చోడవరం,న్యూస్‌లైన్: రాష్ట్రం సమైక్యంగా ఉండాలని ఎన్ని ఇబ్బందులుకైనా ఓర్చి జనమంతా ఆందోళనలు, బంద్‌లు చేస్తుంటే... మీరు అధిక వసూళ్లు చేయడం న్యాయమా? అంటూ ప్రయాణికులు ఆటో, ట్రక్కర్, ఇతర రవాణా వాహనాలను నడిపే డ్రైవర్లను ప్రశ్నిస్తున్నారు. అయినా వీరు డబుల్ ఛార్జీలు గుంజడమే పనిగా పెట్టుకున్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ఎక్కడికక్కడే ఆందోళనలు చేయడంతో కొద్ది రోజులుగా జనజీవనం పూర్తిగా స్థంభించిపోయింది. అసలే వరలక్ష్మీదేవి వ్రతాలు, పెళ్లిళ్లు జరుగుతున్న తరుణంలో ఆర్టీసీ సమ్మె, ఆందోళనల కారణంగా జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
వారం పదిరోజుల తర్వాత రాకపోకలు పూర్తిస్థాయిలో పునరుద్దరణ కావడంతో జనమంతా తమ పనులు, శుభకార్యాలకు రాకపోకలు ప్రారంభించారు. ఆటోలు, మ్యాక్సీ వ్యాన్లు, ట్రక్కర్లు వంటి ప్రైవేటు వాహనాలు జోరుగా తిరిగాయి. ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో ఈ ప్రైవేటు వాహనాల డ్రైవర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వ్యాపార కేంద్రం చోడవరం నుంచి విశాఖపట్నం, అనకాపల్లి, పాడేరు, నర్సీపట్నం వంటి ప్రధాన పట్టణాలతో పాటు మాడుగుల, దేవరాపల్లి, చీడికాడ, రావికమతం, బుచ్చెయ్యపేట, సబ్బవరం ఇతర ప్రాంతాలకు నిత్యం వేలాది మంది రాకపోకలు సాగిస్తారు.
బస్సులు లేకపోవడంతో ప్రైవేటు వాహనదార్లు ఇష్టారాజ్యంగా ఛార్జీలు గుంజేస్తున్నారు. విశాఖపట్నంకు సాధారణ చార్జీ రూ.35 కాగా ఇప్పుడు రూ.100, అనకాపల్లికి రూ.12 కాగా 25లు వసూలు చేస్తున్నారు. ఇదే తరహాలో అన్ని ప్రాంతాలకు డబుల్ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. వాస్తవానికి ఆర్టీసీ బస్సులు తిరగకపోవడం మినహా ఆయిల్, ఇతర ఛార్జీలు ఏమీ పెరగలేదు. అయినప్పటికీ ఆటో, ట్రక్కర్, ఇతర ప్రయాణ వాహనాల డ్రైవర్లు ఇంత మొత్తంలో దోపిడీకి పాల్పడుతున్నారు.
సమైక్యాంద్ర ఉద్యమం ప్రజలంతా కలిసి చేస్తుంటే ఈ ప్రైవేటు వాహనాల నిర్వాహకులు మాత్రం జనాన్ని దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారంటూ జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రయాణాలు తప్పక పోవడంతో డబుల్ ఛార్జీలు ఇచ్చైనా వెళ్లాల్సి వస్తుందని చాలా మంది ప్రయాణీకులు వాపోతున్నారు. ఈ తరుణంలో సమైక్య జేఎసీ నాయకులు, ఆటో, కార్లు, ట్రక్కర్ స్టాండ్ల సంఘాలు చర్యలు తీసుకోలని, లేనిపక్షంలో పోలీసులైనా చొరవ తీసుకొని అక్రమ ఛార్జీలు వసూలు చేస్తున్న వారిపై కేసులు నమోదు చేయాలని ప్రయాణీకులు కోరుతున్నారు.
ప్రైవేటు వాహనాల ‘డబ్బు’ల్ దోపిడీ
Published Fri, Aug 16 2013 3:13 AM | Last Updated on Fri, Sep 1 2017 9:51 PM
Advertisement