కోర్టు ఆదేశాలతో కొన్ని గంటల్లోనే విరమణ
టెల్ అవీవ్: హమాస్ చెరలో ఉన్న ఆరుగురు బందీల దారుణ హత్యపై ఇజ్రాయెలీలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. బందీలను సురక్షితంగా విడిపించడంలో బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వం విఫలమైందంటూ సోమవారం ఇజ్రాయెల్ వ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరిగింది. కారి్మక సంఘాల పిలుపు మేరకు బ్యాంకులు, ఆరోగ్య విభాగాలు, రవాణా సంస్థలు సహా చాలా వరకు మూతబడ్డాయి. కొన్ని ప్రాంతాల్లోని స్కూళ్లు కొద్దిసేపు మాత్రమే పనిచేశాయి.
ప్రధానమైన బెన్ గురియెన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉదయం 8–10 గంటల మధ్య టేకాఫ్ సేవలు నిలిచిపోయాయి. వేలాదిగా పౌరులు వీధుల్లోకి వచ్చారు. టెల్‌అవీవ్‌తోపాటు దేశవ్యాప్తంగా జరిగిన ర్యాలీల్లో కనీసం 5 లక్షల మంది పాలుపంచుకున్నారు. హమాస్‌తో ఒప్పందం కుదుర్చుకున్న పక్షంలో వారంతా సురక్షితంగా వెనక్కి వచ్చి ఉండేవారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికీ బందీలుగా ఉన్న 100 మందిని వెనక్కి తీసుకువచ్చేందుకు వెంటనే హమాస్‌తో ఒప్పందం చేసుకోవాలన్నారు. అయితే, సమ్మె రాజకీయ ప్రేరేపితమంటూ ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై కారి్మక న్యాయస్థానం సానుకూలంగా స్పందించింది. సమ్మెను మధ్యాహ్నం 2.30 గంటలకల్లా ముగించాలని స్పష్టం చేసింది. కోర్టు నిర్ణయాన్ని శిరసావహిస్తామని దేశంలోని అతిపెద్ద కారి్మక సంఘం హిస్ట్రాదుట్ నేత అర్నాన్ బ్రార్ డేవిడ్ తెలిపారు. తమ వారిని వెంటనే విధుల్లోకి చేరాలని కోరారు. సమ్మె కారణంగా ప్రధాన సేవలకు అంతరాయం ఏర్పడలేదని వివరించారు.
ఒప్పందానికి నెతన్యాహు సానుకూలంగా లేరు: బైడెన్
ఇజ్రాయెల్‌లో పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హమాస్‌తో ఒప్పందం కుదుర్చుకుని, బందీలను సురక్షితంగా వెనక్కి తీసుకువచ్చేందుకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆసక్తి చూపడం లేదన్నారు. హమాస్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై సలహాదారులతో వైట్‌హౌస్‌లో జరిగిన సమావేశానికి హాజరైన అధ్యక్షుడు బైడెన్ మీడియాతో మాట్లాడారు. కాల్పుల విరమణ ఒప్పందానికి అతి చేరువలో ఉన్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment