ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ జిల్లాలో నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. సమైక్యాంధ్రను సాధించడమే లక్ష్యంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వివిధ వర్గాల ప్రజలు ఆందోళనలను మరింత ఉధృతం చేస్తున్నారు. వరుసగా 53వ రోజూ జిల్లావ్యాప్తంగా నిరసన జ్వాలలు మిన్నంటాయి. ఉద్యమంలో భాగంగా ఒంగోలు నగరంలో కార్పొరేషన్ ఉద్యోగులు ప్రజాప్రతినిధుల మాస్క్‌లు ధరించి శనివారం నిరసన ర్యాలీ నిర్వహించారు. పశుసంవర్ధక శాఖ ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించి చర్చి సెంటర్‌లో ఆందోళన తెలిపారు. ఇక నగరంలోని క్రీడాకారులు బ్యాండ్ బాజాలతో చర్చి సెంటర్‌లో వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు.
సమైక్యాంధ్ర కోరుతూ పాదయాత్ర: అద్దంకిలో ఎన్‌జీఓ, ఆర్టీసీ, ఉపాధ్యాయ జేఏసీ నాయకులు వంద మంది అద్దంకి నుంచి శింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం వరకు పాదయాత్ర చేపట్టారు. బంగ్లారోడ్డులో సమైక్యవాదుల దీక్షలు 34వ రోజుకు చేరుకున్నాయి. వసతి గృహాల ఉద్యోగులు దీక్షలు చేపట్టారు. బల్లికురవలో ఉపాధ్యాయుల రిలే నిరాహార దీక్షలు 10వ రోజు కొనసాగాయి. కందుకూరులో ఫొటోగ్రాఫర్లు ర్యాలీ, మానవహారం నిర్వహించారు. చీరాలలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, మాలమహానాడు కార్యకర్తల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఉపాధ్యాయులు రోడ్లపైనే విద్యార్థులకు పాఠాలు చెప్పారు. మున్సిపల్ ఉద్యోగులు సమైక్యాంధ్ర టీషర్టులు ధరించి పట్టణంలో ర్యాలీ చేశారు. సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. వేటపాలెంలో ఉపాధ్యాయులు, మహిళలు, రైతులు, ఉద్యోగులు, కార్మికులు జేఏసీ ఆధ్వర్యంలో సామూహిక రిలే దీక్షలు చేశారు. పర్చూరులో జేఏసీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు రిలే దీక్షలో కూర్చున్నారు. ఇంకొల్లులో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల రిలే దీక్షలు మూడో రోజుకు చేరాయి.
మార్కాపురంలో ఉద్యోగ సంఘాలు ర్యాలీ నిర్వహించాయి. ఆర్టీసీ ఉద్యోగులు మానవహారం చేశారు. జూనియర్, డిగ్రీ కాలేజీల విద్యార్థులు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పొదిలిలో సెల్‌షాపు యజమానుల నేతృత్వంలో ర్యాలీ చేశారు. కనిగిరిలో వైఎస్సార్ సీపీ కార్యకర్తల రిలే దీక్షలు 6వ రోజుకు చేరాయి. సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో వాల్మీకి సంఘం యువకులు రిలే దీక్షలో కూర్చున్నారు. మార్కెట్ యార్డ్ కమిటీ ఉద్యోగ సిబ్బంది చెక్‌పోస్టు వద్ద రాస్తారోకో, రిలే దీక్షలు చేపట్టారు. సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. డిగ్రీ కళాశాలలో అధ్యాపకులు రిలేదీక్షలు చేపట్టారు. పామూరులో సర్పంచ్ మనోహర్ చేపట్టిన నిరవధిక దీక్ష 4వ రోజుకు చేరింది. ఆర్టీసీ కార్మికులు, వ్యవసాయ మార్కెట్ సిబ్బంది వేర్వేరుగా రిలే దీక్షలు ప్రారంభించారు. యర్రగొండపాలెంలో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు రోడ్లపై చెప్పులు పాలిష్ చేసి నిరసన తెలిపారు. దోర్నాలలో ఉపాధ్యాయులు చేపట్టిన రిలే దీక్షలు 19వ రోజుకు చేరాయి. ఫొటోగ్రాఫర్లు, సెల్‌దుకాణాలు, సీడీ షాపుల యజమానులు పట్టణంలో భారీ ర్యాలీ, మానవహారం ఏర్పాటు చేశారు. గిద్దలూరులో ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం రిలే దీక్షలు చేపట్టారు.
జిల్లాలో ఆగని నిరసన జ్వాలలు
Published Sun, Sep 22 2013 4:37 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
Advertisement
Advertisement