సాక్షి, నిర్మల్ : జిల్లా కేంద్రంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ చైర్మన్ గా కొత్త జిల్లాలో తొలిసారి రోడ్డు భద్రత కమిటీ సమావేశం ఒకవైపు జరుగుతుండగా.. మరోవైపు సారంగాపూర్ మండలంలోని మహబూబ్ ఘాట్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. మరో ఇద్దరు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. భద్రత కమిటీ ప్రమాదాల నివారణకు చర్యలపై ఉపక్రమిస్తుండగా మరోపక్క ప్రమాదాలు మాత్రం ఆగడం లేదు. కొత్త సంవత్సరం ప్రారంభమై వారం రోజులు కాకముందే జరిగిన మూడు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు. ఈ మూడు ప్రమాదాల్లో భైంసాలో, మహబూబ్ ఘాట్‌పై జరిగిన ప్రమాదాల్లో రహదారులపై సాంకేతిక సమస్యలే ప్రమాదాలకు ఒక కారణమయ్యాయి. మామడ మండలం పొన్కల్ వద్ద మానవ తప్పిదంతో జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఈ సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత రోడ్డు భద్రత కమిటీపై ఉంది.
30 ప్రమాదకర స్పాట్స్
జిల్లాలో 30 ప్రమాదకర బ్లాక్ స్పాట్స్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అంత్యంత ప్రమాదకర స్థలాల్లో సాంకేతిక సమస్యలను సరిదిద్దాలని శుక్రవారం రోడ్డు భద్రత కమిటీ సమావేశంలో నిర్ణయించారు. ఈ మేరకు తక్షణ చర్యలకు దిగనున్నారు. రోడ్డు భద్రత కమిటీలో కలెక్టర్ చైర్మన్ గా ఉండగా ఎస్పీ వైస్ చైర్మన్, కన్వీనర్‌గా ఆర్టీవో, సభ్యులుగా పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ, డీఎంహెచ్‌వో అధికారులున్నారు. త్వరలో ఈ సభ్యులు డేంజర్ స్పాట్లను సందర్శించనున్నారు. ప్రమాదాల నివారణకు తీసుకునే చర్యలపై ఈ కమిటీ ప్రతిపాదనలు రూపొందిస్తుంది. ఆ ప్రతిపాదనాల మేరకు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోనున్నారు. ఇంకా 30 డేంజర్ స్పాట్లలో ప్రధానంగా భైంసా–భోకర్ రోడ్డు, బాసర–ముథోల్, మామడ–పొన్కల్, నిర్మల్–భైంసా, నిర్మల్ ఫైర్‌స్టేషన్–చిట్యాల, భైంసా–మంజ్రి, తానూర్–బెల్‌తరోడ, నిర్మల్‌లో కట్ట చెరువు, కుంటాల–అర్లి(కె) క్రాస్ రోడ్డు వద్ద అధిక ప్రమాదాలు జరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.
భైంసా ఫైర్ స్టేషన్ వద్ద డివైడర్ నుంచి క్రాస్ చేస్తూ రాంగ్‌రూట్‌లో వెళ్తుండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. భైంసా నుంచి మంజ్రి దారిలో టీ జంక్షన్ వద్ద అధికంగా ఎండ్లబండ్లు రావడంతో ప్రమాదాలకు కారణమవుతున్నాయని గుర్తించారు. తానూర్ నుంచి బెల్‌తరోడ మార్గంలో బెల్‌తరోడ ఎక్స్‌రోడ్డు వద్ద రెండు రోడ్లు కలిసే జంక్షన్ ఉండడం, ఈ మార్గం పల్లంగా ఉండడం, నాందేడ్‌కు పెద్ద వాహనాలు అధిక వేగంగా వెళ్తుండడం ప్రమాదాలకు కారణమవుతున్నాయి. నిర్మల్ కంచెరోని చెరువు వద్ద పెద్ద వాహనాలు ఇరుపక్కలా నిలిపి ఉంచడం ప్రమాదాలకు కారణమవుతున్నాయి. నిర్మల్ ప్రవేశ మార్గం కావడం, రోడ్డు మలుపుగా ఉండడం ఇక్కడ ప్రమాదాలకు కారణమవుతోంది. కుంటాల–అర్లి(కె) మార్గంలో అర్లి ఎక్స్‌రోడ్డు వద్ద 61వ నంబర్ జాతీయ రహదారిపైకి ఓ గ్రామం నుంచి వచ్చే రోడ్డు, వాగుపై నుంచి వచ్చే రోడ్డు కలుస్తుండడంతో ఇక్కడ ప్రమాదాలకు కారణం అవుతోంది.
రెండేళ్లలో 197 మంది మృత్యువాత
నిర్మల్ జిల్లాలో రెండేళ్లలో 1033 రోడ్డు ప్రమాదాలు జరుగగా 197మంది మృతి చెందగా 836 మంది గాయాలపాలయ్యారు. ప్రమాదాల నివారణపై అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాల్సి అవసరం ఉంది. రోడ్డు భద్రత కమిటీలో 108 అంబులెన్స్ వాహనాలకు సంబంధించి సభ్యులున్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు అంబులెన్స్ వాహనాలు తక్షణం సంఘటన స్థలానికి వెళ్లిన పక్షంలో కొన్ని ప్రాణాలైన కాపాడుకునే అవకాశముంటుంది. శుక్రవారం మహబూబ్ ఘాట్‌పై జరిగిన ప్రమాదంలో ఇద్దరు సంఘటన స్థలంలోనే మృతి చెందగా, మరో ఇద్దరు అరగంటకుపైగా రోడ్డుపైనే గాయాలతో కొట్టుమిట్టడారు. ప్రమాదాలు జరిగినప్పుడు తొలి గంట సమయంలోనే చికిత్స అందిన పక్షంలో ప్రాణాలు నిలిచే అవకాశాలు ఉంటాయి. ఈ విషయమై ఆర్టీవో అబ్దుల్ మొహిమిన్ ను వివరణ కోరగా... రోడ్డు భద్రత కమిటీ త్వరలో జిల్లాలో ప్రమాదకర స్థలాలను సందర్శించి నివారణకు చర్యలు తీసుకుంటుందని బదులిచ్చారు.