dangerous spots
-
డేంజర్; అక్కడికెళ్తే అంతే సంగతులు!
న్యూఢిల్లీ : ప్రాణాపాయ స్థితిలో తన లేదా ఇతరుల ప్రాణాలను రక్షించడం కోసం ప్రాణాలకు తెగించిన వారిని ఎవరైనా హర్షిస్తారు. అనవసరంగా ప్రాణాల మీదకు తెచ్చుకునే వారిని ఎవరు హర్షించరు. అయినప్పటికీ కొందరికి ప్రాణాలతో చెలగాటమాడడం అంటే ఎంతో ఇష్టం. అలాంటి వారు పశ్చిమ ఆస్ట్రేలియాలోని విట్టెనూమ్ ప్రాంతానికి క్యూ కడుతున్నారు. అక్కడ దెయ్యాలు లేవు, భూతాలు లేవుగానీ విషపూరితమైన వాయువులున్నాయి. అక్కడ వీచే ఆస్బెస్టాస్ (కంటికి కనిపించని ఆరు సహజ సిద్ధమైన ఖనిజాల మిశ్రమం) వాయువులను పీల్చినట్లయితే పక్క వారిని హెచ్చరించేలోగానే ప్రాణాలు గాలిలో కలసి పోతాయి. ప్రాణాపాయం తప్పితే ఊపిరి తిత్తుల క్యాన్సర్, శ్వాసకోస సంబంధిత వ్యాధులు వస్తాయి. పోర్ట్ హెడ్లాండ్కు 300 కిలోమీటర్ల దూరంలో ఈ విషవాయువుల ప్రాంతం ఉంది. అక్కడ 1966లో ఆస్బెస్టాస్ గనుల తవ్వకాలను నిలిపివేశారు. గాలిలోకి లీకైన ఆస్బెస్టాస్ వాయువుల వల్ల కార్మికుల ప్రాణాలకు ముప్పు వాటిళ్లడంతో 30 లక్షల టన్నుల ఆస్బెస్టాస్ నిల్వలు ఉన్నప్పటికీ గనులను మూసివేశారు. సమీపంలోని ఊరును కూడా ఖాళీ చేయించారు. ఎన్నో హెచ్చరికల బోర్డులను ఏర్పాటు చేశారు. పాడు పడిన ఇళ్లూ, దుకాణాలు, కేఫ్‌లు శిథిలావస్థలో ఉన్నాయి. పర్యాటకులు వాటి వద్దకే కాకుండా హెచ్చరిక బోర్డుల వద్దకు వెళ్లి కూడా ఫొటోలు దిగుతున్నారు. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. సమీపంలోని విషతుల్యమైన చిన్న సరస్సులో ఈతలు కూడా కొడుతున్నారు. పర్యాటకులను ఆ ప్రాంతానికి వెళ్లకుండా నిరోధించడంలో భాగంగా ఆ ప్రాంతానికి పూర్తిగా విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఆ ప్రాంతాన్ని జనావాస ప్రాంతాల నుంచే కాకుండా అలాంటి ప్రమాదకరమైన ప్రాంతం అన్నది ఒకటుందనే విషయం కూడా ప్రజలకు తెలియకూడదనే ఉద్దేశంతో అన్ని రకాల మ్యాప్‌ల నుంచి తొలగించారు. అయినప్పటికీ పర్యాటకుల తాకిడి పెరిగింది. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా విస్తరించడమే కారణం. మిత్రులే కాకుండా, కుటుంబాలు కూడా అక్కడికి వెళుతున్నాయి. టెంటులు వేసుకొని కూడా గడుపుతున్నారు. ‘మా హెచ్చరికలను ఆషామాషీగా తీసుకోవద్దు. ఇప్పటికీ అక్కడ ప్రాణాలను హరించే వాయువులు ఉన్నాయి. ఇప్పట్లో అక్కడ పరిస్థితులు మెరగయ్యే అవకాశం కూడా లేదు. దయచేసి అక్కడికి వెళ్లకండి’ అంటూ ‘అబార్జినల్ అఫేర్స్ అండ్ ల్యాండ్స్’ మంత్రి బెన్ వ్యాన్ తాజాగా ఓ హెచ్చరిక జారీ చేశారు. -
డేంజర్@30
సాక్షి, నిర్మల్ : జిల్లా కేంద్రంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ చైర్మన్ గా కొత్త జిల్లాలో తొలిసారి రోడ్డు భద్రత కమిటీ సమావేశం ఒకవైపు జరుగుతుండగా.. మరోవైపు సారంగాపూర్ మండలంలోని మహబూబ్ ఘాట్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. మరో ఇద్దరు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. భద్రత కమిటీ ప్రమాదాల నివారణకు చర్యలపై ఉపక్రమిస్తుండగా మరోపక్క ప్రమాదాలు మాత్రం ఆగడం లేదు. కొత్త సంవత్సరం ప్రారంభమై వారం రోజులు కాకముందే జరిగిన మూడు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు. ఈ మూడు ప్రమాదాల్లో భైంసాలో, మహబూబ్ ఘాట్‌పై జరిగిన ప్రమాదాల్లో రహదారులపై సాంకేతిక సమస్యలే ప్రమాదాలకు ఒక కారణమయ్యాయి. మామడ మండలం పొన్కల్ వద్ద మానవ తప్పిదంతో జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఈ సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత రోడ్డు భద్రత కమిటీపై ఉంది. 30 ప్రమాదకర స్పాట్స్ జిల్లాలో 30 ప్రమాదకర బ్లాక్ స్పాట్స్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అంత్యంత ప్రమాదకర స్థలాల్లో సాంకేతిక సమస్యలను సరిదిద్దాలని శుక్రవారం రోడ్డు భద్రత కమిటీ సమావేశంలో నిర్ణయించారు. ఈ మేరకు తక్షణ చర్యలకు దిగనున్నారు. రోడ్డు భద్రత కమిటీలో కలెక్టర్ చైర్మన్ గా ఉండగా ఎస్పీ వైస్ చైర్మన్, కన్వీనర్‌గా ఆర్టీవో, సభ్యులుగా పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, డీఎంహెచ్‌వో అధికారులున్నారు. త్వరలో ఈ సభ్యులు డేంజర్ స్పాట్లను సందర్శించనున్నారు. ప్రమాదాల నివారణకు తీసుకునే చర్యలపై ఈ కమిటీ ప్రతిపాదనలు రూపొందిస్తుంది. ఆ ప్రతిపాదనాల మేరకు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోనున్నారు. ఇంకా 30 డేంజర్ స్పాట్లలో ప్రధానంగా భైంసా–భోకర్ రోడ్డు, బాసర–ముథోల్, మామడ–పొన్కల్, నిర్మల్–భైంసా, నిర్మల్ ఫైర్‌స్టేషన్–చిట్యాల, భైంసా–మంజ్రి, తానూర్–బెల్తరోడ, నిర్మల్‌లో కట్ట చెరువు, కుంటాల–అర్లి(కె) క్రాస్ రోడ్డు వద్ద అధిక ప్రమాదాలు జరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. భైంసా ఫైర్ స్టేషన్ వద్ద డివైడర్ నుంచి క్రాస్ చేస్తూ రాంగ్రూట్లో వెళ్తుండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. భైంసా నుంచి మంజ్రి దారిలో టీ జంక్షన్ వద్ద అధికంగా ఎండ్లబండ్లు రావడంతో ప్రమాదాలకు కారణమవుతున్నాయని గుర్తించారు. తానూర్ నుంచి బెల్తరోడ మార్గంలో బెల్తరోడ ఎక్స్‌రోడ్డు వద్ద రెండు రోడ్లు కలిసే జంక్షన్ ఉండడం, ఈ మార్గం పల్లంగా ఉండడం, నాందేడ్‌కు పెద్ద వాహనాలు అధిక వేగంగా వెళ్తుండడం ప్రమాదాలకు కారణమవుతున్నాయి. నిర్మల్ కంచెరోని చెరువు వద్ద పెద్ద వాహనాలు ఇరుపక్కలా నిలిపి ఉంచడం ప్రమాదాలకు కారణమవుతున్నాయి. నిర్మల్ ప్రవేశ మార్గం కావడం, రోడ్డు మలుపుగా ఉండడం ఇక్కడ ప్రమాదాలకు కారణమవుతోంది. కుంటాల–అర్లి(కె) మార్గంలో అర్లి ఎక్స్‌రోడ్డు వద్ద 61వ నంబర్ జాతీయ రహదారిపైకి ఓ గ్రామం నుంచి వచ్చే రోడ్డు, వాగుపై నుంచి వచ్చే రోడ్డు కలుస్తుండడంతో ఇక్కడ ప్రమాదాలకు కారణం అవుతోంది. రెండేళ్లలో 197 మంది మృత్యువాత నిర్మల్ జిల్లాలో రెండేళ్లలో 1033 రోడ్డు ప్రమాదాలు జరుగగా 197మంది మృతి చెందగా 836 మంది గాయాలపాలయ్యారు. ప్రమాదాల నివారణపై అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాల్సి అవసరం ఉంది. రోడ్డు భద్రత కమిటీలో 108 అంబులెన్స్ వాహనాలకు సంబంధించి సభ్యులున్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు అంబులెన్స్ వాహనాలు తక్షణం సంఘటన స్థలానికి వెళ్లిన పక్షంలో కొన్ని ప్రాణాలైన కాపాడుకునే అవకాశముంటుంది. శుక్రవారం మహబూబ్ ఘాట్‌పై జరిగిన ప్రమాదంలో ఇద్దరు సంఘటన స్థలంలోనే మృతి చెందగా, మరో ఇద్దరు అరగంటకుపైగా రోడ్డుపైనే గాయాలతో కొట్టుమిట్టడారు. ప్రమాదాలు జరిగినప్పుడు తొలి గంట సమయంలోనే చికిత్స అందిన పక్షంలో ప్రాణాలు నిలిచే అవకాశాలు ఉంటాయి. ఈ విషయమై ఆర్టీవో అబ్దుల్ మొహిమిన్ ను వివరణ కోరగా... రోడ్డు భద్రత కమిటీ త్వరలో జిల్లాలో ప్రమాదకర స్థలాలను సందర్శించి నివారణకు చర్యలు తీసుకుంటుందని బదులిచ్చారు. -
నగరంలో శిథిల భవనాలు 1,338
లెక్క తేల్చిన బల్దియా అధికారులు స్ట్రక్చర్ ఇంజినీర్ల పరిశీలనే తరువాయి ధ్రువీకరించిన అనంతరం కూల్చివేతలే వరంగల్ అర్బన్ : ముసురు పట్టిందంటే చాలు దశాబ్దాల కిందటి పాత భవనాల్లో దినదిన గండంగా కాలం వెళ్లదీస్తుంటారు. ఎప్పుడు ఎటువంటి విపత్కర పరిస్థితి ముంచుకొస్తుందో తెలియకపోవడంతో అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని ఎంతోమంది శిథిలావస్థలోని భవనాల్లో బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. వరంగల్ మహా నగరంలో ఈ తరహా కూలేందుకు సిద్ధమైన భవనాలు భయపెడుతున్నాయి. వానలకు గోడలు, పైకప్పులు బలహీనమై.. ఎప్పటికీ ఉరుస్తూ దర్శనమిస్తున్న ఇటువంటి భవంతులు భావి ప్రమాదాలకు చిరునామాలుగా మారుతున్నాయి. పలుచోట్ల ఇటువంటి బిల్డింగ్లు, ఇళ్లు నేలమట్టమైన ఘటనలూ అడపాదడపా చోటుచేసుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇటువంటి పాత భవనాలను గుర్తించి, కూల్చివేయాలని రాష్ట్ర పురపాలక శాఖ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. దీంతో బల్దియా పట్టణ ప్రణాళికా విభాగం(టౌన్ ప్లానింగ్) అధికారులు, సిబ్బంది మేల్కొన్నారు. నగరపాలిక పరిధిలోని సర్కిళ్ల వారీగా రంగంలోకి దిగారు. అవసాన దశకు చేరిన భవనాలను గుర్తించారు. గ్రేటర్ పరిధిలో శిథిలావస్థలోని భవనాలు 1,338 ఉన్నట్లు లెక్క తేల్చారు. వాటిలో వరంగల్ ప్రాంతంలోని కాశిబుగ్గ సర్కిల్ పరిధిలో 322, కాజీపేట సర్కిల్ పరిధిలోని 1,016 భవనాలు అవసాన దశలో ఉన్నట్లు గుర్తించారు. వాటిలో వరంగల్ స్టేషన్ రోడ్‌లోని ఒక కేంద్ర ప్రభుత్వ కార్యాలయం, రంగంపేట సెంటర్లోని ఒక ప్రైవేట్ హోటల్ ఉన్నాయి. వరంగల్ రైల్వే గేట్, రామన్నపేట, బీట్ బజార్, వరంగల్ చౌరస్తా, జేపీఎన్ రోడ్, మండిబజార్, ఎల్బీ నగర్, హన్మకొండలోని మచిలీబజార్ ఏరియాల్లోనూ పాత భవనాలు ఉన్నట్లు పేర్కొన్నారు. వరంగల్ ఖమ్మం రోడ్, ఉర్సు కరీమాబాద్, రంగశాయిపేట, పెరుకవాడ, కామునిపెంట, మట్టెవాడ, కాజీపేట, సోమిడి రోడ్, బాపూజీ నగర్, పద్మాక్షి గుట్ట, లక్ష్మీపురం, గిర్మాజీపేట, చౌర్బౌలీ తదితర ప్రాంతాల్లో శిథిలావస్థకు చేరిన భవనాలు ఉన్నట్లు వెల్లడించారు. భవన యజమానులు సహకరించకుంటే.. భవనాల జీవితకాలం, వాటి స్ట్రక్చర్ల పరిశీలన కోసం బల్దియా టౌన్ ప్లానింగ్ అధికారులు ఎస్ఈ అబ్దుల్ రహ్మాన్‌కు నివేదించారు. 1,338 భవనాల జాబితాను ఆయనకు అందజేశారు. భవన నిర్మాణాల చట్టంలో సెక్షన్ 353(బీ) ప్రకారం భవనాల స్ట్రక్చర్లను ఇంజినీర్లు పరిశీలించనున్నారు. తదుపరి ఆయా భవనాలు ఇక ఎంతో కాలం నిలువలేవు అనే ధ్రువీకరణకు వస్తే.. ఆయా భవనాలకు నోటీసులు జారీ చేస్తారు. అనంతర కాలంలో వాటిని యజమానులే స్వచ్ఛందంగా కూల్చివేస్తే బల్దియా సహకరం అందిస్తుంది. లేదంటే బల్దియా అధికార యంత్రాంగమే స్వయంగా వాటిని కూల్చివేసే ప్రక్రియను చేపడుతుంది. వారం రోజుల్లోగా ఈ ప్రక్రియను మొదలు పెట్టనున్నట్లు బల్దియా టౌన్ ప్లానింగ్, ఇంజినీరింగ్ అధికారులు వెల్లడించారు.