
తాత్కాలిక విరమణ ప్రకటించిన పుతిన్
మాస్కో: ఈస్టర్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఉక్రెయిన్‌తో జరిగే యుద్ధంలో తాత్కాలికంగా కాల్పుల విరమణను పాటించనున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు. మాస్కో కాలమానం ప్రకారం శనివారం రాత్రి 6 గంటల నుంచి ఆదివారం అర్ధరాత్రి వరకు దాదాపు 30 గంటలపాటు ఇది అమల్లో ఉంటుందన్నారు. ఇదే విధమైన కాల్పుల విరమణకు ఉక్రెయిన్ ముందుకు రావాలని కోరారు.
ఆ దేశం సానుకూలంగా స్పందిస్తుందని ఆశిస్తున్నామన్నారు. ఆర్మీ చీఫ్ వలెరీ గెరాసిమోవ్‌తో సమావేశం అనంతరం పుతిన్ ఈ మేరకు ప్రకటన చేశారు. అదే సమయంలో, రష్యా బలగాలు కాల్పుల విరమణ ఉల్లంఘనలకు, శత్రువు దుందుడుకు, రెచ్చగొట్టే చర్యలకు దీటుగా స్పందించేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
కాల్పుల విరమణపై ఉక్రెయిన్ ప్రతిస్పందనను బట్టి, ఈ సంక్షోభాన్ని ముగించే విషయంలో ఆ దేశానికి నిజంగా చిత్తశుద్ధి ఉన్నదీ లేనిదీ తెలుస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. ఇంధన వనరులే లక్ష్యంగా 30 రోజుల పాటు పరస్పరం దాడులకు పాల్పడరాదనే నిబంధనను ఇప్పటికే పలుమార్లు ఉక్రెయిన్ ఉల్లంఘించిందని ఆయన ఆరోపించారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య ఒప్పందం కుదిరి, యుద్ధం ఆగని పరిస్థితుల్లో తాము మరోదారిని ఎంచుకుంటామంటూ అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో శుక్రవారం హెచ్చరికలు చేయడం తెల్సిందే.
ప్రాణాలతో పుతిన్ చెలగాటం: జెలెన్‌స్కీ
పుతిన్ కాల్పుల విరమణ ప్రకటనపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్పందించారు. తమ బలగాలు కాల్పుల విరమణకు అంగీకరించవని ఆయన స్పష్టం చేశారు. పుతిన్ మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారంటూ మండిపడ్డారు. ‘మా గగనతలంలో రష్యా షహీద్ డ్రోన్ల సంచారం, మా సైరెన్ల మోతలు ఆగడం లేదు’అని రష్యాను నిందించారు. విరమణ సమయాన్ని మరిన్ని బలగాలను సమీకరించుకునేందుకు, తమపై దాడులను ముమ్మరం చేసేందుకే పుతిన్ వాడుకుంటారని ఆరోపించారు.