ఒంగోలు, న్యూస్‌లైన్: రాష్ట్ర విభ జన ప్రక్రియను అడ్డుకునేందుకు శుక్రవారం జిల్లా వ్యాప్తంగా బంద్ నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ నూకసాని బాలాజీ తెలిపారు. స్థానిక పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం ఉదయం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రపతి నుంచి శాసనసభ ఆమోదం కోసం వచ్చిన విభజన బిల్లును సభలో ప్రవేశపెట్టరాదన్నారు. విభజన బిల్లును శాసనసభలో ప్రవేశపెడితే ఆమోదించినా..ఆమోదించకపోయినా రాష్ట్ర విభజనకు అనుకూలంగా మారుతుందన్నారు.
సమైక్యాంధ్రకు సంఘీభావంగా ప్రజలను చైతన్యవంతం చేసేందుకు, రాష్ట్రానికి పట్టిన విభజన పీడ ఎదుర్కొనేందుకు వారం రోజులపాటు వైఎస్‌ఆర్ సీపీ కార్యాచరణ రూపొందించిందన్నారు. శుక్రవారం అన్ని విద్యా, వ్యాపార సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు మూసేసి తమకు సహకరించాలని పిలుపునిచ్చారు. ప్రతి సమైక్యవాది బంద్‌కు సంఘీభావం తెలపాలని కోరారు. 4వ తేదీ మోటారు బైకు ర్యాలీ, 6న మానవహారం, 7వ తేదీ నుంచి రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించేందుకు సమన్వయకర్తలు, జిల్లా అనుబంధ కమిటీ నాయకులు, స్టీరింగ్ కమిటీ సభ్యులు, మండల/నగర కన్వీనర్లు, వైఎస్సార్ సీపీ అభిమానులు, కార్యకర్తలు కృషి చేయాలని కోరారు.
వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడి గర్హనీయం:
అద్దంకిలో వైఎస్సార్‌సీపీ నాయకులపై జరిగిన దాడిని నూకసాని బాలాజీ తీవ్రంగా ఖండించారు. 30 ఏళ్లపాటు రాజకీయ జీవితంలో ఉన్న కరణం బలరాం ఇటువంటి చర్యలను ప్రోత్సహించడం హేయమన్నారు. హింసాత్మక రాజకీయాలే తమ ఎదుగుదలకు కారణమనుకుంటే దానిని ఎదుర్కోవడానికి వైఎస్సార్‌సీపీ సిద్ధంగా ఉంటుందన్నారు. హింసావాద రాజకీయాలకు స్వస్తి పలకాలన్నారు. జిల్లా అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ వంట గ్యాస్ ధరల పెంపు దారుణంగా ఉందన్నారు. ఒకేరోజు రూ.250 ధర పెంచితే సామాన్యుడు ఆ భారాన్ని ఎలా భరించగలడన్నారు. ఇది సరైన చర్య కాదని, వెంటనే గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఆధార్‌తో సంబంధం లేకుండా సిలిండర్లు సరఫరా చేయాలన్నారు. సమావేశంలో గ్రామీణ, ఉపాధి పరిశ్రమల విభాగం జిల్లా కన్వీనర్ బొగ్గుల శ్రీనివాసరెడ్డి, మహిళా విభాగం నగర కన్వీనర్ కావూరి సుశీల, నగర అధికార ప్రతినిధి రొండా అంజిరెడ్డి పాల్గొన్నారు.
నేడు బంద్
Published Fri, Jan 3 2014 12:55 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM
Advertisement