నెతన్యాహుపై అరెస్టు వారెంట్‌ | International Criminal Court Issues Arrest Warrants For Netanyahu, Gallant And Hamas Commander, More Details Inside | Sakshi
Sakshi News home page

నెతన్యాహుపై అరెస్టు వారెంట్‌

Published Fri, Nov 22 2024 5:11 AM | Last Updated on Fri, Nov 22 2024 9:51 AM

International Criminal Court issues arrest warrants for Netanyahu

జారీ చేసిన అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టు  

ఇజ్రాయెల్‌ మాజీ రక్షణ మంత్రి, హమాస్‌ నేతలపైనా వారెంట్లు  

ఐసీసీ తీరును ఖండించిన నెతన్యాహు  

ద హేగ్‌: ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహుపై అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టు(ఐసీసీ) గురువారం అరెస్టు వారెంట్లు జారీ చేసింది. అలాగే ఇజ్రాయెల్‌ రక్షణ శాఖ మాజీ మంత్రి యోవ్‌ గల్లాంట్‌తోపాటు పలువురు హమాస్‌ నేతలపైనా వారెంట్లు జారీ చేసింది. బెంజమిన్, గల్లాంట్‌ గాజాలో మారణహోమం సాగించారని, మానవత్వంతో దాడి చేశారని ఐసీసీ ఆక్షేపించింది. హత్యలు చేయడం, సాధారణ ప్రజలను వేధించడం వంటి అమానవీయ చర్యలకు పాల్పడ్డారని ఆరోపించింది. 

గాజాలో ప్రజలకు ఆహారం, నీరు, ఔషధాలు, విద్యుత్, ఇంధనం, ఇతర నిత్యావసరాలు అందకుండా ఆంక్షలు విధించారని, అమాయకుల మరణానికి కారకులయ్యారని మండిపడింది. నెతన్యాహు, గల్లాంట్‌ చర్యల వల్ల ఎంతోమంది మహిళలు, చిన్నారులు బలయ్యారని ఉద్ఘాటించింది. పౌష్టికాహారం, నీరు అందక, డీహైడ్రేషన్‌తో పసిబిడ్డలు మరణించారని పేర్కొంది. 

నెతన్యాహు, గల్లాంట్‌ ఉద్దేశపూర్వకంగానే సామాన్య ప్రజలపై వైమానిక దాడులు చేసినట్లు చెప్పడానికి సహేతుకమైన ఆధారాలను గుర్తించామని వివరించింది. గాజాలో నెలకొన్న మానవతా సంక్షోభానికి నెతన్యాహు, గల్లాంట్‌ బాధ్యత వహించాలని తేల్చిచెప్పింది. యుద్ధ నేరాల్లో నెతన్యాహు నిందితుడని స్పష్టం చేసింది. 

గాజాలో 2023 అక్టోబర్‌ 8 నుంచి 2024 మే 20వ తేదీ దాకా నెలకొన్న పరిణామాలను పరిగణనలోకి తీసుకున్న అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టు నెతన్యాహు, గల్లాంట్‌పై అరెస్టు వారెంట్లు జారీ చేసింది. అలాగే గాజాలో భీకర యుద్ధానికి, సంక్షోభానికి కారణమయ్యారంటూ హమాస్‌ నేతలపైనా అరెస్టు వారెంట్లు జారీ అయ్యాయి. హమాస్‌ అగ్రనేతలు మొహమ్మద్‌ డెయిఫ్, యహ్యా సిన్వర్, ఇస్మాయిల్‌ హనియేను అరెస్టు చేయాలని ఐసీసీ స్పష్టంచేసింది. అయితే, యహ్యా సిన్వర్, ఇస్మాయిల్‌ హనియే ఇప్పటికే ఇజ్రాయెల్‌ దాడుల్లో మృతిచెందిన సంగతి తెలిసిందే.  

ఇప్పుడేం జరగొచ్చు?   
ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి, రక్షణ శాఖ మాజీ మంత్రిపై అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టు అరెస్టు వారెంట్లు జారీ చేయడంతో ఇప్పుడేం జరుగుతుందన్న చర్చ మొదలైంది. ఐసీసీ అరెస్టు వారెంట్లు జారీ చేయడంతో నెతన్యాహు, గల్లాంట్‌ ఇప్పుడు అంతర్జాతీయంగా వాంటెడ్‌ నిందితులుగా మారారు. ప్రపంచ దేశాల అధినేతలు వారికి మద్దతు ఇవ్వడానికి వీల్లేదు. అదే జరిగితే అంతర్జాతీయంగా నెతన్యాహు, గల్లాంట్‌ ఒంటరవుతారు. చివరకు గాజాలో కాల్పుల విరమణ ప్రక్రియ ప్రారంభించే ప్రయత్నాలు మరింత సంక్లిష్టంగా మారుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement