది. వినడానికి ఇవన్నీ బాగానే ఉన్నాయి. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి మరణాలకు కారకులయ్యే వ్యక్తుల లెసైన్సుల్ని రద్దు చేయడం, భారీ జరిమానాలు విధించడంవంటి నిబంధనలున్నాయి. భారీ జరిమానాల విధింపువల్ల ఆచరణలో ఎలాంటి ప్రభావమూ ఉండబోదని...ఇది తప్పు చేసిన వ్యక్తిని శిక్షించడం కాక అతని కుటుంబం మొత్తాన్ని శిక్షకు గురిచేయడం అవుతుందని నిపుణులు వ్యక్తంచేసిన అభిప్రాయాల తర్వాత ఈ జరిమానా నిబంధనలో మార్పు తెచ్చారు. అంతక్రితం రూ. 2,500 నుంచి రూ. 20,000 వరకూ జరిమానా విధించే అవకాశం ఉండగా దాన్ని కనిష్టంగా రూ. 500, గరిష్టంగా రూ. 5,000 ఉండేలా మార్చారు.
అయితే, మృతుల కుటుంబాలకిచ్చే పరిహారానికి సంబంధించిన నిబంధనే అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తున్నది. అసలు సవరణ బిల్లు రూపకల్పనలోని ఆంతర్యాన్ని ప్రశ్నార్థకం చేస్తున్నది. ఇప్పటివరకూ ప్రమాదాల్లో మరణించినవారి వయసు, వారి సంపాదన సామర్థ్యం, వారిపై ఆధారపడినవారి అవసరాలు వగైరా అంశాలను దృష్టిలో ఉంచుకుని మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్ ట్రిబ్యునళ్లు పరిహారాన్ని నిర్ణయించేవి. న్యాయస్థానాలు సైతం బాధిత కుటుంబాలకు రూ. 2 కోట్ల వరకూ పరిహారం ఇవ్వాలని తీర్పు చెప్పిన సందర్భాలున్నాయి. అయితే, తాజా సవరణ బిల్లు ఈ పరిహారం పరిమితిని గరిష్టంగా రూ. 15 లక్షలకు కుదిస్తోంది. ‘ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే...’ అన్నట్టు బీమా సంస్థలు కొంతకాలంగా పరిహారం చెల్లింపులవల్ల తాము నష్టపోతున్నామని వాపోతున్నాయి.
దీన్ని సరిచేయకపోతే దివాలా తీయాల్సివస్తుందని హెచ్చరిస్తున్నాయి. అయినవారిని కోల్పోయి, భవిష్యత్తు అగమ్యగోచరమై దిక్కుతోచని స్థితిలో పడే బాధిత కుటుంబాలకు సాంత్వన చేకూర్చడంకంటే... డబ్బివ్వడానికి విలవిల్లాడుతున్న బీమా సంస్థల ఏడుపే కేంద్రానికి ఎక్కువైపోయిందా అన్న ప్రశ్న తలెత్తుతున్నది. ఇది అన్యాయం, అధర్మం మాత్రమే కాదు...బాధిత కుటుంబాలతో క్రూర పరిహాసమాడటమే అవుతుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న మోటారు వాహనాల చట్టం పాతికేళ్లక్రితం నాటిది. 1988లో అమల్లోకొచ్చిన ఆ చట్టం స్థానంలో సమగ్రమైన చట్టం తీసుకురావాలని యూపీఏ ప్రభుత్వం సంకల్పించింది. అందుకోసమని 2007, 2011ల్లో రెండు కమిటీలు ఏర్పరిచింది. ఆ కమిటీలిచ్చిన నివేదికలపై అధ్యయనాల్లోనే కాలం గడిచిపోయింది.
ఇన్నాళ్లకైనా ఒక సమగ్రమైన చట్టం తెస్తున్నారనుకుంటే దాన్ని కాస్తా ఇలాంటి లొసుగులతో నింపడం న్యాయం కాదు. సవరణ బిల్లులో వాహనాలకు వాడే విడి భాగాల ప్రామాణికతల గురించి, వాహనచోదకులు పాటించాల్సిన నిబంధనల గురించి, ప్రమాదం జరిగిన సందర్భాల్లో వర్తించే జరిమానాలు, శిక్షలు వగైరా చర్యల గురించి ఉన్నాయి. కానీ మొత్తంగా రహదారుల భద్రత కోణాన్ని ఈ బిల్లు స్పృశించటం లేదు. రహదారుల అధ్వాన్నస్థితివల్ల ఏటా వేల కోట్ల రూపాయల నష్టం సంభవిస్తున్నదని వాహనాల యాజమాన్యాలు అంటున్నాయి. భారీవర్షాలకు రోడ్లు అధ్వాన్నంగా మారినా, ఫుట్‌పాత్‌లే లేకున్నా బాధ్యత తీసుకుని సరిచేసేవారుండరు. ఇక పాశ్చాత్య ప్రమాణాలతో తయారవుతున్న వాహనాలు ఇక్కడి రహదారులకు ఎంతవరకూ సరిపోతాయో సమీక్షించే యంత్రాంగం... వాహనాల డిజైన్ లోపాలు ప్రమాదాలకు దోహదపడుతున్న తీరును గమనించే వ్యవస్థ లేదు. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని సమగ్రమైన చట్టం తీసుకురావలసిన అవసరం ఉండగా అరకొర చర్యలతో, అన్యాయమైన నిబంధనలతో సవరణ బిల్లు తీసుకురావడం సరికాదు. కేంద్రం ఈ విషయంలో ఆలోచించాలి.