Double charges
-
బ్రిటన్ వీసా రుసుము రెట్టింపు!
లండన్: యూరోపియన్ యూనియన్ బయటి దేశాల నుంచి బ్రిటన్‌కు వచ్చే వలసదారులపై విధించే హెల్త్ సర్‌చార్జీని ఆ దేశం డిసెంబరు నుంచి రెండింతలు చేయనుంది. దీంతో భారత్ సహా పలు దేశాల నుంచి బ్రిటన్‌కు వెళ్లే పౌరులు, విద్యార్థులు, ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు వీసా ఫీజు కింద మరింత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం వలస వీసాదారులు ఏడాదికి 200 (దాదాపు రూ. 19,400) పౌండ్లు, విద్యార్థి వీసా కలిగినవారు ఏడాదికి 150 (దాదాపు రూ. 14,540) పౌండ్లు సర్‌చార్జీ కింద చెల్లిస్తున్నారు. ఈ రుసుము వీసా ఫీజులో కలిపి ఉంటుంది. తాజాగా ఈ మొత్తాన్ని బ్రిటన్ రెండింతలు చేయాలని నిర్ణయించింది. దీంతో వలస వీసాదారులు 400 (దాదాపు రూ. 38,800) పౌండ్లు, విద్యార్థి వీసాదారులు 300 (దాదాపు రూ. 29,080) పౌండ్లను చెల్లించాల్సి ఉంటుంది. బ్రిటన్ జాతీయ ఆరోగ్య సేవల పథకం (ఎన్హెచ్ఎస్)కు నిధుల సమీకరణ కోసం హెల్త్ సర్‌చార్జీని 2015లో ప్రవేశపెట్టారు. తాజా పెంపు కారణంగా ఎన్హెచ్ఎస్కు ఏడాదికి 22 కోట్ల పౌండ్ల అదనపు నిధులు అందుతాయి. బ్రిటన్ పౌరులతోపాటు 6 నెలలకు పైగా ఆ దేశంలో ఉండేందుకు వీసా మంజూరైన వారంతా ఈ రుసుము చెల్లించాలి. అయితే తాజా పెంపు నుంచి యూరోపియన్ యూనియన్ దేశాల పౌరులను మినహాయించారు. వారూ చెల్లించడం సమంజసమే: మంత్రి ఆరోగ్య పథకాన్ని వలసదారులకూ వర్తింపజేస్తున్నందున వారి నుంచి ఈ పథకానికి నిధులను సేకరించడం సమంజసమేనని బ్రిటన్ వలసల శాఖ మంత్రి కరోలిన్ నోక్స్ చెప్పారు. ‘అవసరమైనప్పుడు మా ఆరోగ్యసేవల పథకం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది. దీర్ఘకాలం బ్రిటన్‌లో ఉండే వలసదారులు ఈ సేవలను వాడుకోవడాన్ని మేం స్వాగతిస్తాం. కానీ ఇది మా దేశానికి సంబంధించినది, అంతర్జాతీయ ఆరోగ్య పథకం కాదు. వలసదారులకూ మేం ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నందున వారు కూడా ఇందుకు కొంత మొత్తం చెల్లించడం సమంజసంగా ఉంటుంది.’ అని ఆమె వివరించారు. బ్రిటన్ పార్లమెంటు ఆమోదం తర్వాత డిసెంబరులో సర్‌చార్జీ పంపు అమల్లోకి రానుంది. ఇందుకు సంబంధించిన బిల్లును గురువారమే హౌస్ ఆఫ్ కామన్స్‌లో ప్రవేశపెట్టారు. బ్రిటన్‌లో ఆరు నెలల కన్నా ఎక్కువ కాలం ఉండాలనుకునే వలసదారులు.. స్వదేశానికి తిరిగొచ్చే వరకూ ఈ హెల్త్ సర్‌చార్జీని ప్రతి ఏటా చెల్లించాలి. -
సమ్మె ప్రశాంతం
నిలిచిన ఆటోలు, బస్సులు పాఠశాలల మూసివేత సెవెన్‌సీటర్ ఆటోల నిలువుదోపిడీ ప్రయాణికుల పడిగాపులు సిటీబ్యూరో: రహదారి భద్రతా బిల్లుకు వ్యతిరేకంగా చేపట్టిన సార్వత్రిక సమ్మె బుధవారం నగరంలో ప్రశాంతంగా ముగిసింది. ఉద యం నుంచి సాయంత్రం వరకు ఆటోలు, బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వివిధ ప్రాంతాల్లో పాఠశాలలు మూతపడ్డాయి. కొన్నిచోట్లస్కూళ్లు తెరచుకున్నా.. ఆటోలు అందుబాటులో లేకపోవడంతో పిల్లలు ఇబ్బందులకు గురయ్యారు. మరోవైపు బంద్‌ను సొమ్ము చేసుకొనేందుకు సెవెన్ సీటర్ ఆటోలు, టాటా ఏస్‌లు రంగంలోకి దిగాయి. రెట్టింపు చార్జీలతో నిలువు దోపిడీకి దిగాయి. సెట్విన్ బస్సులు సైతం అదే బాటలో నడిచాయి. దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులు కూడా నిలిచిపోవడంతో మహాత్మాగాంధీ, జూబ్లీ, దిల్సుఖ్నగర్ బస్ స్టేషన్ల వద్ద ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వివిధ మార్గాల్లో ప్రైవేట్ వాహనాలు ప్రయాణికుల జేబులు లూఠీ చేశాయి. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్ల నుంచి బస్సులు, ఆటోలు అందుబాటులో లేకపోవడంతో సెవెన్ సీటర్ ఆటోవాలాలకు కాసుల పంట పండింది. గాంధీ, ఉస్మానియా, నిలోఫర్, తదితర ఆస్పత్రుల వద్ద రోగుల తరలింపు సమస్యగా మారింది. ఎంఎంటీఎస్ రైళ్లు ప్రయాణికులతో కిటకిటలాడాయి. ఉదయం నుంచే స్తంభించిన రవాణా... సార్వత్రిక సమ్మె విజయవంతానికి ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్, ఎంప్లాయీస్ యూనియన్, ఎస్‌డబ్ల్యూఎఫ్ తదితర సంఘాలు, సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్టీయూ, టీఆర్ఎస్టీవీకే, తెలంగాణ ఆటో డ్రైవర్ల సంక్షేమ సంఘం, తెలంగాణ క్యాబ్స్, ట్యాక్సీ డ్రైవర్ల సంఘాల ప్రతినిధులు, కార్మికులు పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టారు. దీంతో తెల్లవారు జామునుంచే ప్రజా రవాణా నిలిచిపోయింది. కార్మిక సంఘాల ప్రతినిధులు ఎంజీబీఎస్, జేబీఎస్, తదితర ప్రాంతాల్లో బస్సుల రాకపోకలను నిలిపివేశారు. అన్ని ఆటో, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బాగ్లింపల్లి సుందరయ్య పార్కు నుంచి ఇందిరాపార్కు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ... రహదారి భద్రతా బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని నినాదాలు చేశారు. ప్రజా రవాణాను నిర్వీర్యం చేసేందుకు, రవాణా రంగంలో ప్రైవేట్ సంస్థలకు పెద్దపీట వేసేందుకే కేంద్రం ఈ బిల్లును ముందుకు తెస్తోందని కార్మిక సంఘాలు ధ్వజమెత్తాయి. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, అబిడ్స్, సికింద్రాబాద్, తదితర ప్రాంతాల్లో ధర్నాలు, ర్యాలీల్లో కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు మిన్నంటాయి. రైల్వే సంఘాల సంఘీభావం... సార్వత్రిక సమ్మెకు మద్దతుగా రైల్వే కార్మిక సంఘాలు సికింద్రాబాద్‌లో భారీ ప్రదర్శన చేపట్టాయి. దక్షిణ మధ్య రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ ఆధ్వర్యంలో రైల్ నిలయంలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో సంఘ ప్రధాన కార్యదర్శి మర్రి రాఘవయ్య ముఖ్య అతిథిగా ప్రసంగించారు. కేంద్రం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను దుయ్యబట్టారు. రైల్వేల ప్రైవేటీకరణకు ప్రభుత్వం సిద్ధపడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని నిరసిస్తూ దేశవ్యాప్త సమ్మెకు సన్నద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు. మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో కార్మికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. సంఘ నేతలు శివ కుమార్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు. -
ఊరికి దారేది?
సాక్షి, సిటీబ్యూరో : రైళ్లు ఫుల్... ఆర్టీసీ బస్సులు నిల్... ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీ... వెరసి దసరా పండక్కి సొంతవూరు వెళ్లాలనుకునేవారికి దిక్కుతోచని పరిస్థితి. మరో మూడు రోజుల్లో పిల్లలకు దసరా సెలవులు. పండగ సందర్భంగా ఇంటిల్లిపాదీ కలిసి సొంతవూరు వెళ్లాలనుకుంటున్న నగర వాసుల ఆశలపై తాజా పరిస్థితులు నీళ్లు చల్లుతున్నాయి. అరవై రోజులుగా సీమాంధ్రలో కొనసాగుతున్న సమ్మె నేపథ్యంలో ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. ఇదే అదనుగా భావించిన ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు ఇప్పటి కే రెట్టింపు చార్జీలు వసూలు చేస్తున్నాయి. పండక్కి మరింత పక్కాగా దోపిడీ చేసేందుకు సన్నద్ధమవుతున్నాయి. ఇటు ఆర్టీసీ బస్సుల్లో వెళ్లేందుకు అవకాశం లేక, రైళ్లలో బెర్తులు లభించక చాలామంది ప్రయాణాలు విరమించుకొంటున్నారు. పిల్లల సెలవులను దృష్టిలో పెట్టుకొని సాహసం చేస్తున్నవాళ్లకు మాత్రం రవాణా కష్టాలు చుక్కలు చూపిస్తున్నాయి. చాంతాడంత జాబితా... సీమాంధ్ర సమ్మెను దృష్టిలో ఉంచుకొని దక్షిణమధ్యరైల్వే కొన్ని ప్రధాన మార్గాల్లో వందకు పైగా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. కొన్ని రైళ్లలో స్లీపర్‌కోచ్‌లు, ఏసీ కోచ్‌లను పెంచారు. కానీ వీటిలో చాలావరకు వారానికి ఒక రోజు, రెండు రోజులు మాత్రమే నడిచే రైళ్లు కావడంతో ప్రయాణికులకు పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. అక్టోబర్ 4 నుంచి 13వ తేదీ వరకు మాత్రమే ప్రజలు పెద్దఎత్తున తరలి వెళ్లే అవకాశం ఉంది. కానీ ఈ రోజుల్లో నడిచే రైళ్లు తక్కువ. దీంతో రెగ్యులర్ రైళ్లపైనే ఒత్తిడి పెరుగుతోంది. ఇప్పటికే పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ‘నో రూమ్’ దర్శనమిస్తుండగా, మరికొన్ని రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ బాగా పెరిగింది. గోదావరి, విశాఖ, పద్మావతి, వెంకటాద్రి, మచిలీపట్నం, యశ్వంత్‌పూర్ తదితర ప్రధాన రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ 300 వరకు పెరిగింది. ఏ ట్రైన్లో ఏ రోజు ‘నో రూమ్’ దర్శనమిస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. మరోవైపు ప్రత్యేక రైళ్లలోనూ రద్దీ కనిపిస్తోంది. సెలవులను దృష్టిలో ఉంచుకొని ప్రయాణ ఏర్పాట్లు చేసుకొంటున్న వాళ్లకు మాత్రం ప్రత్యేక రైళ్లు పెద్దగా ప్రయోజనకరంగా కనిపించడం లేదు. కొన్ని రైళ్లలో బెర్తులు అందుబాటులో ఉన్నప్పటికీ దసరా సెలవులకు ముందూ, తరువాత మాత్రమే కనిపిస్తూండడంతో చాలామంది ప్రైవేట్ బస్సులను ఆశ్రయిస్తున్నారు. కదలని బస్సులు సీమాంధ్ర సమ్మె దృష్ట్యా హైదరాబాద్ నుంచి ఆయా ప్రాంతాలకు వెళ్లే సుమారు 1500 బస్సులు నిలిచిపోయాయి. 60 రోజులుగా ఆర్టీసీ స్తంభించింది. సాధారణంగా దసరా, సంక్రాంతి వంటి పండుగ రోజుల్లో ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతుంది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులు ఏర్పాటు చేస్తారు. గత సంవత్సరం దసరా సందర్భంగా 3400 ప్రత్యేక బస్సులు నడిపిన ఆర్టీసీ.. ఈ ఏడాది సమ్మె కారణంగా చేతులెత్తేసింది. గత సంవత్సరం దసరా సందర్భంగా సుమారు 10 లక్షల మంది ప్రయాణికులు ఒక్క ఆర్టీసీ బస్సుల్లోనే తరలి వెళ్లినట్లు అంచనా. ఈ ఏడాది సీమాంధ్రకు ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఇప్పటివరకు ఎలాంటి అవకాశం లేకపోవడంతో తెలంగాణ జిల్లాలకు మాత్రమే 1500 ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఆర్టీసీ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అక్టోబర్ 9వ తేదీ నుంచి ఈ బస్సులు బయలుదేరుతాయి. ప్రైవేట్ బస్సుల దోపిడీ గత 60 రోజులుగా ప్రయాణికులపై నిలువుదోపిడీ కొనసాగిస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ ఆపరేటర్లు దసరాకు మరింత పకడ్బందీగా దోపిడీ చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం బుక్ చేసుకున్న ప్రయాణికుల నుంచే రెట్టింపు చార్జీలు వసూలు చేస్తుండగా.. దసరా సెలవులు ప్రారంభమైన తర్వాత ఈ చార్జీలు మరింత పెరిగే అవకాశం ఉంది. -
ప్రైవేటు వాహనాల ‘డబ్బు’ల్ దోపిడీ
చోడవరం,న్యూస్‌లైన్: రాష్ట్రం సమైక్యంగా ఉండాలని ఎన్ని ఇబ్బందులుకైనా ఓర్చి జనమంతా ఆందోళనలు, బంద్‌లు చేస్తుంటే... మీరు అధిక వసూళ్లు చేయడం న్యాయమా? అంటూ ప్రయాణికులు ఆటో, ట్రక్కర్, ఇతర రవాణా వాహనాలను నడిపే డ్రైవర్లను ప్రశ్నిస్తున్నారు. అయినా వీరు డబుల్ ఛార్జీలు గుంజడమే పనిగా పెట్టుకున్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ఎక్కడికక్కడే ఆందోళనలు చేయడంతో కొద్ది రోజులుగా జనజీవనం పూర్తిగా స్థంభించిపోయింది. అసలే వరలక్ష్మీదేవి వ్రతాలు, పెళ్లిళ్లు జరుగుతున్న తరుణంలో ఆర్టీసీ సమ్మె, ఆందోళనల కారణంగా జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వారం పదిరోజుల తర్వాత రాకపోకలు పూర్తిస్థాయిలో పునరుద్దరణ కావడంతో జనమంతా తమ పనులు, శుభకార్యాలకు రాకపోకలు ప్రారంభించారు. ఆటోలు, మ్యాక్సీ వ్యాన్లు, ట్రక్కర్లు వంటి ప్రైవేటు వాహనాలు జోరుగా తిరిగాయి. ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో ఈ ప్రైవేటు వాహనాల డ్రైవర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వ్యాపార కేంద్రం చోడవరం నుంచి విశాఖపట్నం, అనకాపల్లి, పాడేరు, నర్సీపట్నం వంటి ప్రధాన పట్టణాలతో పాటు మాడుగుల, దేవరాపల్లి, చీడికాడ, రావికమతం, బుచ్చెయ్యపేట, సబ్బవరం ఇతర ప్రాంతాలకు నిత్యం వేలాది మంది రాకపోకలు సాగిస్తారు. బస్సులు లేకపోవడంతో ప్రైవేటు వాహనదార్లు ఇష్టారాజ్యంగా ఛార్జీలు గుంజేస్తున్నారు. విశాఖపట్నంకు సాధారణ చార్జీ రూ.35 కాగా ఇప్పుడు రూ.100, అనకాపల్లికి రూ.12 కాగా 25లు వసూలు చేస్తున్నారు. ఇదే తరహాలో అన్ని ప్రాంతాలకు డబుల్ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. వాస్తవానికి ఆర్టీసీ బస్సులు తిరగకపోవడం మినహా ఆయిల్, ఇతర ఛార్జీలు ఏమీ పెరగలేదు. అయినప్పటికీ ఆటో, ట్రక్కర్, ఇతర ప్రయాణ వాహనాల డ్రైవర్లు ఇంత మొత్తంలో దోపిడీకి పాల్పడుతున్నారు. సమైక్యాంద్ర ఉద్యమం ప్రజలంతా కలిసి చేస్తుంటే ఈ ప్రైవేటు వాహనాల నిర్వాహకులు మాత్రం జనాన్ని దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారంటూ జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రయాణాలు తప్పక పోవడంతో డబుల్ ఛార్జీలు ఇచ్చైనా వెళ్లాల్సి వస్తుందని చాలా మంది ప్రయాణీకులు వాపోతున్నారు. ఈ తరుణంలో సమైక్య జేఎసీ నాయకులు, ఆటో, కార్లు, ట్రక్కర్ స్టాండ్ల సంఘాలు చర్యలు తీసుకోలని, లేనిపక్షంలో పోలీసులైనా చొరవ తీసుకొని అక్రమ ఛార్జీలు వసూలు చేస్తున్న వారిపై కేసులు నమోదు చేయాలని ప్రయాణీకులు కోరుతున్నారు.