ముసురు పట్టిందంటే చాలు దశాబ్దాల కిందటి పాత భవనాల్లో దినదిన గండంగా కాలం వెళ్లదీస్తుంటారు. ఎప్పుడు ఎటువంటి విపత్కర పరిస్థితి ముంచుకొస్తుందో తెలియకపోవడంతో అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని ఎంతోమంది శిథిలావస్థలోని భవనాల్లో బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు.
-
లెక్క తేల్చిన బల్దియా అధికారులు
-
స్ట్రక్చర్ ఇంజినీర్ల పరిశీలనే తరువాయి
-
ధ్రువీకరించిన అనంతరం కూల్చివేతలే
వరంగల్ అర్బన్ : ముసురు పట్టిందంటే చాలు దశాబ్దాల కిందటి పాత భవనాల్లో దినదిన గండంగా కాలం వెళ్లదీస్తుంటారు. ఎప్పుడు ఎటువంటి విపత్కర పరిస్థితి ముంచుకొస్తుందో తెలియకపోవడంతో అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని ఎంతోమంది శిథిలావస్థలోని భవనాల్లో బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు.
వరంగల్ మహా నగరంలో ఈ తరహా కూలేందుకు సిద్ధమైన భవనాలు భయపెడుతున్నాయి. వానలకు గోడలు, పైకప్పులు బలహీనమై.. ఎప్పటికీ ఉరుస్తూ దర్శనమిస్తున్న ఇటువంటి భవంతులు భావి ప్రమాదాలకు చిరునామాలుగా మారుతున్నాయి. పలుచోట్ల ఇటువంటి బిల్డింగ్‌లు, ఇళ్లు నేలమట్టమైన ఘటనలూ అడపాదడపా చోటుచేసుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇటువంటి పాత భవనాలను గుర్తించి, కూల్చివేయాలని రాష్ట్ర పురపాలక శాఖ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. దీంతో బల్దియా పట్టణ ప్రణాళికా విభాగం(టౌన్ ప్లానింగ్) అధికారులు, సిబ్బంది మేల్కొన్నారు. నగరపాలిక పరిధిలోని సర్కిళ్ల వారీగా రంగంలోకి దిగారు. అవసాన దశకు చేరిన భవనాలను గుర్తించారు.
గ్రేటర్ పరిధిలో శిథిలావస్థలోని భవనాలు 1,338 ఉన్నట్లు లెక్క తేల్చారు. వాటిలో వరంగల్ ప్రాంతంలోని కాశిబుగ్గ సర్కిల్ పరిధిలో 322, కాజీపేట సర్కిల్ పరిధిలోని 1,016 భవనాలు అవసాన దశలో ఉన్నట్లు గుర్తించారు. వాటిలో వరంగల్ స్టేషన్ రోడ్‌లోని ఒక కేంద్ర ప్రభుత్వ కార్యాలయం, రంగంపేట సెంటర్‌లోని ఒక ప్రైవేట్ హోటల్ ఉన్నాయి. వరంగల్ రైల్వే గేట్, రామన్నపేట, బీట్ బజార్, వరంగల్ చౌరస్తా, జేపీఎన్ రోడ్, మండిబజార్, ఎల్బీ నగర్, హన్మకొండలోని మచిలీబజార్ ఏరియాల్లోనూ పాత భవనాలు ఉన్నట్లు పేర్కొన్నారు. వరంగల్ ఖమ్మం రోడ్, ఉర్సు కరీమాబాద్, రంగశాయిపేట, పెరుకవాడ, కామునిపెంట, మట్టెవాడ, కాజీపేట, సోమిడి రోడ్, బాపూజీ నగర్, పద్మాక్షి గుట్ట, లక్ష్మీపురం, గిర్మాజీపేట, చౌర్‌బౌలీ తదితర ప్రాంతాల్లో శిథిలావస్థకు చేరిన భవనాలు ఉన్నట్లు వెల్లడించారు.
భవన యజమానులు సహకరించకుంటే..
భవనాల జీవితకాలం, వాటి స్ట్రక్చర్ల పరిశీలన కోసం బల్దియా టౌన్ ప్లానింగ్ అధికారులు ఎస్‌ఈ అబ్దుల్ రహ్మాన్‌కు నివేదించారు. 1,338 భవనాల జాబితాను ఆయనకు అందజేశారు. భవన నిర్మాణాల చట్టంలో సెక్షన్ 353(బీ) ప్రకారం భవనాల స్ట్రక్చర్లను ఇంజినీర్లు పరిశీలించనున్నారు. తదుపరి ఆయా భవనాలు ఇక ఎంతో కాలం నిలువలేవు అనే ధ్రువీకరణకు వస్తే.. ఆయా భవనాలకు నోటీసులు జారీ చేస్తారు. అనంతర కాలంలో వాటిని యజమానులే స్వచ్ఛందంగా కూల్చివేస్తే బల్దియా సహకరం అందిస్తుంది. లేదంటే బల్దియా అధికార యంత్రాంగమే స్వయంగా వాటిని కూల్చివేసే ప్రక్రియను చేపడుతుంది. వారం రోజుల్లోగా ఈ ప్రక్రియను మొదలు పెట్టనున్నట్లు బల్దియా టౌన్ ప్లానింగ్, ఇంజినీరింగ్ అధికారులు వెల్లడించారు.