ఇదే నా చివరి హెచ్చరిక.. ట్రంప్‌ తీవ్ర వ్యాఖ్యలు | "If You Hold Hostages, You Are Dead...": US President Donald Trump Last Warning To Hamas | Sakshi
Sakshi News home page

ఇదే నా చివరి హెచ్చరిక.. ట్రంప్‌ తీవ్ర వ్యాఖ్యలు

Published Thu, Mar 6 2025 7:44 AM | Last Updated on Thu, Mar 6 2025 10:47 AM

US President Donald Trump Last Warning To Hamas

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌(Donald Trump) హమాస్‌పై భగ్గుమన్నారు. తమ అదుపులో ఉన్న మిగిలిన బందీలను తక్షణమే విడుదల చేయాలని.. లేకుంటే అంతు చూస్తానని హమాస్‌ను  హెచ్చరించారు. ఈ క్రమంలో ఇదే తన చివరి హెచ్చరిక అని పేర్కొన్నారు. 

హమాస్(Hamas) విడుదల చేసిన ఎనిమిది మందితో వైట్‌హౌజ్‌తో తాజాగా ట్రంప్‌ సమావేశం అయ్యారు.  అనంతరం ఆయన ఎక్స్‌లో ఓ పోస్ట్‌ చేశారు. ‘‘హలోనా? గుడ్‌బైనా?.. ఏదో మీరే ఎంచుకోండి. బందీలందరిని వెంటనే విడుదల చేయండి. అలాగే మీరు చంపిన వాళ్ల మృతదేహాలను తిరిగి అప్పగించండి. లేకుంటే మీ పని ఖతమే. మానసికంగా మూర్ఖులైనవాళ్లు మాత్రమే ఇలా మృతదేహాలను తమ వద్ద ఉంచుకుంటారు. అందుకే.. పని పూర్తి చేసేందుకు అవసరమైనవన్నీ ఇజ్రాయెల్‌కు పంపుతున్నా. నేను చెప్పింది చేయకుంటే.. ఒక్క హమాస్‌ సభ్యుడు కూడా మిగలడు. 

‘‘మీరు చిధ్రం చేసిన కొందరు బందీలను నేను కలిశా. ఇదే మీకు నా చివరి హెచ్చరిక. గాజానుప్పుడే వీడండి. ఇదే మీకు చివరి అవకాశం. గాజా ప్రజల్లారా.. మీ కోసం అందమైన భవిష్యత్తు ఎదురు చూస్తోంది. ఒకవేళ బందీలను గనుక విడుదల చేయకుంటే.. అది మీకు దక్కదు. బందీలందరినిప్పుడే విడుదల చేయండి.. లేదంటే తర్వాత అనుభవించాల్సి ఉంటుంది అని పదే పదే హెచ్చరిక జారీ చేశారాయన. 

2023 అక్టోబర్‌ 7వ తేదీన గాజా యుద్ధం(Gaza War) మొదలైన సంగతి తెలిసిందే. తొలుత హమాస్‌ జరిపిన మెరుపు క్షిపణుల దాడుల్లో 1,200 మంది ఇజ్రాయిల్‌ పౌరులు మరణించారు. ఆ సమయంలోనే కొందరు ఇజ్రాయెల్‌ పౌరుల్ని, విదేశీయుల్ని హమాస్‌ ఎత్తుకెళ్లి తమ చెరలో బంధీలుగా ఉంచుకుంది. ఈ దాడికి ప్రతిగా ఇజ్రాయెల్‌ గాజాపై జరిపిన దాడుల్లో.. ఇప్పటిదాకా 46 వేల మంది పాలస్తీనా ప్రజలు మరణించారు. ఇందులో పిల్లలే ఎక్కువగా ఉన్నారు. అదే సమయంలో లక్షల మంది ప్రాణభయంతో గాజాను విడిచిపెట్టి పోయారు. 

అయితే ట్రంప్‌ అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టడానికి ముందు నుంచే హమాస్‌ను బందీల విడుదల విషయంలో హెచ్చరికలు జారీ చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో పాలస్తీనా ఖైదీలు, యుద్ధ ఖైదీల విడుదలకు ఇజ్రాయెల్‌-హమాస్‌ పరస్పరం ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఒప్పందం అమలు నిదానంగా జరుగుతుండడం.. ఒకానొక దశలో హమాస్‌ బందీల విడుదలను నిలుపుదల చేయడంతో ట్రంప్‌ ఇలా చివరి హెచ్చరిక జారీ చేశారు. మరోవైపు.. గాజా నుంచి పాలస్తీనా ప్రజలను వెళ్లగొట్టి పునర్‌ నిర్మిస్తామని ట్రంప్‌ వ్యాఖ్యానించడం.. ఓ ఏఐ జనరేటెడ్‌ వీడియో పోస్ట్‌​ చేయడం విమర్శలకు దారి తీసిన సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement