ఆదిలాబాద్ రిమ్స్, న్యూస్‌లైన్: జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు ఆ పార్టీ దృష్టి సారించింది. ఇందుకు కమిటీలను ఏర్పాటు చేసి అన్ని అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా కన్వీనర్ కొమ్ముల వినాయక్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రింట్‌మీడియా ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలో గ్రామ, బూత్, మండల స్థాయి కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. నెలాఖరులోగా అన్ని కమిటీలను పూర్తి చేసే బాధ్యత మండల కన్వీనర్లకు అప్పగించినట్లు తెలిపారు. గ్రామస్థాయిలో వైఎస్సార్ అభిమానులను ఏకం చేసి.. పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నామన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ సత్తా చాటుతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై నిరంతరం పార్టీ పోరాడుతోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని విస్మరించిందన్నారు. పేద ప్రజల కోసం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని దుయ్యబట్టారు. అత్యవసర సమయంలో వైద్యం అందించాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన 108 పథకాన్ని సైతం నీరుగారుస్తోందన్నారు.
జిల్లాలోని పసుపు రైతులు అధిక వర్షాలతో తీవ్రంగా నష్టపోయారని, వారికి కనీస మద్దతు ధర రూ.10 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతు ప్రభుత్వమని చెప్పుకుంటున్న కాంగ్రెస్ రైతుల సమస్యలు పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తామన్నారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జి అనిల్‌కుమార్, ఆదిలాబాద్ మండల కన్వీనర్ గోపాల్, పట్టణ కన్వీనర్ ఇస్లామొద్దీన్, యువజన విభాగం నాయకుడు వసీం ఖాద్రీ, బీసీ సెల్ నాయకుడు కృష్ణమీనన్ యాదవ్, నాయకులు మోయినొద్దీన్, నామ్‌దేవ్ పాల్గొన్నారు.
పార్టీ బలోపేతంపై వైఎస్సార్‌సీపీ దృష్టి
Published Sat, Jan 18 2014 4:50 AM | Last Updated on Tue, May 29 2018 4:09 PM
Advertisement
Advertisement