సమ్మె ప్రశాంతం
నిలిచిన ఆటోలు, బస్సులు
పాఠశాలల మూసివేత
సెవెన్‌సీటర్ ఆటోల నిలువుదోపిడీ
ప్రయాణికుల పడిగాపులు
సిటీబ్యూరో: రహదారి భద్రతా బిల్లుకు వ్యతిరేకంగా చేపట్టిన సార్వత్రిక సమ్మె బుధవారం నగరంలో ప్రశాంతంగా ముగిసింది. ఉద యం నుంచి సాయంత్రం వరకు ఆటోలు, బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వివిధ ప్రాంతాల్లో పాఠశాలలు మూతపడ్డాయి. కొన్నిచోట్లస్కూళ్లు తెరచుకున్నా.. ఆటోలు అందుబాటులో లేకపోవడంతో పిల్లలు ఇబ్బందులకు గురయ్యారు. మరోవైపు బంద్‌ను సొమ్ము చేసుకొనేందుకు సెవెన్ సీటర్ ఆటోలు, టాటా ఏస్‌లు రంగంలోకి దిగాయి. రెట్టింపు చార్జీలతో నిలువు దోపిడీకి దిగాయి. సెట్విన్ బస్సులు సైతం అదే బాటలో నడిచాయి.
దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులు కూడా నిలిచిపోవడంతో మహాత్మాగాంధీ, జూబ్లీ, దిల్‌సుఖ్‌నగర్ బస్ స్టేషన్‌ల వద్ద ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వివిధ మార్గాల్లో ప్రైవేట్ వాహనాలు ప్రయాణికుల జేబులు లూఠీ చేశాయి. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్ల నుంచి బస్సులు, ఆటోలు అందుబాటులో లేకపోవడంతో సెవెన్ సీటర్ ఆటోవాలాలకు కాసుల పంట పండింది. గాంధీ, ఉస్మానియా, నిలోఫర్, తదితర ఆస్పత్రుల వద్ద రోగుల తరలింపు సమస్యగా మారింది. ఎంఎంటీఎస్ రైళ్లు ప్రయాణికులతో కిటకిటలాడాయి.
ఉదయం నుంచే స్తంభించిన రవాణా...
సార్వత్రిక సమ్మె విజయవంతానికి ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్, ఎంప్లాయీస్ యూనియన్, ఎస్‌డబ్ల్యూఎఫ్ తదితర సంఘాలు, సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్‌టీయూ, టీఆర్‌ఎస్‌టీవీకే, తెలంగాణ ఆటో డ్రైవర్ల సంక్షేమ సంఘం, తెలంగాణ క్యాబ్స్, ట్యాక్సీ డ్రైవర్ల సంఘాల ప్రతినిధులు, కార్మికులు పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టారు. దీంతో తెల్లవారు జామునుంచే ప్రజా రవాణా నిలిచిపోయింది. కార్మిక సంఘాల ప్రతినిధులు ఎంజీబీఎస్, జేబీఎస్, తదితర ప్రాంతాల్లో బస్సుల రాకపోకలను నిలిపివేశారు. అన్ని ఆటో, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బాగ్‌లింపల్లి సుందరయ్య పార్కు నుంచి ఇందిరాపార్కు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ... రహదారి భద్రతా బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని నినాదాలు చేశారు. ప్రజా రవాణాను నిర్వీర్యం చేసేందుకు, రవాణా రంగంలో ప్రైవేట్ సంస్థలకు పెద్దపీట వేసేందుకే కేంద్రం ఈ బిల్లును ముందుకు తెస్తోందని కార్మిక సంఘాలు ధ్వజమెత్తాయి. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, అబిడ్స్, సికింద్రాబాద్, తదితర ప్రాంతాల్లో ధర్నాలు, ర్యాలీల్లో కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు మిన్నంటాయి.
రైల్వే సంఘాల సంఘీభావం...
సార్వత్రిక సమ్మెకు మద్దతుగా రైల్వే కార్మిక సంఘాలు సికింద్రాబాద్‌లో భారీ ప్రదర్శన చేపట్టాయి. దక్షిణ మధ్య రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ ఆధ్వర్యంలో రైల్ నిలయంలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో సంఘ ప్రధాన కార్యదర్శి మర్రి రాఘవయ్య ముఖ్య అతిథిగా ప్రసంగించారు. కేంద్రం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను దుయ్యబట్టారు. రైల్వేల ప్రైవేటీకరణకు ప్రభుత్వం సిద్ధపడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని నిరసిస్తూ దేశవ్యాప్త సమ్మెకు సన్నద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు. మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో కార్మికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. సంఘ నేతలు శివ కుమార్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.