
రోడ్డు ప్రమాదాల నివారణకు సేఫ్టీ వీక్
సాక్షి, హైదరాబాద్: రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా రోడ్ సేఫ్టీ వారోత్సవాలను ప్రారంభించినట్లు రోడ్ సేఫ్టీ అదనపు డీజీపీ కృష్ణప్రసాద్ తెలిపారు. ప్రమాదాలకు గల ప్రధాన కారణాల్లో ఒక్కో అంశాన్ని తీసుకొని జిల్లాల్లో పోలీస్ అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించామన్నారు. మంగళవారం ప్రారంభమైన కార్యక్రమాలు 23 వరకు నిర్వహిస్తామని, ఈ నెలాఖరు 31వ తేదీని యాక్సిడెంట్ ఫ్రీ డేగా నిర్ణయించామని పేర్కొన్నారు.
18న డ్రంకన్ డ్రైవ్, 19న ఓవర్ స్పీడ్‌పై..
17న విద్యార్థులు, ఉపాధ్యాయులు కార్యక్రమంలో పాల్గొంటారని, 18న డ్రంకన్ డ్రైవ్ అంశంపై ఎక్సైజ్, వైన్స్, బార్లు, రెస్టారెంట్ల నిర్వాహకులతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కృష్ణప్రసాద్ తెలిపారు. 19న ఓవర్ స్పీడ్ అంశంపై ఆర్టీఏ, మెడికల్ అండ్ హెల్త్, ఆర్‌అండ్‌బీ అధికారులు, సిబ్బంది కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. ఓవర్ లోడ్‌పై 20న ట్రాన్స్‌పోర్ట్, ఆర్‌అండ్‌బీ విభాగాలు, హెల్మెట్ వినియోగంపై 21న పోలీసులు, ఇతర ప్రభుత్వ వ్యవస్థలు, సీట్ బెల్ట్‌పై 22న సిటీ పోలీస్, హెచ్‌ఎండీఏ, అర్బన్ అథారిటీలు, 23న సెల్‌ఫోన్ డ్రైవింగ్‌పై ఐటీ ఇండస్ట్రీ, టెలికమ్ సర్వీసెస్ విభాగాలు కార్యక్రమంలో పాల్గొంటాయని తెలిపారు.
అవగాహన కార్యక్రమాల్లో అధికారులు
రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలపై వాహనదారులు, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రామగుండం, రాచకొండ, కరీంనగర్, వరంగల్ కమిషనర్లు, వనపర్తి, నల్లగొండ, సూర్యాపేట, ఆదిలాబాద్ ఎస్పీలు 500 మందితో ర్యాలీ నిర్వహిస్తారని అదనపు డీజీపీ తెలిపారు. హైదరాబాద్, సైబరాబాద్, ఖమ్మం, నిజామాబాద్ పోలీస్ ఉన్నతాధికారులు ప్లెక్సీలు, పోలీస్ స్టేషన్లలో వాహనదారులతో సభలు ఏర్పాటు చేసి ప్రమాదాల నివారణపై అవగాహన కల్పిస్తారని వివరించారు.