ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తన దేశ ప్రజలకు క్షమాపణ చెప్పారు. గాజాలోని సొరంగంలో లభ్యమైన ఆరుగురు ఇజ్రాయెల్ బందీలను సురక్షితంగా తిరిగి తీసుకురావడంలో విఫలమైనందుకు బెంజమిన్ సోమవారం క్షమాపణలు కోరారు.
‘బందీలను సజీవంగా తిరిగి తీసుకురానందుకు నేను మిమ్మల్ని క్షమించమని అడుగుతున్నాను. మేము ప్రయత్నించాం కానీవిజయం సాధించలేదు. దీనికి హమాస్ చాలా భారీ మూల్యం చెల్లించవలసి ఉంటుంది.’ అని నెతన్యాహు విలేకరుల సమావేశంలో చెప్పారు.
కాగా శనివారం గాజాలోని రఫా ప్రాతంలోని భూగర్భ సొరంగంలో ఆరుగురు ఇజ్రాయిల్ బందీల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్టు ఆదేశ సైన్యం ప్రకటించిన విషయం తెలిసిందే.
మృతదేహాలు గాజా సరిహద్దు సమీపంలోని కిబ్బట్జ్ కమ్యూనిటీకి చెందిన కార్మెల్ గాట్, ఈడెన్ యెరుషల్మి, అల్మోగ్ సరుసి, ఒరి డానినో, యుఎస్-ఇజ్రాయెలీ హెర్ష్ గోల్డ్‌బెర్గ్-పోలిన్, రష్యన్-ఇజ్రాయెలీ అలెగ్జాండర్ లోబనోవ్‌గా గుర్తించారు. వీరిని అక్టోబర్ 7న మ్యూజిక్ ఫెస్టివల్ నుంచి కిడ్నాప్ చేసిన హమాస్ ఉగ్రవాదులు బందీలుగా చేశారు.
హమాస్ చెరలోని ఆరుగురు బందీల మృతదేహాలు రఫాలోని ఓ సొరంగంలో లభ్యం కావడంతో నెతన్యాహు ప్రభుత్వంపై ఇజ్రాయెల్ వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం పెల్లుబుకుతోంది. ప్రధానికి వ్యతిరేకంగా సోమవారం ఇజ్రాయెల్‌లో భారీ ప్రదర్శనలు జరిగాయి. కాల్పుల విరమణకు అంగీకరించాలని, హమాస్ చెరలోని బందీలను సురక్షితంగా రప్పించాలని డిమాండ్ చేస్తూ టెల్ అవీవ్ వీధుల్లో ఆందోళనకారులు కదం తొక్కారు. తమ ఆప్తులు 11నెలల నుంచి బందీలుగా ఉన్నప్పటికీ వారిని వెనక్కు తేవడంలో నెతన్యాహు విఫలమయ్యారంటూ ఆరోపించారు.
ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న పాలస్తీనా ఖైదీలకు బదులుగా హమాస్ వద్ద బందీలుగా ఉన్నవారిని విడుదల చేసేలా కాల్పుల విరమణ ఒప్పందం కుదిర్చేందుకు అమెరికా, ఈజిప్ట్, ఖతార్‌కు చెందిన మధ్యవర్తులు ప్రయత్నిస్తున్నారు. అయితే కాల్పుల విరమణ ఒప్పందం కుదరకపోవడానికి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుయే కారణమన్న కోణంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యానించారు. ఆయన మాట్లాడుతూ.. హమాస్‌తో బందీల విడుదల ఒప్పందం, కాల్పుల విరమణ కోసం నెతన్యాహు తగినంతగా పనిచేయడం లేదని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment