
కేసీఆర్ వ్యాఖ్యలపై మిన్నంటిన నిరసనలు
సాక్షి నెట్‌వర్క్: అదే జోరు..అదే హోరు.. 62రోజులుగా నిర్విరామంగా సాగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమం సోమవారం కూడా సీమాంధ్ర జిల్లాల్లో ఉద్ధృతంగా ఎగసింది. ఆంధ్రోళ్లంతా ద్రోహులే అని వ్యాఖ్యానించిన టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై సీమాంధ్రలో ఆగ్రహజ్వాలలు మిన్నంటాయి. కృష్ణాజిల్లా పామర్రు నుంచి బెజవాడ బెంజిసర్కిల్ వరకు అన్నదాతలు 150 ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో వైద్యులు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీని ముట్టడించారు. గుంటూరు జిల్లా బాపట్లలో విద్యార్థులు సముద్రంలో జలదీక్ష చేపట్టారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో విద్యార్థులు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. నెల్లూరు స్వర్ణాల చెరువులో ఎన్‌జీఓలు, విద్యార్థి జేఏసీ నాయకులు, సమైక్యాంధ్ర రొట్టెలు పట్టుకున్నారు.
విశాఖ జిల్లా మద్దిలపాలెం కూడలిలో ఆర్టీసీ కార్మికులు కాగడాల ప్రదర్శన చేపట్టారు. అనకాపల్లిలో తొలిసారి భారీగా ఒకేసారి ఒకే వేదికపై సోమవారం 140మంది దీక్షలో కూర్చున్నారు. విజయనగరం జిల్లా పూసపాటిరేగ 16వ నంబర్ జాతీయరహదారిని రైతులు దిగ్బంధించారు. శ్రీకాకుళంలో ఉపాధ్యాయులు జాతీయ రహదారిపై మానవహారం నిర్వహించారు. కోనసీమలో రైతులు 500 మోటార్ సైకిళ్లతో ర్యాలీ నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ‘పశ్చిమ సమైక్య చైతన్యభేరి’ జరిగింది. అనంతపురంలో కేసీఆర్, సుష్మాస్వరాజ్ దిష్టిబొమ్మలు దహనం చేశారు. వైఎస్సార్ జిల్లా మైదుకూరులో విద్యార్థులు 200 మీటర్ల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. సమైక్యాంధ్ర ఉద ్యమాన్ని చులకన చేసి మాట్లాడిన కేసీఆర్‌పై జేఏసీ నాయకులు చిత్తూరు జిల్లా పీలేరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కర్నూలు జిల్లా నంద్యాలలో ప్రభుత్వాసుపత్రి జేఏసీ ఆధ్వర్యంలో వైద్యులు ర్యాలీ నిర్వహించారు.
మనస్తాపంతో రైతన్న ఆత్మహత్య
రాష్ట్ర విభజనపై టీఆర్‌ఎస్ అధ్యక్షులు కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు మనస్తాపం చెంది చిత్తూరు జిల్లా కేవీబీ పురం మండలం మహదేవపురానికి చెందిన రైతు కృష్ణయ్య(40) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
గర్జించిన అన్నదాతలు
సమైక్య రాష్ట్రం కోసం రైతన్నలు గర్జించారు. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గ రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ‘రెడ్డి రైతు గర్జన’కు పదివేల మందికి పైగా తరలివచ్చారు. విజయనగరం జిల్లా పూసపాటిరేగలో ఉపాధ్యాయ పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన రైతుగర్జన కార్యక్రమం విజయవంతంగా సాగింది. శ్రీకాకుళం జిల్లా రేగిడి మండలం ఉంగరాడ మెట్ట వద్ద నిర్వహించిన సమైక్య గర్జన కార్యక్రమానికి జనం వెల్లువెత్తారు. పాలకొండలో యువగర్జన నిర్వహించారు. గుంటూరులో ‘మిర్చిపోరు-సమైక్యాహోరు’ బహిరంగ సభ నిర్వహించారు. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో నిర్వహించిన ‘సమైక్య సమర భేరి’ విజయవంతమైంది.
పురందేశ్వరి, గంటా, రాయపాటి ఇళ్ల ముట్టడి
కాంగ్రెస్ పార్టీ నేతలపై జనాగ్రహం కొనసాగుతోంది. విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో విశాఖలో కేంద్ర మంత్రి పురందేశ్వరి, రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావుల ఇళ్లను సోమవారం ముట్టడించారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ వి.ఎస్.ఆర్.కె.గణపతి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు తక్షణమే రాజీనామాలు చేసి ఉద్యమంలోకి రావాలని డిమాండ్ చేశారు. ఇక గుంటూరు నగరంలో కూడా విద్యుత్ జేఏసీ నాయకులు ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇంటిని ముట్టడించారు. కర్నూలు జిల్లా ఆదోనిలో కేంద్ర మంత్రులు కనిపించడం లేదంటూ పురవీధుల్లో ప్రచారం చేశారు.
రాజీనామా తూచ్ : చింతమనేని : సమైక్యాంధ్రకు మద్దతుగా శాసనసభ సభ్యత్వానికి గతంలో తాను చేసిన రాజీనామాను ఉపసంహరించుకుంటున్నట్టు దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వెల్లడించారు. రాష్ట్ర విభజన బిల్లును శాసనసభలో ప్రవేశ పెట్టిన తరుణంలో సమైక్యాంధ్రకు మద్దతుగా ఓటేయాలనే ఉద్దేశంతోనే తానీ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను తిరస్కరించాలని కోరుతూ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌ను కలిసి విజ్ఞప్తి చేసినట్టు చింతమనేని సోమవారం తెలిపారు.