Samaikyandra movement
-
సమైక్యనాదమే జగన్నినాదం
ఒంగోలు, న్యూస్‌లైన్: సమైక్యనాదమే జగన్నినాదమని వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్, కందుకూరు నియోజకవర్గ సమన్వయకర్త నూకసాని బాలాజీ అన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సమైక్యాంధ్రకు మద్దతుగా మంగళవారం జిల్లావ్యాప్తంగా రిలే దీక్షలు చేపట్టారు. కందుకూరు నియోజకవర్గం ఉలవపాడులోని రిలే దీక్ష శిబిరంలో నియోజకవర్గ సమన్వయకర్తలు నూకసాని బాలాజీ, తూమాటి మాధవరావు, ఉన్నం వీరాస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ రాష్ట్ర విభజన వల్ల ఇరుప్రాంతాలు తీవ్రంగా నష్టపోయి అభివృద్ధి కుంటుపడుతుందని తెలిసినా మొండిగా రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని చూడటం దారుణమన్నారు. కాంగ్రెస్ పార్టీ కేవలం అధికార దాహంతో రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని విమర్శించారు. తెలంగాణ బిల్లు చర్చకన్నా ముందే అసెంబ్లీలో సమైక్యాంధ్ర తీర్మానం చేయాలని వైఎస్సార్ సీపీ కోరినా.. కాంగ్రెస్, టీడీపీలు మొద్దు నిద్ర వీడకపోవడం దారుణమన్నారు. దీక్షలో 16 మంది కూర్చున్నారు. కనిగిరిలో చేపట్టిన రిలే దీక్షల్లో నియోజకవర్గ సమన్వయకర్తలు ముక్కు కాశిరెడ్డి, కాటం అరుణమ్మలతోపాటు వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ రాష్ట్ర నాయకుడు వై.నాగిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముక్కలైతే అభివృద్ధి కల్ల అన్నారు. సంక్షేమ రాజ్యం కోసం జనం ఎదురుచూస్తుంటే సంక్షోభ రాజ్యాన్ని కిరణ్‌కుమార్‌రెడ్డి సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. కనిగిరిలో 9 మంది దీక్ష చేపట్టారు. వీరితోపాటు జిల్లా అధికార ప్రతినిధి నరాల రమణారెడ్డి, యువజన విభాగం నాయకుడు బన్నీ తదితరులు పాల్గొన్నారు. పామూరులో 8 మంది, వెలిగండ్లలో 16 మంది రిలే దీక్షలో కూర్చున్నారు. యర్రగొండపాలెం నియోజకవర్గ పరిధిలోని పెద్దదోర్నాల నటరాజ్ సెంటర్లో రిలే దీక్షను నియోజకవర్గ సమన్వయకర్త పాలపర్తి డేవిడ్‌రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తీవ్ర కడగండ్లు ఎదుర్కొంటున్న పశ్చిమ ప్రకాశం రైతులు వెలిగొండ ప్రాజెక్టు వస్తేనైనా తమ బతుకులు బాగుపడతాయని గంపెడాశెతో ఉన్నారన్నారు. కానీ రాష్ట్ర విభజన పేరుతో తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు రెండూ ఆ నమ్మకాన్ని సైతం వమ్ము చేస్తున్నాయని, ప్రతి రైతు సమైక్యాంధ్రకు మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇక్కడ 12 మంది దీక్షలో కూర్చున్నారు. మార్కాపురం ఆర్డీవో కార్యాలయం వద్ద నియోజకవర్గ సమన్వయకర్త వెన్నా హనుమారెడ్డి సమైక్యాంధ్ర దీక్షను ప్రారంభించారు. మొత్తం పది మంది దీక్ష చేపట్టారు. గిద్దలూరు తహసీల్దారు కార్యాలయం వద్ద వైఎస్సార్సీపీ గిద్దలూరు నియోజకవర్గ సమన్వయకర్త ముత్తుముల అశోక్‌రెడ్డి రిలే దీక్షను ప్రారంభించారు. మొత్తం 12 మంది దీక్ష చేపట్టారు. దర్శిలో తొలిరోజు నలుగురు దీక్ష చేపట్టగా..జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు కుమ్మిత అంజిరెడ్డి దీక్షలను ప్రారంభించారు. ఒంగోలులో వైఎస్సార్ సీపీ బీసీసెల్ జిల్లా కన్వీనర్ కఠారి శంకర్, బీసీ సెల్ నగర కన్వీనర్ బొప్పరాజు కొండలరావు, బీసీ విభాగం రాష్ట్ర నాయకులు పొగర్త చెంచయ్య, బూర్సు మాలకొండయ్యతో కలిపి మొత్తం 25 మంది దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జగన్మోహన్రెడ్డి మాత్రమే రాష్ట్రాన్ని సమర్థవంతంగా పాలించగలరన్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిలు సమైక్యాంధ్రపై నాటకాలాడుతూ ప్రజలను దారుణంగా మోసగిస్తున్నారని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ కంచర్ల సుధాకర్, ప్రకాశం, నెల్లూరు జిల్లాల దళిత విభాగం కోఆర్డినేటర్ పాలడుగు విజేంద్ర బహుజన్, వైఎస్సార్ సీపీ నాయకులు సింగరాజు వెంకట్రావు, గోవర్థన్‌రెడ్డి, బొగ్గుల శ్రీనివాసరెడ్డి, గంగాడ సుజాత తదితరులు ప్రసంగించారు. -
సిలబస్ లేటరుు్యంది
ఏలూరు సిటీ, న్యూస్‌లైన్ : భవిష్యత్‌కు కీలకమైన పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సిద్ధపడుతున్న విద్యార్థులకు పాఠ్యాంశాల బోధన ఆలస్యమవుతోంది. సిలబస్ పూర్తికాకపోవడంతో వారికి ఇబ్బందులు తప్పేట్లు లేవు. నవంబర్ నాటికే పాఠ్యాంశాల బోధన పూర్తిచేయాల్సి ఉండగా, డిసెంబర్ నెలాఖరుకైనా పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. సమైక్యాంధ్ర ఉద్యమం నేపథ్యంలో పాఠశాలలు 53 రోజులపాటు మూతపడ్డాయి. దీంతో బోధన పూర్తికాలేదు. ఒకేసారి పాఠాలన్నీ చదవాల్సి రావటంతో విద్యార్థులు గందరగోళానికి గురవుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులపై వత్తిడి పెరుగుతోంది. ప్రైవేటు విద్యాసంస్థలు ఒకవైపు స్కూళ్లు నడుపుతూనే సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొనగా.. ప్రభుత్వ పాఠశాలలు మాత్రం మూతపడ్డారుు. దీంతో జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాసే సుమారు 44వేల మంది విద్యార్థులు తంటాలు పడుతున్నారు. అదనపు బోధనా దినాలు గాలికి... సమైక్యాంధ్ర ఉద్యమం చేసిన 53 రోజులకు సంబంధించిన పాఠ్యాంశాలను బోధించేం దుకు వీలుగా ఉపాధ్యాయులు 33రోజులపాటు అదనంగా పనిచేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. కొంతమంది ఉపాధ్యాయులు తాము ఉద్యమంలో పాల్గొనలేదని, ఇప్పుడు సెలవు రోజుల్లో పనిచేయాలంటే కుదరదని చెబుతున్నారు. కొందరైతే సెలవు రోజుల్లోనూ పనిచేస్తున్నామని చెబుతున్నా.. విధులకు డుమ్మా కొడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అలాంటి వారిపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోలేని పరిస్థితి నెలకొంది. నవంబర్ నెలలో సిలబస్ పూర్తిచేసి.. ఆ తరువాత అర్ధసంవత్సర పరీక్షలు నిర్వహించి.. జనవరిలో పాఠ్యాంశాల పునశ్చరణ చేయాల్సి ఉంది. ఇవేమీ ఆచరణలో సాధ్యమయ్యే పరిస్థితి కనిపించటం లేదు. జిల్లాలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు 465కు పైగా ఉండగా, ప్రైవేటు విద్యాసంస్థలు 350కు పైగా ఉన్నా యి. ప్రైవేటు స్ళూలో విద్యార్థుల పరిస్థితి బాగానే ఉన్నా, ప్రభుత్వ స్కూళ్ళలోని విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా తయూరైంది. ప్రణాళిక వేశాం : డీఈవో త్రైమాసిక పరీక్షలు నిర్వహించిన అనంతరం పదో తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ప్రణాళికను అమలు చేస్తామని ఆర్.నరసింహరావు చెప్పారు. ఇప్పటికే ఉదయం, సాయంత్రం పాఠశాలల వేళల గంటపాటు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. జనవరి నుంచి పాఠ్యాంశాల పునశ్చరణ ప్రారంభి విద్యార్థులు సాధించిన మార్కుల ఆధారంగా గ్రేడింగ్ చేసి వెనుకబడ్డ వారిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. సీ, డీ గ్రేడ్ విద్యార్థులు ఏఏ సబ్జెక్టులో వెనుకబడ్డారో పరిశీలించి ఆయా సబ్జెక్టులో ప్రత్యేక తరగతులు నిర్వహించి ఉత్తీర్ణత సాధించేలా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. ఉత్తీర్ణతే ధ్యేయంగా కాకుండా పాఠ్యాంశాల అవగాహనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. సబ్జెక్ట్ టీచర్ల కొరత ఉండే ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయులను నియమించేందుకు చర్యలు చేపట్టామని చెప్పారు. -
175 నియోజకవర్గాల్లో వైసీపీ నేతల సమైక్య దీక్షలు
-
175 నియోజకవర్గాల్లో వైసీపీ నేతల సమైక్య దీక్షలు
విభజన నిర్ణయం వెనక్కి తీసుకునేలా కేంద్రంపై ఒత్తిడి పెంచడమే లక్ష్యం సాక్షి నెట్వర్క్: జాతిపిత మహాత్మాగాంధీ స్ఫూర్తితో.. ఆయన పుట్టినరోజైన అక్టోబర్ 2వ తేదీ నుంచి సీమాంధ్ర జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాల్లో సత్యాగ్రహాలతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమైక్య ఉద్యమ ప్రభంజనం సృష్టించనుంది. రాష్ర్ట విభజన నిర్ణయం నేపథ్యంలో రెండునెలలుగా సమైక్య ఉద్యమంలో చురుకుగా వ్యవహరిస్తోన్న వైఎస్సార్సీపీ ఇప్పుడు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు సమగ్ర కార్యాచరణతో పోరాటాన్ని మరింత ఉధృతం చేయనుంది. 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ నేతలంతా ఒకేరోజున నిరాహారదీక్షలు చేపట్టడం ద్వారా సమైక్య ఉద్యమ ఉధృతికి తోడ్పడుతూ, విభజన నిర్ణయం వెనక్కి తీసుకునేలా కేంద్రంపై ఒత్తిడి పెంచాలని నిర్ణయించింది. మహాత్మాగాంధీ, లాల్‌బహదూర్ శాస్త్రిల జయంతి పురస్కరించుకుని ఈ నెల 2 నుంచి నవంబర్ ఒకటి రాష్ట్ర అవతరణ దినోత్సవం వరకు వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలను ఇప్పటికే పార్టీ ప్రకటించింది. తద్వారా సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్న ప్రజలకు బాసటగా నిలవాలని నిర్ణయించింది. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఉధృతం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినట్లు పార్టీ సీనియర్ నేత కొణతాల రామకృష్ణ మంగళవారం హైదరాబాద్‌లో విలేకరులకు తెలిపారు. కేంద్రంలో కదలిక తీసుకొచ్చేందుకు నెలరోజుల ఉద్యమ కార్యచరణను రూపొందించినట్లు చెప్పారు. ‘‘తొలిరోజు బుధవారం కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ సమన్వయకర్తలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, నేతలు నిరాహార దీక్ష చేపట్టనున్నారు. 7న మంత్రులు, కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఇళ్ల ముందు శాంతియుతంగా ధర్నాలు ఉంటాయి. అసెంబ్లీని తక్షణం సమావేశపరిచి సమైక్య తీర్మానం చేయించాలనే డిమాండ్‌తో పాటు తదనంతరం పదవులకు రాజీనామా చేయాలని కోరుతూ, ప్రజాప్రతినిధులకు పూలు అందజేసి నిరసన తెలియజేస్తాం. 10న అన్ని మండల కేంద్రాల్లో రైతుల ఆధ్వర్యంలో దీక్షలుంటాయి. 17న అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో ఆటోలు, రిక్షాలతో ర్యాలీలు, 21న నియోజకవర్గ కేంద్రాల్లో యువజనులతో బైక్ ర్యాలీలు నిర్వహిస్తాం. 26న సర్పంచులు, సర్పంచ్ పదవికి పోటీచేసిన అభ్యర్థులు జిల్లా కేంద్రాల్లో ఒకరోజు దీక్ష చేస్తారు. 29న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో విద్యార్థులు, యువకులతో శాంతియుత ఆందోళన కార్యక్రమాలుంటాయి. నవంబర్ 1న అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామసభ నిర్వహించి సమైక్యాంధ్ర కోరుతూ తీర్మానాలు చేసే కార్యక్రమాలు చేపడతాం’’ అని కొణతాల వివరించారు. దీక్షలు ఎవరెక్కడ నియోజకవర్గ కేంద్రాల్లో దీక్షలకు వైఎస్సార్సీపీ నేతలు సిద్ధమయ్యారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో వైఎస్ఆర్సీపీ శాసనసభాపక్ష ఉపనేత శోభా నాగిరెడ్డి దీక్షలో కూర్చోనున్నారు. నంద్యాలలో పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు భూమా నాగిరెడ్డి నేతృత్వంలో 65 మంది దీక్ష చేపట్టనున్నారు. మంత్రాలయంలోని రాఘవేంద్ర కూడలిలో తాజా మాజీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి దీక్షకు సిద్ధం కాగా.. ఆయన సోదరుడు సీతారామిరెడ్డి కుమారుడు ప్రదీప్‌రెడ్డి ఆమరణ దీక్ష చేయనున్నట్లు ప్రకటించారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి బుధవారం నుంచి ఆమరణదీక్ష చేపట్టనున్నారు. అనంతపురంలో ఎమ్మెల్యే బి.గురునాథరెడ్డి నేతృత్వంలో దీక్ష చేపట్టనున్నారు. ధర్మవరంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి నేతృత్వంలో రిలే నిరాహార దీక్షలు జరగనున్నాయి. ఉరవకొండలో పార్టీ సీఈసీ సభ్యుడు విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో వెయ్యి మంది దీక్ష చేపడుతున్నారు. చిత్తూరు జిల్లా తిరుపతిలో ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి నాయకత్వంలో తుడ సర్కిల్ వద్ద రెండురోజుల పాటు రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నారు. వైఎస్సార్ జిల్లా రాయచోటిలో గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కమలాపురంలో పి.రవీంద్రనాథ్‌రెడ్డి, పులివెందులలో వైఎస్ అవినాష్‌రెడ్డి, రాజంపేటలో ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, పెనగలూరులో కొరముట్ల శ్రీనివాసులు దీక్షలు చేపట్టనున్నారు. గుంటూరు నగరంలో నగర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి కలెక్టరేట్ ఎదుట దీక్షకు దిగనున్నారు. పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ చిలకలూరిపేటలోని నరసరావుపేట సెంటర్లో దీక్షకు దిగనున్నారు. మాచర్లలోని అంబేద్కర్ సెంటర్లో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, సత్తెనపల్లిలో తాలూకా సెంటర్లో అంబటి రాంబాబు దీక్షకు కూర్చుంటారు. మంగళగిరిలో ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) నిరవధిక నిరాహార దీక్షలో కూర్చోనున్నారు. వైఎస్సార్ సీఎల్పీ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలులో దీక్ష చేపట్టనున్నారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్‌రావు కొండపిలో దీక్ష చేస్తారు. కృష్ణాజిల్లా జగ్గయ్యపేట ఆర్టీసీ బస్టాండ్ వద్ద వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను ఆమరణ దీక్ష చేపట్టనున్నారు. మచిలీ„పట్నం కోనేరు సెంటర్లో నియోజవకర్గ సమన్వయకర్త పేర్ని నాని ఆధ్వర్యంలో రిలే దీక్షలు, వినూత్న కార్యక్రమాలు చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మైలవరం నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త, తాజా మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్ ఆధ్వర్యంలో దీక్షలు చేపట్టనున్నారు. నెల్లూరు జిల్లా ఉదయƒుగిరిలో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి, కోవూరు నియోజకవర్గానికి సంబంధించి నార్తురాజుపాళెంలో జరిగే దీక్షల్లో ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి పాల్గొంటారు. విశాఖ జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో ఆయా నియోజకవర్గాల పరిధిలో సమన్వయకర్తల ఆధ్వర్యంలో ప్రధాన నేతలు, భారీ సంఖ్యలో కార్యకర్తలతో నిరాహార దీక్షలు నిర్వహించనున్నట్టు పార్టీ జిల్లా కన్వీనర్ చొక్కాకుల వెంకటరావు వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో తాజా మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్ సతీమణి విజయ, నరసన్నపేటలో ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌లు దీక్షలో కూర్చోనున్నారు. పార్టీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త ఆర్వీ సుజయకృష్ణ రంగారావు, విజయనగరం జిల్లా బొబ్బిలి పాత పెట్రోలు బంకు ఆవరణలో నిరాహార దీక్ష చేయనున్నారు. అలాగే పార్టీ జిల్లా కన్వీనర్ పెనుమత్స సాంబశివరాజు నెల్లిమర్ల నియోజకవర్గ కేంద్రంలో దీక్షకు కూర్చోనున్నారు. పార్టీ పశ్చిమగోదావరి జిల్లా కన్వీనర్, ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పోలవరం నియోజకవర్గ నేతలతో కలిసి కొయ్యలగూడెంలో నిరాహార దీక్ష ప్రారంభిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, పార్టీ సీజీసీ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్ ద్రాక్షారామ సెంటర్లో వెయ్యి మందితో దీక్షకు ఉపక్రమిస్తున్నారు. తాజా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి కాకినాడ మసీదుసెంటర్‌లో దీక్ష చేపట్టనున్నారు. బాలాజీచెర్వు సెంటర్లో దీక్ష కొనసాగించాలని ఆయన నిర్ణయించారు. రాజానగరం సాయిబాబా గుడి వద్ద పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలకిష్మ దీక్ష చేస్తారు. రాజమండ్రి కోటగుమ్మం సెంటర్లో ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, సిటీ కోఆర్డినేటర్ బొమ్మన రాజ్‌కుమార్‌ల ఆధ్వర్యంలో 500 మందితో దీక్షలు జరగనున్నాయి. -
కేసీఆర్ వ్యాఖ్యలపై మిన్నంటిన నిరసనలు
సాక్షి నెట్వర్క్: అదే జోరు..అదే హోరు.. 62రోజులుగా నిర్విరామంగా సాగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమం సోమవారం కూడా సీమాంధ్ర జిల్లాల్లో ఉద్ధృతంగా ఎగసింది. ఆంధ్రోళ్లంతా ద్రోహులే అని వ్యాఖ్యానించిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై సీమాంధ్రలో ఆగ్రహజ్వాలలు మిన్నంటాయి. కృష్ణాజిల్లా పామర్రు నుంచి బెజవాడ బెంజిసర్కిల్ వరకు అన్నదాతలు 150 ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో వైద్యులు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీని ముట్టడించారు. గుంటూరు జిల్లా బాపట్లలో విద్యార్థులు సముద్రంలో జలదీక్ష చేపట్టారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో విద్యార్థులు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. నెల్లూరు స్వర్ణాల చెరువులో ఎన్జీఓలు, విద్యార్థి జేఏసీ నాయకులు, సమైక్యాంధ్ర రొట్టెలు పట్టుకున్నారు. విశాఖ జిల్లా మద్దిలపాలెం కూడలిలో ఆర్టీసీ కార్మికులు కాగడాల ప్రదర్శన చేపట్టారు. అనకాపల్లిలో తొలిసారి భారీగా ఒకేసారి ఒకే వేదికపై సోమవారం 140మంది దీక్షలో కూర్చున్నారు. విజయనగరం జిల్లా పూసపాటిరేగ 16వ నంబర్ జాతీయరహదారిని రైతులు దిగ్బంధించారు. శ్రీకాకుళంలో ఉపాధ్యాయులు జాతీయ రహదారిపై మానవహారం నిర్వహించారు. కోనసీమలో రైతులు 500 మోటార్ సైకిళ్లతో ర్యాలీ నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ‘పశ్చిమ సమైక్య చైతన్యభేరి’ జరిగింది. అనంతపురంలో కేసీఆర్, సుష్మాస్వరాజ్ దిష్టిబొమ్మలు దహనం చేశారు. వైఎస్సార్ జిల్లా మైదుకూరులో విద్యార్థులు 200 మీటర్ల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. సమైక్యాంధ్ర ఉద ్యమాన్ని చులకన చేసి మాట్లాడిన కేసీఆర్‌పై జేఏసీ నాయకులు చిత్తూరు జిల్లా పీలేరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కర్నూలు జిల్లా నంద్యాలలో ప్రభుత్వాసుపత్రి జేఏసీ ఆధ్వర్యంలో వైద్యులు ర్యాలీ నిర్వహించారు. మనస్తాపంతో రైతన్న ఆత్మహత్య రాష్ట్ర విభజనపై టీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు మనస్తాపం చెంది చిత్తూరు జిల్లా కేవీబీ పురం మండలం మహదేవపురానికి చెందిన రైతు కృష్ణయ్య(40) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గర్జించిన అన్నదాతలు సమైక్య రాష్ట్రం కోసం రైతన్నలు గర్జించారు. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గ రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ‘రెడ్డి రైతు గర్జన’కు పదివేల మందికి పైగా తరలివచ్చారు. విజయనగరం జిల్లా పూసపాటిరేగలో ఉపాధ్యాయ పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన రైతుగర్జన కార్యక్రమం విజయవంతంగా సాగింది. శ్రీకాకుళం జిల్లా రేగిడి మండలం ఉంగరాడ మెట్ట వద్ద నిర్వహించిన సమైక్య గర్జన కార్యక్రమానికి జనం వెల్లువెత్తారు. పాలకొండలో యువగర్జన నిర్వహించారు. గుంటూరులో ‘మిర్చిపోరు-సమైక్యాహోరు’ బహిరంగ సభ నిర్వహించారు. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో నిర్వహించిన ‘సమైక్య సమర భేరి’ విజయవంతమైంది. పురందేశ్వరి, గంటా, రాయపాటి ఇళ్ల ముట్టడి కాంగ్రెస్ పార్టీ నేతలపై జనాగ్రహం కొనసాగుతోంది. విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో విశాఖలో కేంద్ర మంత్రి పురందేశ్వరి, రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావుల ఇళ్లను సోమవారం ముట్టడించారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ వి.ఎస్.ఆర్.కె.గణపతి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు తక్షణమే రాజీనామాలు చేసి ఉద్యమంలోకి రావాలని డిమాండ్ చేశారు. ఇక గుంటూరు నగరంలో కూడా విద్యుత్ జేఏసీ నాయకులు ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇంటిని ముట్టడించారు. కర్నూలు జిల్లా ఆదోనిలో కేంద్ర మంత్రులు కనిపించడం లేదంటూ పురవీధుల్లో ప్రచారం చేశారు. రాజీనామా తూచ్ : చింతమనేని : సమైక్యాంధ్రకు మద్దతుగా శాసనసభ సభ్యత్వానికి గతంలో తాను చేసిన రాజీనామాను ఉపసంహరించుకుంటున్నట్టు దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వెల్లడించారు. రాష్ట్ర విభజన బిల్లును శాసనసభలో ప్రవేశ పెట్టిన తరుణంలో సమైక్యాంధ్రకు మద్దతుగా ఓటేయాలనే ఉద్దేశంతోనే తానీ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను తిరస్కరించాలని కోరుతూ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌ను కలిసి విజ్ఞప్తి చేసినట్టు చింతమనేని సోమవారం తెలిపారు. -
మంత్రి విశ్వరూప్ రాజీనామా!
-
మంత్రి విశ్వరూప్ రాజీనామా!
హైదరాబాద్: రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమాభివృద్ధి శాఖా మంత్రి పినిపే విశ్వరూప్ తన పదవికి రాజీనామా చేశారు. గురువారం మధ్యాహ్నం రాజభవన్ లో గవర్నర్ నరసింహన్ ను కలిసిన విశ్వరూప్ రాజీనామాను అందచేశారు. తన రాజీనామాను ఆమోదించాలని గవర్నర్ ను మంత్రి విశ్వరూప్ కోరినట్టు సమాచారం. రాష్ట్ర విభజనను ఉప సంహరించుకుంటూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రకటన విడుదల చేయాలని సెప్టెంబర్ 7 తేదిన భీమవరంలో పినిపే విశ్వరూప్ డిమాండ్ చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమ నేతల నుంచి రాజీనామాకు ఒత్తిడి పెరగడం, విభజనకే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపుతోందనే వార్తల నేపథ్యంలో మంత్రి విశ్వరూప్ రాజీనామా తాజాగా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. గతంలో విశ్వరూప్ మాట్లాడుతూ నవంబర్ 1 లోగా విభజన ఉపసంహరణ ప్రకటన వెలువడకపోతే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పదవులకు రాజీనామా చేస్తానని తెలిపిన సంగతి తెలిసిందే. సమైక్యాంధ్ర ప్రకటన వస్తుందని, అప్పటి వరకూ వేచి చూడాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి చేసిన విజ్ఞప్తి మేరకు కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం కోసం వేచి చూశారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఎటువంటి సిగ్నల్ రాకపోవడంతో రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. -
జిల్లాలో ఆగని నిరసన జ్వాలలు
ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ జిల్లాలో నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. సమైక్యాంధ్రను సాధించడమే లక్ష్యంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వివిధ వర్గాల ప్రజలు ఆందోళనలను మరింత ఉధృతం చేస్తున్నారు. వరుసగా 53వ రోజూ జిల్లావ్యాప్తంగా నిరసన జ్వాలలు మిన్నంటాయి. ఉద్యమంలో భాగంగా ఒంగోలు నగరంలో కార్పొరేషన్ ఉద్యోగులు ప్రజాప్రతినిధుల మాస్క్‌లు ధరించి శనివారం నిరసన ర్యాలీ నిర్వహించారు. పశుసంవర్ధక శాఖ ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించి చర్చి సెంటర్లో ఆందోళన తెలిపారు. ఇక నగరంలోని క్రీడాకారులు బ్యాండ్ బాజాలతో చర్చి సెంటర్లో వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. సమైక్యాంధ్ర కోరుతూ పాదయాత్ర: అద్దంకిలో ఎన్జీఓ, ఆర్టీసీ, ఉపాధ్యాయ జేఏసీ నాయకులు వంద మంది అద్దంకి నుంచి శింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం వరకు పాదయాత్ర చేపట్టారు. బంగ్లారోడ్డులో సమైక్యవాదుల దీక్షలు 34వ రోజుకు చేరుకున్నాయి. వసతి గృహాల ఉద్యోగులు దీక్షలు చేపట్టారు. బల్లికురవలో ఉపాధ్యాయుల రిలే నిరాహార దీక్షలు 10వ రోజు కొనసాగాయి. కందుకూరులో ఫొటోగ్రాఫర్లు ర్యాలీ, మానవహారం నిర్వహించారు. చీరాలలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, మాలమహానాడు కార్యకర్తల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఉపాధ్యాయులు రోడ్లపైనే విద్యార్థులకు పాఠాలు చెప్పారు. మున్సిపల్ ఉద్యోగులు సమైక్యాంధ్ర టీషర్టులు ధరించి పట్టణంలో ర్యాలీ చేశారు. సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. వేటపాలెంలో ఉపాధ్యాయులు, మహిళలు, రైతులు, ఉద్యోగులు, కార్మికులు జేఏసీ ఆధ్వర్యంలో సామూహిక రిలే దీక్షలు చేశారు. పర్చూరులో జేఏసీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు రిలే దీక్షలో కూర్చున్నారు. ఇంకొల్లులో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల రిలే దీక్షలు మూడో రోజుకు చేరాయి. మార్కాపురంలో ఉద్యోగ సంఘాలు ర్యాలీ నిర్వహించాయి. ఆర్టీసీ ఉద్యోగులు మానవహారం చేశారు. జూనియర్, డిగ్రీ కాలేజీల విద్యార్థులు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పొదిలిలో సెల్‌షాపు యజమానుల నేతృత్వంలో ర్యాలీ చేశారు. కనిగిరిలో వైఎస్సార్ సీపీ కార్యకర్తల రిలే దీక్షలు 6వ రోజుకు చేరాయి. సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో వాల్మీకి సంఘం యువకులు రిలే దీక్షలో కూర్చున్నారు. మార్కెట్ యార్డ్ కమిటీ ఉద్యోగ సిబ్బంది చెక్‌పోస్టు వద్ద రాస్తారోకో, రిలే దీక్షలు చేపట్టారు. సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. డిగ్రీ కళాశాలలో అధ్యాపకులు రిలేదీక్షలు చేపట్టారు. పామూరులో సర్పంచ్ మనోహర్ చేపట్టిన నిరవధిక దీక్ష 4వ రోజుకు చేరింది. ఆర్టీసీ కార్మికులు, వ్యవసాయ మార్కెట్ సిబ్బంది వేర్వేరుగా రిలే దీక్షలు ప్రారంభించారు. యర్రగొండపాలెంలో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు రోడ్లపై చెప్పులు పాలిష్ చేసి నిరసన తెలిపారు. దోర్నాలలో ఉపాధ్యాయులు చేపట్టిన రిలే దీక్షలు 19వ రోజుకు చేరాయి. ఫొటోగ్రాఫర్లు, సెల్దుకాణాలు, సీడీ షాపుల యజమానులు పట్టణంలో భారీ ర్యాలీ, మానవహారం ఏర్పాటు చేశారు. గిద్దలూరులో ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం రిలే దీక్షలు చేపట్టారు. -
ప్రైవేటు వాహనాల ‘డబ్బు’ల్ దోపిడీ
చోడవరం,న్యూస్‌లైన్: రాష్ట్రం సమైక్యంగా ఉండాలని ఎన్ని ఇబ్బందులుకైనా ఓర్చి జనమంతా ఆందోళనలు, బంద్‌లు చేస్తుంటే... మీరు అధిక వసూళ్లు చేయడం న్యాయమా? అంటూ ప్రయాణికులు ఆటో, ట్రక్కర్, ఇతర రవాణా వాహనాలను నడిపే డ్రైవర్లను ప్రశ్నిస్తున్నారు. అయినా వీరు డబుల్ ఛార్జీలు గుంజడమే పనిగా పెట్టుకున్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ఎక్కడికక్కడే ఆందోళనలు చేయడంతో కొద్ది రోజులుగా జనజీవనం పూర్తిగా స్థంభించిపోయింది. అసలే వరలక్ష్మీదేవి వ్రతాలు, పెళ్లిళ్లు జరుగుతున్న తరుణంలో ఆర్టీసీ సమ్మె, ఆందోళనల కారణంగా జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వారం పదిరోజుల తర్వాత రాకపోకలు పూర్తిస్థాయిలో పునరుద్దరణ కావడంతో జనమంతా తమ పనులు, శుభకార్యాలకు రాకపోకలు ప్రారంభించారు. ఆటోలు, మ్యాక్సీ వ్యాన్లు, ట్రక్కర్లు వంటి ప్రైవేటు వాహనాలు జోరుగా తిరిగాయి. ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో ఈ ప్రైవేటు వాహనాల డ్రైవర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వ్యాపార కేంద్రం చోడవరం నుంచి విశాఖపట్నం, అనకాపల్లి, పాడేరు, నర్సీపట్నం వంటి ప్రధాన పట్టణాలతో పాటు మాడుగుల, దేవరాపల్లి, చీడికాడ, రావికమతం, బుచ్చెయ్యపేట, సబ్బవరం ఇతర ప్రాంతాలకు నిత్యం వేలాది మంది రాకపోకలు సాగిస్తారు. బస్సులు లేకపోవడంతో ప్రైవేటు వాహనదార్లు ఇష్టారాజ్యంగా ఛార్జీలు గుంజేస్తున్నారు. విశాఖపట్నంకు సాధారణ చార్జీ రూ.35 కాగా ఇప్పుడు రూ.100, అనకాపల్లికి రూ.12 కాగా 25లు వసూలు చేస్తున్నారు. ఇదే తరహాలో అన్ని ప్రాంతాలకు డబుల్ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. వాస్తవానికి ఆర్టీసీ బస్సులు తిరగకపోవడం మినహా ఆయిల్, ఇతర ఛార్జీలు ఏమీ పెరగలేదు. అయినప్పటికీ ఆటో, ట్రక్కర్, ఇతర ప్రయాణ వాహనాల డ్రైవర్లు ఇంత మొత్తంలో దోపిడీకి పాల్పడుతున్నారు. సమైక్యాంద్ర ఉద్యమం ప్రజలంతా కలిసి చేస్తుంటే ఈ ప్రైవేటు వాహనాల నిర్వాహకులు మాత్రం జనాన్ని దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారంటూ జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రయాణాలు తప్పక పోవడంతో డబుల్ ఛార్జీలు ఇచ్చైనా వెళ్లాల్సి వస్తుందని చాలా మంది ప్రయాణీకులు వాపోతున్నారు. ఈ తరుణంలో సమైక్య జేఎసీ నాయకులు, ఆటో, కార్లు, ట్రక్కర్ స్టాండ్ల సంఘాలు చర్యలు తీసుకోలని, లేనిపక్షంలో పోలీసులైనా చొరవ తీసుకొని అక్రమ ఛార్జీలు వసూలు చేస్తున్న వారిపై కేసులు నమోదు చేయాలని ప్రయాణీకులు కోరుతున్నారు.