175 నియోజకవర్గాల్లో వైసీపీ నేతల సమైక్య దీక్షలు | ysr congress party leaders samaikya deeksha in 175 constituencies | Sakshi
Sakshi News home page

Published Wed, Oct 2 2013 11:13 AM | Last Updated on Wed, Mar 20 2024 3:39 PM

విభజన నిర్ణయం వెనక్కి తీసుకునేలా కేంద్రంపై ఒత్తిడి పెంచడమే లక్ష్యం సాక్షి నెట్‌వర్‌‌క: జాతిపిత మహాత్మాగాంధీ స్ఫూర్తితో.. ఆయన పుట్టినరోజైన అక్టోబర్‌ 2వ తేదీ నుంచి సీమాంధ్ర జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాల్లో సత్యాగ్రహాలతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సమైక్య ఉద్యమ ప్రభంజనం సృష్టించనుంది. రాష్ర్ట విభజన నిర్ణయం నేపథ్యంలో రెండునెలలుగా సమైక్య ఉద్యమంలో చురుకుగా వ్యవహరిస్తోన్న వైఎస్సార్‌సీపీ ఇప్పుడు పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు సమగ్ర కార్యాచరణతో పోరాటాన్ని మరింత ఉధృతం చేయనుంది. 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ నేతలంతా ఒకేరోజున నిరాహారదీక్షలు చేపట్టడం ద్వారా సమైక్య ఉద్యమ ఉధృతికి తోడ్పడుతూ, విభజన నిర్ణయం వెనక్కి తీసుకునేలా కేంద్రంపై ఒత్తిడి పెంచాలని నిర్ణయించింది. మహాత్మాగాంధీ, లాల్‌బహదూర్‌ శాస్త్రిల జయంతి పురస్కరించుకుని ఈ నెల 2 నుంచి నవంబర్‌ ఒకటి రాష్ట్ర అవతరణ దినోత్సవం వరకు వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలను ఇప్పటికే పార్టీ ప్రకటించింది. తద్వారా సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్న ప్రజలకు బాసటగా నిలవాలని నిర్ణయించింది. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఉధృతం చేయాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించినట్లు పార్టీ సీనియర్‌ నేత కొణతాల రామకృష్ణ మంగళవారం హైదరాబాద్‌లో విలేకరులకు తెలిపారు. కేంద్రంలో కదలిక తీసుకొచ్చేందుకు నెలరోజుల ఉద్యమ కార్యచరణను రూపొందించినట్లు చెప్పారు. ‘‘తొలిరోజు బుధవారం కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ సమన్వయకర్తలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, నేతలు నిరాహార దీక్ష చేపట్టనున్నారు. 7న మంత్రులు, కాంగ్రెస్‌, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఇళ్ల ముందు శాంతియుతంగా ధర్నాలు ఉంటాయి. అసెంబ్లీని తక్షణం సమావేశపరిచి సమైక్య తీర్మానం చేయించాలనే డిమాండ్‌తో పాటు తదనంతరం పదవులకు రాజీనామా చేయాలని కోరుతూ, ప్రజాప్రతినిధులకు పూలు అందజేసి నిరసన తెలియజేస్తాం. 10న అన్ని మండల కేంద్రాల్లో రైతుల ఆధ్వర్యంలో దీక్షలుంటాయి. 17న అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో ఆటోలు, రిక్షాలతో ర్యాలీలు, 21న నియోజకవర్గ కేంద్రాల్లో యువజనులతో బైక్‌ ర్యాలీలు నిర్వహిస్తాం. 26న సర్పంచులు, సర్పంచ్‌ పదవికి పోటీచేసిన అభ్యర్థులు జిల్లా కేంద్రాల్లో ఒకరోజు దీక్ష చేస్తారు. 29న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో విద్యార్థులు, యువకులతో శాంతియుత ఆందోళన కార్యక్రమాలుంటాయి. నవంబర్‌ 1న అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామసభ నిర్వహించి సమైక్యాంధ్ర కోరుతూ తీర్మానాలు చేసే కార్యక్రమాలు చేపడతాం’’ అని కొణతాల వివరించారు. దీక్షలు ఎవరెక్కడ: నియోజకవర్గ కేంద్రాల్లో దీక్షలకు వైఎస్సార్‌సీపీ నేతలు సిద్ధమయ్యారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో వైఎస్‌ఆర్‌సీపీ శాసనసభాపక్ష ఉపనేత శోభా నాగిరెడ్డి దీక్షలో కూర్చోనున్నారు. నంద్యాలలో పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు భూమా నాగిరెడ్డి నేతృత్వంలో 65 మంది దీక్ష చేపట్టనున్నారు. మంత్రాలయంలోని రాఘవేంద్ర కూడలిలో తాజా మాజీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి దీక్షకు సిద్ధం కాగా.. ఆయన సోదరుడు సీతారామిరెడ్డి కుమారుడు ప్రదీప్‌రెడ్డి ఆమరణ దీక్ష చేయనున్నట్లు ప్రకటించారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి బుధవారం నుంచి ఆమరణదీక్ష చేపట్టనున్నారు. అనంతపురంలో ఎమ్మెల్యే బి.గురునాథరెడ్డి నేతృత్వంలో దీక్ష చేపట్టనున్నారు. ధర్మవరంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి నేతృత్వంలో రిలే నిరాహార దీక్షలు జరగనున్నాయి. ఉరవకొండలో పార్టీ సీఈసీ సభ్యుడు విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో వెయ్యి మంది దీక్ష చేపడుతున్నారు. చిత్తూరు జిల్లా తిరుపతిలో ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి నాయకత్వంలో తుడ సర్కిల్‌ వద్ద రెండురోజుల పాటు రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నారు. వైఎస్సార్‌ జిల్లా రాయచోటిలో గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కమలాపురంలో పి.రవీంద్రనాథ్‌రెడ్డి, పులివెందులలో వైఎస్‌ అవినాష్‌రెడ్డి, రాజంపేటలో ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, పెనగలూరులో కొరముట్ల శ్రీనివాసులు దీక్షలు చేపట్టనున్నారు. గుంటూరు నగరంలో నగర కన్వీనర్‌ లేళ్ల అప్పిరెడ్డి కలెక్టరేట్‌ ఎదుట దీక్షకు దిగనున్నారు. పార్టీ జిల్లా కన్వీనర్‌ మర్రి రాజశేఖర్‌ చిలకలూరిపేటలోని నరసరావుపేట సెంటర్‌లో దీక్షకు దిగనున్నారు. మాచర్లలోని అంబేద్కర్‌ సెంటర్‌లో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, సత్తెనపల్లిలో తాలూకా సెంటర్‌లో అంబటి రాంబాబు దీక్షకు కూర్చుంటారు. మంగళగిరిలో ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) నిరవధిక నిరాహార దీక్షలో కూర్చోనున్నారు. వైఎస్సార్‌ సీఎల్‌పీ విప్‌ బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలులో దీక్ష చేపట్టనున్నారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్‌రావు కొండపిలో దీక్ష చేస్తారు. కృష్ణాజిల్లా జగ్గయ్యపేట ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్‌ సామినేని ఉదయభాను ఆమరణ దీక్ష చేపట్టనున్నారు. మచిలీ„పట్నం కోనేరు సెంటర్‌లో నియోజవకర్గ సమన్వయకర్త పేర్ని నాని ఆధ్వర్యంలో రిలే దీక్షలు, వినూత్న కార్యక్రమాలు చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మైలవరం నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త, తాజా మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్‌ ఆధ్వర్యంలో దీక్షలు చేపట్టనున్నారు. నెల్లూరు జిల్లా ఉదయƒుగిరిలో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి, కోవూరు నియోజకవర్గానికి సంబంధించి నార్తురాజుపాళెంలో జరిగే దీక్షల్లో ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి పాల్గొంటారు. విశాఖ జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో ఆయా నియోజకవర్గాల పరిధిలో సమన్వయకర్తల ఆధ్వర్యంలో ప్రధాన నేతలు, భారీ సంఖ్యలో కార్యకర్తలతో నిరాహార దీక్షలు నిర్వహించనున్నట్టు పార్టీ జిల్లా కన్వీనర్‌ చొక్కాకుల వెంకటరావు వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో తాజా మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్‌ సతీమణి విజయ, నరసన్నపేటలో ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌లు దీక్షలో కూర్చోనున్నారు. పార్టీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త ఆర్వీ సుజయకృష్ణ రంగారావు, విజయనగరం జిల్లా బొబ్బిలి పాత పెట్రోలు బంకు ఆవరణలో నిరాహార దీక్ష చేయనున్నారు. అలాగే పార్టీ జిల్లా కన్వీనర్‌ పెనుమత్స సాంబశివరాజు నెల్లిమర్ల నియోజకవర్గ కేంద్రంలో దీక్షకు కూర్చోనున్నారు. పార్టీ పశ్చిమగోదావరి జిల్లా కన్వీనర్‌, ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పోలవరం నియోజకవర్గ నేతలతో కలిసి కొయ్యలగూడెంలో నిరాహార దీక్ష ప్రారంభిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, పార్టీ సీజీసీ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ ద్రాక్షారామ సెంటర్‌లో వెయ్యి మందితో దీక్షకు ఉపక్రమిస్తున్నారు. తాజా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి కాకినాడ మసీదుసెంటర్‌లో దీక్ష చేపట్టనున్నారు. బాలాజీచెర్వు సెంటర్‌లో దీక్ష కొనసాగించాలని ఆయన నిర్ణయించారు. రాజానగరం సాయిబాబా గుడి వద్ద పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలకిష్మ దీక్ష చేస్తారు. రాజమండ్రి కోటగుమ్మం సెంటర్‌లో ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, సిటీ కోఆర్డినేటర్‌ బొమ్మన రాజ్‌కుమార్‌ల ఆధ్వర్యంలో 500 మందితో దీక్షలు జరగనున్నాయి.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement