తమ పార్టీలో పాతవారికి సముచిత స్థానం ఇస్తామని.. అలాగే కొత్తవారినీ ఆహ్వానిస్తున్నామని వైఎస్‌ఆర్‌సీపీ కేంద్రపాలక మండలి సభ్యుడు జూపూడి ప్రభాకరరావు తెలిపారు.
వల్లూరు(టంగుటూరు),న్యూస్‌లైన్: తమ పార్టీలో పాతవారికి సముచిత స్థానం ఇస్తామని.. అలాగే కొత్తవారినీ ఆహ్వానిస్తున్నామని వైఎస్‌ఆర్‌సీపీ కేంద్రపాలక మండలి సభ్యుడు జూపూడి ప్రభాకరరావు తెలిపారు. వల్లూరులో గురువారం నిర్వహించిన గడపగడపకూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ నూకసాని బాలాజీతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ అందరూ కలిసి కట్టుగా పనిచేస్తేనే పార్టీ బలోపేతం అవుతుందని సూచించారు. పార్టీని ఆదుకునేవారికి ప్రత్యేక గుర్తింపు ఇస్తామన్నారు. ప్రతి ఒక్కరూ సమన్వయంతో వ్యవహరించాల్సి ఉంటుందని చెప్పారు. దివంగత నేత వైఎస్‌ఆర్ ఆశయ సాధనకోసం వైఎస్‌ఆర్‌సీపీ ఆవిర్భవించిందన్నారు.
ప్రజల విశ్వాసం నుంచి వైఎస్ కుటుంబాన్ని వేరుచేయడం ఎవరితరమూ కాదని తెలిపారు. ఆ కుటుంబంపై చేస్తున్న ప్రచారాలను తిప్పికొట్టాలని కోరారు. చంద్రబాబును ఎవరూ విశ్వసించడంలేదన్నారు. 9ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ప్రజలకు చేసింది ఏమీ లేదని చెప్పారు. నూకసాని బాలాజీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు జగన్ న్యాయకత్వాన్ని కోరుకుంటున్నారని, వైఎస్ సంక్షేమ పథకాలను తిరిగి సమర్థవంతంగా కొనసాగించగల నాయకుడు జగన్ మాత్రమేనన్నారు. అందుకే ఆయన సీఎం కావాలని ప్రజలంతా ఆకాంక్షిస్తున్నారని చెప్పారు. వైఎస్ తమ మనిషని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ఆయన పథకాలను ఎందుకు మూలన పెడుతోందని ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రులు ఎన్‌టీఆర్, వైఎస్‌లకు దీటుగా జగన్ పనిచేయగలరని ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తలంతా కష్టపడి పనిచేయాలని, బూత్‌కమిటీలు ఏర్పాటు చే సి.. సమర్థులైన వారిని సభ్యులుగా నియమించాలని కోరారు.
పార్టీ తీర్థం పుచ్చుకున్న హనుమారెడ్డి
ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు, మాజీ సర్పంచ్ కుందం హనుమారెడ్డి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తమ గ్రామానికి దివంగత నేత వైఎస్ చేసిన సేవలకు కృతజ్ఞతగా పార్టీలో చేరినట్లు హనుమారెడ్డి తెలిపారు. సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్న ఓకే ఒక నాయకుడు జగన్ మాత్రమేనని అభినందించారు. మండల కన్వీనర్ బొట్లా రామారావు అధ్యక్షత వహించిన కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి తాటితోటి నరిసింగరావు, వల్లూరమ్మ ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ ఉప్పలపాటి నర్సరాజు, పొందూరు సర్పంచ్ చిట్నీడి రంగారావు, ఎస్సీసెల్ రాష్ట్ర సభ్యుడు చెక్కా రాజేశ్వరరావు, మండల కన్వీనర్ దాసరి సుబ్బారావు, కుందం మోహనరెడ్డి, యువజన నాయకుడు కృష్ణారెడ్డి పాల్గొన్నారు.