‘రష్యా దూకుడుకు కళ్లెం వేద్దాం’
క్రూయెన్(జర్మనీ): ఉక్రెయిన్ విషయంలో రష్యా అనుసరిస్తున్న ధోరణిపట్ల జీ7 దేశాలు కలసికట్టుగా వ్యవహరించి రష్యా దూకుడుకు కళ్లెం వేయాల్సిన అవసరం ఉందని అమెరికా అధ్యక్షుడు ఒబామా ఆ కూటమి దేశాల నేతలకు పిలుపునిచ్చారు. జీ7 సదస్సు కోసం క్రూయెన్ పట్టణానికి చేరుకున్న ఒబామాకు జర్మనీ శనివారం సంప్రదాయ విందు ఇచ్చింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీ8 సమ్మిట్‌గా ఉన్న తాము రష్యా అధ్యక్షుడు పుతిన్ వైదొలగడంతో జీ7గా మారామని అన్నారు.
పుతిన్‌కు ఈ సమావేశం ద్వారా గట్టి సందేశం పంపాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచ అభ్యున్నతికి జర్మనీతో కలసి పనిచేస్తామన్నారు. కాగా, జీ7 సదస్సు జరుగుతున్న క్రూయెన్ పట్టణం ప్రపంచీకరణ వ్యతిరేకులు, పర్యావరణ వేత్తల ఆందోళనలతో అట్టుడికింది.