సమైక్యనాదమే జగన్నినాదం
ఒంగోలు, న్యూస్‌లైన్: సమైక్యనాదమే జగన్నినాదమని వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్, కందుకూరు నియోజకవర్గ సమన్వయకర్త నూకసాని బాలాజీ అన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సమైక్యాంధ్రకు మద్దతుగా మంగళవారం జిల్లావ్యాప్తంగా రిలే దీక్షలు చేపట్టారు. కందుకూరు నియోజకవర్గం ఉలవపాడులోని రిలే దీక్ష శిబిరంలో నియోజకవర్గ సమన్వయకర్తలు నూకసాని బాలాజీ, తూమాటి మాధవరావు, ఉన్నం వీరాస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ రాష్ట్ర విభజన వల్ల ఇరుప్రాంతాలు తీవ్రంగా నష్టపోయి అభివృద్ధి కుంటుపడుతుందని తెలిసినా మొండిగా రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని చూడటం దారుణమన్నారు. కాంగ్రెస్ పార్టీ కేవలం అధికార దాహంతో రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని విమర్శించారు. తెలంగాణ బిల్లు చర్చకన్నా ముందే అసెంబ్లీలో సమైక్యాంధ్ర తీర్మానం చేయాలని వైఎస్సార్ సీపీ కోరినా.. కాంగ్రెస్, టీడీపీలు మొద్దు నిద్ర వీడకపోవడం దారుణమన్నారు. దీక్షలో 16 మంది కూర్చున్నారు.
కనిగిరిలో చేపట్టిన రిలే దీక్షల్లో నియోజకవర్గ సమన్వయకర్తలు ముక్కు కాశిరెడ్డి, కాటం అరుణమ్మలతోపాటు వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ రాష్ట్ర నాయకుడు వై.నాగిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముక్కలైతే అభివృద్ధి కల్ల అన్నారు. సంక్షేమ రాజ్యం కోసం జనం ఎదురుచూస్తుంటే సంక్షోభ రాజ్యాన్ని కిరణ్‌కుమార్‌రెడ్డి సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. కనిగిరిలో 9 మంది దీక్ష చేపట్టారు. వీరితోపాటు జిల్లా అధికార ప్రతినిధి నరాల రమణారెడ్డి, యువజన విభాగం నాయకుడు బన్నీ తదితరులు పాల్గొన్నారు. పామూరులో 8 మంది, వెలిగండ్లలో 16 మంది రిలే దీక్షలో కూర్చున్నారు.
యర్రగొండపాలెం నియోజకవర్గ పరిధిలోని పెద్దదోర్నాల నటరాజ్ సెంటర్‌లో రిలే దీక్షను నియోజకవర్గ సమన్వయకర్త పాలపర్తి డేవిడ్‌రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తీవ్ర కడగండ్లు ఎదుర్కొంటున్న పశ్చిమ ప్రకాశం రైతులు వెలిగొండ ప్రాజెక్టు వస్తేనైనా తమ బతుకులు బాగుపడతాయని గంపెడాశెతో ఉన్నారన్నారు. కానీ రాష్ట్ర విభజన పేరుతో తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు రెండూ ఆ నమ్మకాన్ని సైతం వమ్ము చేస్తున్నాయని, ప్రతి రైతు సమైక్యాంధ్రకు మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇక్కడ 12 మంది దీక్షలో కూర్చున్నారు.
మార్కాపురం ఆర్డీవో కార్యాలయం వద్ద నియోజకవర్గ సమన్వయకర్త వెన్నా హనుమారెడ్డి సమైక్యాంధ్ర దీక్షను ప్రారంభించారు. మొత్తం పది మంది దీక్ష చేపట్టారు. గిద్దలూరు తహసీల్దారు కార్యాలయం వద్ద వైఎస్సార్‌సీపీ గిద్దలూరు నియోజకవర్గ సమన్వయకర్త ముత్తుముల అశోక్‌రెడ్డి రిలే దీక్షను ప్రారంభించారు. మొత్తం 12 మంది దీక్ష చేపట్టారు. దర్శిలో తొలిరోజు నలుగురు దీక్ష చేపట్టగా..జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు కుమ్మిత అంజిరెడ్డి దీక్షలను ప్రారంభించారు.
ఒంగోలులో వైఎస్సార్ సీపీ బీసీసెల్ జిల్లా కన్వీనర్ కఠారి శంకర్, బీసీ సెల్ నగర కన్వీనర్ బొప్పరాజు కొండలరావు, బీసీ విభాగం రాష్ట్ర నాయకులు పొగర్త చెంచయ్య, బూర్సు మాలకొండయ్యతో కలిపి మొత్తం 25 మంది దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమే రాష్ట్రాన్ని సమర్థవంతంగా పాలించగలరన్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిలు సమైక్యాంధ్రపై నాటకాలాడుతూ ప్రజలను దారుణంగా మోసగిస్తున్నారని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ కంచర్ల సుధాకర్, ప్రకాశం, నెల్లూరు జిల్లాల దళిత విభాగం కోఆర్డినేటర్ పాలడుగు విజేంద్ర బహుజన్, వైఎస్సార్ సీపీ నాయకులు సింగరాజు వెంకట్రావు, గోవర్థన్‌రెడ్డి, బొగ్గుల శ్రీనివాసరెడ్డి, గంగాడ సుజాత తదితరులు ప్రసంగించారు.