వెలుగు దారిలో... | dr.tambekar coluple presents colleges in road sefty | Sakshi
Sakshi News home page

వెలుగు దారిలో...

Published Sat, Feb 20 2016 9:55 PM | Last Updated on Thu, Aug 30 2018 5:35 PM

తమ కంటిపాప అరుంధతితో డా॥తంబ్వేకర్ దంపతులు - Sakshi

తమ కంటిపాప అరుంధతితో డా॥తంబ్వేకర్ దంపతులు

ఆదర్శం
రెండు సంవత్సరాల క్రితం  ఒక రోడ్డు ప్రమాదంలో కూతురు  చనిపోయి నప్పుడు లోకమంతా చీకటి మయంగా తోచింది డా॥సంజయ్, డా॥శుభాంగి తంబ్వేకర్ దంపతులకు. తమ ముద్దుల కూతురు అరుంధతి లేని ఈ లోకంతో తమకు పనేమిటి అని కూడా అనిపించింది.
 చుట్టూ దట్టమైన చీకటి. ఆ చీకట్లో గోడ మీద అరుంధతి ఫోటోలో నవ్వు వెలుగుతోంది. ఆ అందమైన  వెలుగును అజరామరం చేయాలంటే... తాము నిస్పృహలోకి, వైరాగ్యంలోకి జారిపోకూడదు.

కూతురు పేరు మీద చేసే ప్రతి మంచి పని...ఆమెను తమ మధ్య సజీవంగా ఉంచుతుందని ఆశిస్తూ  డా॥అరుంధతి ఫౌండేషన్ ప్రారంభించారు. చదువులో అత్యుత్త ప్రతిభ చూపించిన విద్యార్థులకు ఫౌండేషన్ తరపున పురస్కారం ఇవ్వడం మాత్రమే  కాదు.. రకరకాల మార్గాల్లో సేవాపథంలో  పయనిస్తున్నారు. ముఖ్యంగా రోడ్డు భద్రతపై ప్రత్యేక దృష్టిని కేంద్రీక రిస్తున్నారు. రోడ్డు భద్రత గురించి కాలేజీ విద్యార్థులకు అవగాహన సదస్సులు నిర్వహించి వారితో ప్రతిజ్ఞ కూడా చేయిస్తున్నారు.

దీనిలో... ‘నేను ఎల్లప్పుడూ హెల్మెట్ ధరిస్తాను’, ‘మద్యం తాగి ఎప్పుడు డ్రైవ్ చేయను’ ‘నా ఫోన్‌కు కాల్ వస్తే... బండి ఆపి మాట్లాడతాను’. ‘ట్రాఫిక్ రూల్స్‌ను ఉల్లంఘించను’ మొదలైన ప్రతిజ్ఞలు ఉంటాయి.
 అవగాహనా సదస్సులు, ప్రతిజ్ఞకు మాత్రమే పరిమితం కాకుండా రోడ్ల బాగోగులపై కూడా ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తున్నారు. ఫలానా చోట రోడ్డు చెత్తగా ఉంది అని తెలిస్తే సంబంధిత అధికారులు, ఆ ప్రాంత రాజకీయ నాయకులతో  మాట్లాడి ఆ రోడ్డును మెరుగుపరిచే విధంగా ఫౌండేషన్ తరపున కృషి చేస్తున్నారు.
 
కర్నాటకలోని కోలార్ క్రిస్టియన్ మెడికల్ కాలేజీ (సీయంసీ)లో చదువు కుంటున్న అరుంధతి  రెండు సంవత్సరాల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించారు. ప్రమాదం జరిగినప్పుడు ఆమె హెల్మెట్ ధరించే ఉన్నారు. మితి మీరిన వేగంతో కూడా వెళ్లడం లేదు. రోడ్డు పరిస్థితి బాగోలేకపోవడం  వల్లే అరుంధతి ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది. అది తల్లిదండ్రులైన సంజయ్, శుభాంగిలను తీవ్ర ఆవేదనకు గురి చేసింది. ‘‘అరుంధతికి కవిత్వం, భరత నాట్యంలో  ప్రావీణ్యం ఉంది. తనలో  సేవాదృక్పథం కూడా ఎక్కువే’’ అని కూతురు గురించి తడి కళ్లతో చెబుతారు డా॥శుభాంగి.
 
‘‘విధిరాత వల్లే ప్రమాదం జరుగు తుందనే మాటను నేను నమ్మను.  ఏదో ఒక తప్పిదం లేకపోతే ప్రమాదం జరగదు.  తగిన జాగ్రత్తలు తీసుకుంటే చాలా వరకూ ప్రమాదాలను నివారించవచ్చు’’ అంటారు డా॥సంజయ్.
 డ్రైవింగ్ చేస్తున్నప్పుడు  క్రమశిక్షణ పాటిస్తే రోడ్డు ప్రమాదాలు జరగవు అంటున్న ఈ తంబ్వేకర్ దంపతులు స్కూలు, కాలేజీ స్థాయిలో విద్యార్థులకు ట్రాఫిక్  అవేర్‌నెస్, రోడ్డు భద్రత గురించి  అవగాహనా సదస్సులు నిర్వహిస్తున్నారు.

5-10 సంవత్సరాల వయసు మధ్య ఉన్న పిల్లలకు కార్టూన్‌లు, కథల రూపంలో పై  విషయాలపై అవగాహన కలిగిస్తున్నారు.  12-16 సంవత్సరాల మధ్య వయసున్న విద్యార్థులకు డ్రైవింగ్‌లో జాగ్రత్తలు, జవాబుదారీతనం గురించి వీడియోల ద్వారా అవగాహన కలిగిస్తున్నారు.
 రోడ్డు ప్రమాదాల నివారణకు  పని చేస్తున్న ‘సేవ్ లైఫ్ ఫౌండేషన్’లాంటి ఇతర సంస్థలతో కూడా కలిసి పని చేస్తుంది అరుంధతి ఫౌండేషన్.

ట్రాఫిక్ నిబంధలకు తిలోదకలిచ్చే తల్లిదండ్రులను  ఉద్దేశించి- ‘‘తల్లిదండ్రులే ట్రాఫిక్ నిబంధనలను పట్టించుకోకపోతే... పిల్లలకు ఏది మంచో ఎవరు చెబుతారు?’’ అంటారు డా॥శుభాంగి.
 బెంగళూరులోనే కాదు ‘ఫ్రెండ్స్ ఆఫ్ ది అరుంధతీ ఫౌండేషన్’ పేరుతో దేశంలోని వివిధ నగరాల్లో రోడ్డు భద్రత గురించి అవగాహనా సదస్సులు ఏర్పాటు చేస్తూ, తమ కూతురు తమకు దూరమై నట్టుగా మరెవరూ అవ్వకూడదని తపిస్తున్నారు తంబ్వేకర్ దంపతులు.

‘‘మేము చేస్తున్న కృషి ఒక్కరి ప్రాణం కాపాడినా అంతకంటే కావాల్సింది ఏముంది!’’ అంటున్నారు ఇద్దరూ ఏక కంఠంతో. అరుంధతీ ఫౌండేషన్ చేపడుతున్న  కార్యక్రమాలతో ఎందరో ప్రభావితం అవుతున్నారు. ఈమధ్యే ఒక స్కూలు ప్రిన్సిపల్, సైకిల్‌పై వచ్చే తన విద్యార్థులకు ఉచితం హెల్మెట్‌లు కొని పెట్టారు. అంటే తంబ్వేర్ దంపతులు ఊహించిన స్పందన మొదలైనట్లే కదా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement