warangal city
-
పోలీసులు సమీక్షల్లో దొంగలు చోరీల్లో
వరంగల్ క్రైం/రామన్నపేట: చోరీలు, నేరాలను ఎలా కట్టడి చేయాలా..అని పోలీసులు ఓ పక్కన సమీక్షిస్తుండగా.. మరోపక్క అదే సమయంలో దొంగలు స్వైర విహారం చేసి దర్జాగా దోచుకుపోయిన ఘటనలు వరంగల్ మహానగరంలో మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకున్నాయి. పోలీస్ కమిషనర్ రంగనాథ్ పోలీస్ అధికారులతో నేర సమీక్ష జరుపుతుండగా అదే సమయంలో దొంగలు మూడు పోలీస్స్టేషన్ల పరిధిలోని ఆరు ఫ్లాట్లలో చోరీలకు పాల్పడ్డారు. మొత్తం 178 తులాల బంగారం, కొంత నగదు, వెండి అపహరించారు. మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల మధ్యలో హనుమకొండ పోలీస్ స్టేషన్ పరిధి నయీంనగర్‌లోని కల్లెడ అపార్ట్మెంట్లో సుమారు 12 తులాలు, కిషనపురలోని లహరి అపార్ట్మెంట్లో 14 తులాలు, మారుతీ వాసవి అపార్ట్మెంట్లో 60 తులాల బంగారు ఆభరణాలను చోరీ చేశారు. సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలోని మారుతీ అపార్ట్మెంట్లో ప్రకాశ్‌రెడ్డికి చెందిన 401 ప్లాట్‌లో తాళం పగులగొట్టి 14 గ్రాముల బంగారు గొలుసును చోరీ చేశారు. మట్టెవాడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గాయత్రీ అపార్టుమెంట్‌లోని ఓ ఫ్లాట్‌లో 52 తులాల బంగారంతోపాటు సుమారు రూ.40వేల నగదు ఎత్తుకెళ్లారు. దాని పక్కనే ఉన్న వద్దిరాజు అపార్ట్మెంట్లో 39 తులాల బంగారం, రూ.22వేల నగదు అపహరించారు. ముఖాలకు మాస్క్ ధరించి చోరీ చేసిన తరువాత దుండగులు దర్జాగా వెళ్తున్న దృశ్యాలు ఆయా అపార్ట్మెంట్ల వద్ద ఉన్న సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్‌కు చెందిన నలుగురు దొంగలు ఈ చోరీలకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. వీరంతా ఒక కారులో వచ్చినట్లు తెలిసింది.వరంగల్ క్రైం/రామన్నపేట -
వరంగల్ లో వెలుగులోకి CI వేధింపుల వ్యవహారం
-
వరంగల్ మాస్టర్ ప్లాన్@2041
సాక్షి, వరంగల్ : వరంగల్ మహా నగరం అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తోందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రాష్ట్రంలో రెండో పెద్ద నగరంగా ఉన్న వరంగల్‌ను సమగ్రాభివృద్ధి చేస్తూనే ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా కొత్త మాస్టర్ ప్లాన్ ఉంటుందని చెప్పారు. వరంగల్ మాస్టర్ ప్లాన్ – 2041 ఆమోదంపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు శుక్రవారం హైదరాబాద్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ(కూడా) చైర్మన్ మర్రి యాదవరెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్, ‘కూడా’ వైస్ చైర్మన్ ఎన్.రవికిరణ్, పీఓ ఇ.అజిత్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. త్వరలోనే కొత్త మాస్టర్ ప్లాన్‌కు ప్రభుత్వం ఆమోదం తెలపనుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ సందర్భంగా చెప్పారు. దీనికోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్‌కు సూచించారు. భవిష్యత్ అవసరాలకు తగినట్లుగా... రాష్ట్రంలో వరంగల్‌కు ప్రత్యేక ప్రాధాన్యత ఉందని, హైదరాబాద్ తర్వాత రెండో పెద్ద నగరం వరంగల్. భవిష్యత్ అవసరాలకు తగినట్లుగా మహా నగరాన్ని అభివృద్ధి చేసేలా కొత్త మాస్టర్ ప్లాన్ తయారు చేసుకున్నామని మంత్రి దయాకర్‌రావు తెలిపారు. గతంలో ఉన్న మాస్టర్ ప్లాన్–1971ను సరిచేస్తూ ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా వరంగల్ మాస్టర్ ప్లాన్ – 2041 తయారైందని చెప్పారు. వరంగల్ సమగ్రాభివృద్ధి, ప్రజలకు మెరుగైన సేవలందించేలా మాస్టర్ ప్లాన్ ఉందని తెలిపారు. మూడు జిల్లాల్లోని 19 మండలాలు, 181 రెవెన్యూ గ్రామాలు మాస్టర్ ప్లాన్ పరిధిలో ఉన్నాయని, మొత్తం 1800 చదరపు కిలోమీటర్ల పరిధి ఉంటుందని చెప్పారు. గత మాస్టర్ ప్లాన్‌తో పోలిస్తే 20 రెట్లు ఎక్కువ విస్తీర్ణం ఉంటుందని వివరించారు. టెక్స్టైల్ పార్క్, టూరిజం హబ్... వంటి అన్ని అంశాలతో వరంగల్ ఎకనామిక్ హబ్‌గా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ కొత్త ప్లాన్ తయారు చేశామని, ‘కూడా’ పరిధిలో ఉన్న 2 వేల చెరువులను పరిరక్షించేలా చూస్తున్నామని చెప్పారు. అలాగే, పార్కుల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తూ.. ఇన్నర్, ఔటర్, రీజినల్ రింగు రోడ్లు.. ఇలా ప్రజల అవసరాల ను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి ప్రణాళికలు అమలవుతాయని మంత్రి తెలిపారు. ప్రజల సూచనలకు ప్రాధాన్యత ఇచ్చి అవసరమైన మార్పులతో తుది ప్లాన్ సిద్ధం చేశామని, ఎన్జీవోలు, పౌరుల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకున్నామని చెప్పారు. మాస్టర్ ప్లాన్‌ను ఆమోదం కోసం ఈ ఏడాది జూన్‌లో ప్రభుత్వానికి పంపించిన నేపథ్యంలో త్వరగా ఆమోదం పొందేలా మున్సిపల్ శాఖ తదుపరి చర్యలు తీసుకోవాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సూచించారు. మునిసిపల్ శాఖ పూర్తిగా సమీక్షించిన అనంతరం ప్రభుత్వం ఆమోదం తెలపనుందని ఆ శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్ ఈ సందర్భంగా బదులిచ్చారు. ఈ సమావేశానికి ముందు మంత్రి దయాకర్‌రావు ‘కూడా’ చైర్మ న్, అధికారులతో కూడా ఈ విషయమై సమీక్షించారు. -
మార్కెట్ కార్యదర్శి ఆకస్మిక తనిఖీ
వరంగల్ సిటీ : వరంగల్ వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి పొలెపాక నిర్మల గురువారం మిర్చి యార్డును ఆకస్మిక తనిఖీ చేపట్టారు. కార్యదర్శిని చూడగానే చిల్లర దొంగలు దొంగలించిన మిర్చి బస్తాలను వదిలివేసి పారిపోయారు. అప్పటికి సెక్యూరిటీ గార్డులు అందుబాటులో లేకపోయో సరికి కార్యదర్శినే స్వ యంగా దొంగ బస్తాలను యార్డులోకి తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న యార్డు ఇంచార్జీలు జన్ను భాస్కర్, బీ.వెంకన్న, సెక్యూరిటీ గార్డులు కార్యదర్శి వద్దకు చేరుకొని తనిఖీలో పాల్గొన్నారు.అనంతరం యార్డు ఏఎస్.వేముల వెంకటేశ్వర్లు దగ్గరుండి కార్యదర్శికి సహకరిస్తూ..చిల్లర దందాగాళ్లను అదుపులోకి తీసుకున్నారు. సెక్యూరిటీ గార్డులు సరిగా విధులు నిర్వర్తించడం లేదని కార్యదర్శి వారిపై అసహనం వ్యక్తం చేశారు. మరోసారి చిల్లర దొంగలు, వ్యాపారులు మిర్చి దందా చేస్తున్నట్లు తన దృష్టికి వస్తే చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోనని హెచ్చరించారు. బస్తాలు దొరికిన చిల్లర దొంగలు తమ బస్తాలను తీసుకెళ్లడానికి వివిధ రకాలుగా ఫైరవీలు చేసినా కార్యదర్శి ససేమీరా ఒప్పుకోలేదు. తనిఖీలో స్వా« దీనం చేసుకున్న 1.38 క్వింటాళ్ల మిర్చిని యార్డులోనే అమ్మి, మార్కెట్ ఫీజు కింద జమచేశారు. రైతులను ఇబ్బంది పెడితే సహించం.. మార్కెట్‌కు మిర్చి అమ్మకానికి వచ్చిన రైతులను మునీమ్, దానం, దయ పేరుతో మిర్చిని తీసుకోవడానికి ఇబ్బంది పెడితే సహించేదిలేదని మార్కెట్ కార్యదర్శి పి.నిర్మల హమాలీ కార్మికులను హెచ్చరించారు. గురువారం మిర్చి మార్కెట్లో కార్యదర్శి అకస్మిక తనిఖీ నిర్వహించిన సమయంలో కొందరు హమాలీల వద్ద చిల్లర మిర్చి బస్తాలను గుర్తించిన కార్యదర్శి వాటిని కూడా స్వాధీనం చేసుకున్నారు. హమాలీలు సక్రమంగా డ్యూటీ చేయాలని, లేదంటే లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. -
ఎఫ్టీటీహెచ్ సేవలకు శ్రీకారం
కేబుల్ ఆపరేటర్ల సహకారంతో బీఎస్ఎన్ఎల్ హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలు ప్రారంభించిన ఎంపీ సీతారాంనాయక్ వరంగల్ : అధునాతన ఫైబర్ టు ది హోమ్(ఎఫ్టీటీహెచ్) విధానాన్ని మహబూబాబాద్ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్ మంగళవారం వరంగల్ నగరంలో ప్రారంభించారు. వరంగల్‌లోని బీఎస్ఎన్ఎల్ భవన్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఎఫ్టీటీహెచ్ తొలి కనెక్షన్‌ను ఆయన వినియోగదారుడికి అందజేశారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ప్రైవేటు టెలిఫోన్ ఆపరేటర్లతో పోటీపడేందుకు బీఎస్ఎన్ఎల్ ప్రత్యేక రాయితీలను అందిస్తోందన్నారు. ఎఫ్టీటీహెచ్ ద్వారా ప్రతి ఇంటికి ఫైబర్ ఆప్టిక్ కేబుల్ కనెక్షన్ ఇస్తారన్నారు. దీనితో ఇంటర్నెట్ సేవలతో పాటు ల్యాండ్‌లైన్ ఫోన్‌తో ఇతర నెట్‌వర్క్‌లకు కాల్ చేసుకునే సదుపాయాల్ని పొందొచ్చన్నారు. ఇప్పటివరకు ప్రతి ఆదివారం అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత టెలిఫోన్ కాల్స్ చేసుకునే సౌలభ్యం ఉందని, వచ్చే జనవరి నుంచి ల్యాండ్‌లైన్ ఫోన్ ఉన్న వారు పూర్తి ఉచితంగా కాల్ చేసుకునే అవకాశాన్ని కల్పించే దిశగా బీఎస్ఎన్ఎల్ చర్యలు చేపడుతోందన్నారు. అనంతరం బీఎస్ఎన్ఎల్ పీసీజీఎం కె.నరేందర్ మాట్లాడుతూ ప్రైవేటు టెలికాం ఆపరేటర్లకు ధీటుగా సేవలు అందించేందుకు ఎంఎస్ఓలు, కేబుల్ ఆపరేటర్లతో తాము అవగాహన ఒప్పందం(ఎంఓయూ) కుదుర్చుకున్నామన్నారు. ఎఫ్టీటీహెచ్ కనెక్షన్ల బుకింగ్, టారిఫ్, బిల్లింగ్ బీఎస్ఎన్ఎల్ శాఖ చూస్తుందన్నారు. కనెక్షన్లు ఇవ్వడం, సేవలు కేబుల్ ఆపరేటర్ల ఆధ్వర్యంలో అందుతాయన్నారు. ఎఫ్టీటీహెచ్లో రూ.645 ప్లాన్ తీసుకున్న వారికి 10 ఎంబీపీఎస్ స్పీడ్‌తో 50 జీబీ డేటా ఉచితంగా అందిస్తామన్నారు. ఈ ప్లాన్‌లో కనెక్షన్ తీసుకోదల్చినవారు రూ.1000 రీఫండబుల్ అడ్వాన్సుగా చెల్లించాలన్నారు. కనెక్షన్ తీసుకున్నవారికి మోడెంను కేబుల్ ఆపరేటర్లు ఉచితంగా అందిస్తారని నరేందర్ వివరించారు. ప్రత్యేక బృందాలు ఇంటింటికి వెళ్లి కనెక్షన్లు స్వీకరిస్తాయన్నారు. గ్రేటర్ వరంగల్‌తో పాటు భూపాలపల్లి, జనగామ, మహబూబాబాద్, కేసముద్రం ఎంఎస్ఓలతో దీని అమలుపై ఎంఓయూ కుదుర్చుకున్నట్లు నరేందర్ వివరించారు. కార్యక్రమంలో బీఎస్ఎన్ఎల్తో ఎంఓయూ కుదుర్చుకున్న మహతి కమ్యూనికేషన్ అధినేత సురభి చంద్రశేఖర్‌రావు, మరో ఎంఎస్ఓ మహేందర్, వరంగల్ ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు కేశవమూర్తి, బీఎస్ఎన్ఎల్ అధికారులు పాల్గొన్నారు. -
మహాలక్ష్మీదేవిగా అమ్మవారి దర్శనం
హన్మకొండ కల్చరల్ : వరంగల్ నగరంలోని భద్రకాళి దేవాలయంలో జరుగుతున్న దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా నాలుగోరోజైన మంగళవారం అమ్మవారిని మహాలక్ష్మీదేవి అవతారంలో అలంకరించారు. ఉదయం నవదుర్గా క్రమంలో భద్రకాళి మాతకు ఆలయ ప్రధాన అర్చకుడు భద్రకాళి శేషు, ముఖ్య అర్చకుడు చెప్పెల నాగరాజుశర్మ, వేదపండితులు పార్నంది నర్సింహమూర్తి, అర్చకులు టక్కరసు సత్యం పలు అనుష్టానాలు నిర్వహించారు. అనంతరం చంద్రఘంటా దుర్గా క్రమంలో పూజలు నిర్వహించి సూర్యప్రభ వాహనంపై ఊరేగించారు. సాయంత్రం మహిషాసుర మర్దిని క్రమంలో పూజలు చేసి హంస వాహనంపై ఊరేగించారు. ఈసందర్భంగా భద్రకాళి సేవా సమితి కన్వీనర్ అయిత గోపీనాథ్ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు. నూతన కార్యనిర్వహణాధికారిగా పదవీ బాధ్యతలు చేపట్టిన దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ ఆర్.సునిత, సూపరింటెండెంట్ అద్దంకి విజయ్‌కుమార్, ఆలయ సిబ్బంది, అర్చకులతో సమావేశం నిర్వహించి నవరాత్రుల ఏర్పాట్లను సమీక్షించారు. ‘శక్తితత్వం’పై సౌమిత్రి లక్ష్మణాచార్య ఉపన్యసించారు. జమ్మికుంటకు చెందిన మల్లంపల్లి సుబ్రహ్మణ్య శర్మ ‘సతీ అనసూయ’ హరికథను ప్రదర్శించారు. సంకీర్తన మ్యూజిక్ అకాడమీ నిర్వాహకులు ఉమ్మడి లక్ష్మణాచారి కర్ణాటక సంగీత కచేరీ నిర్వహించారు. ఈ సాంస్కృతిక కార్యక్రమాలకు వేదాంతం జగన్నాథ శర్మ హార్మోనియం సహకారాన్ని అందించారు. శివానంద నృత్యమాల ఆచార్యులు బి. సుధీర్‌రావు శిష్యబృందం కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించారు. -
భారీగా గుట్కా ప్యాకెట్లు స్వాధీనం
వరంగల్ : వరంగల్ నగరవ్యాప్తంగా నిషేధిత గుట్కా విక్రయ కేంద్రాలపై పోలీసులు గురువారం ఆకస్మిక దాడులు చేశారు. ఈ సందర్భంగా రూ. 20 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారిపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నగరంలో శిథిల భవనాలు 1,338
లెక్క తేల్చిన బల్దియా అధికారులు స్ట్రక్చర్ ఇంజినీర్ల పరిశీలనే తరువాయి ధ్రువీకరించిన అనంతరం కూల్చివేతలే వరంగల్ అర్బన్ : ముసురు పట్టిందంటే చాలు దశాబ్దాల కిందటి పాత భవనాల్లో దినదిన గండంగా కాలం వెళ్లదీస్తుంటారు. ఎప్పుడు ఎటువంటి విపత్కర పరిస్థితి ముంచుకొస్తుందో తెలియకపోవడంతో అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని ఎంతోమంది శిథిలావస్థలోని భవనాల్లో బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. వరంగల్ మహా నగరంలో ఈ తరహా కూలేందుకు సిద్ధమైన భవనాలు భయపెడుతున్నాయి. వానలకు గోడలు, పైకప్పులు బలహీనమై.. ఎప్పటికీ ఉరుస్తూ దర్శనమిస్తున్న ఇటువంటి భవంతులు భావి ప్రమాదాలకు చిరునామాలుగా మారుతున్నాయి. పలుచోట్ల ఇటువంటి బిల్డింగ్లు, ఇళ్లు నేలమట్టమైన ఘటనలూ అడపాదడపా చోటుచేసుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇటువంటి పాత భవనాలను గుర్తించి, కూల్చివేయాలని రాష్ట్ర పురపాలక శాఖ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. దీంతో బల్దియా పట్టణ ప్రణాళికా విభాగం(టౌన్ ప్లానింగ్) అధికారులు, సిబ్బంది మేల్కొన్నారు. నగరపాలిక పరిధిలోని సర్కిళ్ల వారీగా రంగంలోకి దిగారు. అవసాన దశకు చేరిన భవనాలను గుర్తించారు. గ్రేటర్ పరిధిలో శిథిలావస్థలోని భవనాలు 1,338 ఉన్నట్లు లెక్క తేల్చారు. వాటిలో వరంగల్ ప్రాంతంలోని కాశిబుగ్గ సర్కిల్ పరిధిలో 322, కాజీపేట సర్కిల్ పరిధిలోని 1,016 భవనాలు అవసాన దశలో ఉన్నట్లు గుర్తించారు. వాటిలో వరంగల్ స్టేషన్ రోడ్‌లోని ఒక కేంద్ర ప్రభుత్వ కార్యాలయం, రంగంపేట సెంటర్లోని ఒక ప్రైవేట్ హోటల్ ఉన్నాయి. వరంగల్ రైల్వే గేట్, రామన్నపేట, బీట్ బజార్, వరంగల్ చౌరస్తా, జేపీఎన్ రోడ్, మండిబజార్, ఎల్బీ నగర్, హన్మకొండలోని మచిలీబజార్ ఏరియాల్లోనూ పాత భవనాలు ఉన్నట్లు పేర్కొన్నారు. వరంగల్ ఖమ్మం రోడ్, ఉర్సు కరీమాబాద్, రంగశాయిపేట, పెరుకవాడ, కామునిపెంట, మట్టెవాడ, కాజీపేట, సోమిడి రోడ్, బాపూజీ నగర్, పద్మాక్షి గుట్ట, లక్ష్మీపురం, గిర్మాజీపేట, చౌర్బౌలీ తదితర ప్రాంతాల్లో శిథిలావస్థకు చేరిన భవనాలు ఉన్నట్లు వెల్లడించారు. భవన యజమానులు సహకరించకుంటే.. భవనాల జీవితకాలం, వాటి స్ట్రక్చర్ల పరిశీలన కోసం బల్దియా టౌన్ ప్లానింగ్ అధికారులు ఎస్ఈ అబ్దుల్ రహ్మాన్‌కు నివేదించారు. 1,338 భవనాల జాబితాను ఆయనకు అందజేశారు. భవన నిర్మాణాల చట్టంలో సెక్షన్ 353(బీ) ప్రకారం భవనాల స్ట్రక్చర్లను ఇంజినీర్లు పరిశీలించనున్నారు. తదుపరి ఆయా భవనాలు ఇక ఎంతో కాలం నిలువలేవు అనే ధ్రువీకరణకు వస్తే.. ఆయా భవనాలకు నోటీసులు జారీ చేస్తారు. అనంతర కాలంలో వాటిని యజమానులే స్వచ్ఛందంగా కూల్చివేస్తే బల్దియా సహకరం అందిస్తుంది. లేదంటే బల్దియా అధికార యంత్రాంగమే స్వయంగా వాటిని కూల్చివేసే ప్రక్రియను చేపడుతుంది. వారం రోజుల్లోగా ఈ ప్రక్రియను మొదలు పెట్టనున్నట్లు బల్దియా టౌన్ ప్లానింగ్, ఇంజినీరింగ్ అధికారులు వెల్లడించారు. -
ప్రతిభకు పట్టం
-
యువత క్రీడా స్పూర్తితోపాటు దేశభక్తి పెంచుకోవాలి
వరంగల్: యువకులు క్రీడా స్ఫూర్తితో పాటు దేశభక్తిని పెంపోందించుకోవాలని వరంగల్ నగర పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు పిలుపునిచ్చారు. యవతలో క్రీడా స్ఫూర్తిని ప్రోత్సహించడంలో భాగంగా శనివారం వరంగల్ జిల్లా హన్మకొండలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో క్రికెట్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీలను సుధీర్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఒకటిన్నర కిలోమీటర్ల పొడవైన జాతీయ పతాకాన్ని ప్రదర్శించారు. -
వరంగల్‌లో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు: కేటీఆర్
హైదరాబాద్: వరంగల్ నగరంలో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేయాలని తమ ప్రభుత్వం ఆలోచనలో ఉందని తెలంగాణ ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. మంగళవారం తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గీతారెడ్డి అడిగిన ప్రశ్నకు కేటీఆర్ సమాధానమిస్తూ... సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. రాబోయేరోజుల్లో రాష్ట్రంలోని పరిశ్రమలకు 24గంటలు విద్యుత్ సరఫరా చేస్తామన్నారు. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తామని తెలిపారు. పారిశ్రామిక రంగంలో ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి కృషి చేస్తామని వివరించారు. ప్రతి జిల్లాలో ఉపాధి అవకాశాలు కల్పిస్తామని కేటీఆర్ అన్నారు. అంతకుముందు గీతారెడ్డి తెలంగాణ రాష్ట్రంలో నూతన పారిశ్రామిక విధానం ఎప్పుడు వస్తుంది... ఆ విధానంలోని ప్రధాన అంశం ఏమిటీ... అని ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. అంతేకాకుండా...ఎస్సీలు, ఎస్టీల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీనే కృషి చేసిందని గీతారెడ్డి వెల్లడించారు. దాంతో కేటీఆర్ పై విధంగా స్పందించారు. -
కాలు జారిపడి బాలింత మృతి
వరంగల్: వరంగల్ నగరంలోని సీకేఎం ప్రసూతి ఆసుపత్రిలో మంగళవారం విషాదం చోటు చేసుకుంది. కాలకృత్యాలు తీర్చుకునేందుకు ఆసుపత్రి బాత్రూమ్లోకి వెళ్లిన బాలింత ప్రమాదవశాత్తూ కాలు జారిపడి మృతి చెందింది. దీంతో మృతిరాలి బంధువుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆసుపత్రి బాత్రూమ్లు అపరిశుభ్రంగా ఉండడం వల్లే బాలింత మృతి చెందిందని ఆమె బంధువులు ఆరోపించారు. దీంతో ఆసుపత్రి ఎదుట వారు ఆందోళనకు దిగారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మృతురాలు మంజుల స్వస్థలం తొర్రూర్ మండలం నాంచారి మదూరని ఆమె బంధువులు వెల్లడించారు. -
మందుబాటిళ్లతో రౌడీషీటర్ గ్యాంగ్ వీరంగం
వరంగల్: వరంగల్ నగరంలో రౌడీషీటర్ ప్రమోద్ శుక్రవారం హల్చల్ సృష్టించాడు. స్థానిక శంబునిపేటలోని బార్లో ప్రమోద్ అతడి అనుచరులతో వీరంగం సృష్టించాడు. బార్లోనే ఉన్న మందుబాబులు ఇది పద్దతి కాదంటూ ప్రమోద్‌తోపాటు అతడి అనుచరులను హెచ్చరించారు. మమ్మల్నే హెచ్చరిస్తారా అంటూ వారిపై అక్కడే ఉన్న మందు సీసాలతో దాడి చేశారు. ఈ దాడిలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం ప్రమోద్ బృందం అక్కడి నుంచి పరారైంది. ఈ ఘటనపై బార్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు బార్ వద్దకు చేరుకున్నారు. గాయపడిన వ్యక్తిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అందులోభాగంగా ప్రమోద్‌తోపాటు అతడి బృందం కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
కొత్త ఏడాది ఎన్నికల పరీక్ష
వరంగల్ సిటీ, న్యూస్‌లైన్ : రాజకీయ పక్షాలకు నూతన సంవత్సరం ఎన్నికల పరీక్షగా మారనుంది. ఇప్పటికే ప్రధాన పక్షాల్లో ఎన్నికల వాతావరణం కన్పిస్తోంది. ఈ ఏడాది ప్రారం భం నుంచి నేతలు బిజీగా మారనున్నారు. ఈ ఏడాది మొదటి అర్ధభాగంలో సాధారణ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ దిశగానే జిల్లా లో రాజకీయ పక్షాలు అంతర్గతంగా కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్, బీజేపీ, వైఎస్సార్సీపీ, వామపక్షాలకు తెలంగాణ అంశం తేలడంమొక్కటే అడ్డంకిగా మారింది. విలీనం, పొత్తులు ఎలా ఉన్నా పార్టీ లు ఎన్నికల పావులు కదుపుతూనే ఉన్నాయి. పాగాకు వైఎస్సార్ సీపీ యత్నం తొలిసారి సాధారణ ఎన్నికలను ఎదుర్కొనేం దుకు వైఎస్సార్సీపీ నేతలు సిద్ధమవుతు న్నా రు. నియోజకవర్గాల్లో అభ్యర్థులు, కేడర్‌ను పెంచుకునేందుకు కదులుతున్నారు. నియోజకవర్గ స్థాయిలో కోఆర్డినేటర్లు, కమిటీలు ఏర్పా టు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ ప్రజావ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచుకోవాలని భావిస్తున్నారు. దివంగత నేత వైఎస్సార్ సంక్షేమ ఫలాలను ప్రజల ముందు కు తెచ్చేయోచనతో ఉన్నారు. కాంగ్రెస్‌కు కత్తిమీద సాము రెండు పర్యాయాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు ప్రభుత్వ వ్యతిరేకత పెద్ద గుదిబండగా మారనుంది. తెలంగాణకు కాంగ్రెస్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినా ఆ పార్టీ నేతలు ప్రజా విశ్వాసం పొందలేకపోతున్నారు. రానున్న ఎన్నికల్లో సంక్షేమం, తెలంగాణ అంశాలే ప్రధానాయుధాలుగా జనంలోకి వెళ్లేందుకు వారు సిద్ధమవుతున్నారు. జిల్లాలో ప్రస్తుతం రెండు లోక్‌సభ స్థానాలుండగా మహబూబాబాద్ నుంచి కేంద్రమంత్రి బలరామ్‌నాయక్, వరంగల్ నుంచి రాజయ్య తొలిసారి ఎన్నికైన వారే. మరోసారి తమ స్థానాలు ఎలా పదిలపరుచుకోవాలని యోచిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేల తోపాటు కాంగ్రెస్సేతేర ఎమ్మెల్యేలు ఉన్న స్థానాల్లో పోటీకి ఆశావహులు బెర్త ఖరారు చేసుకునే పనిలోపడ్డారు. టీడీపీలో ఊగిసలాట రెండు దఫాలు ప్రతిపక్షానికే పరిమితమైన టీడీపీకి నేతలకు ముచ్చెమటలు పడుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ అంశంపై పార్టీ నేత చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరి తీవ్రప్రతి బంధకంగా మారుతుందనే ఆందోళన నెలకొం ది. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కూడా తెలంగాణ సెంటిమెంట్ తమ కొంప ముంచుతుందేమోననే బెంగపట్టుకుంది. ఇక కేడర్‌లో నెలకొన్న నిరుత్సాహం, ద్వితీయశ్రేణి నాయకులు పార్టీ ని వీడడం వారిని కలవరపరుస్తోంది. పట్టుకోసం టీఆర్ఎస్ యత్నం 2009 సాధారణ ఎన్నికల్లో చావుదెబ్బతిన్న టీఆర్ఎస్ ఈసారి ఎన్నికల్లో పట్టును నిలుపుకోవాలని భావిస్తోంది. తెలంగాణ సెంటిమెంట్ ప్రధానాయుధంగా, పునర్నిర్మాణాన్ని ఎజెండా గా చేయాలని యోచిస్తున్నారు. ఉద్యమ ఫలి తాలు సానుకూలంగా ఉన్నా జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో నాయకత్వలోపం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం ముగ్గురు ఎమ్మెల్యేలు వినయభాస్కర్, డాక్టర్ రాజయ్య, మొలుగూరి భిక్షపతి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నియోజకవర్గాల్లో కూడా చేసిన అభివృద్ధి కంటే తెలంగాణ అంశంపైనే వీరు ఆశలు పెట్టుకున్నారు. వరంగల్ లోక్‌సభ అభ్యర్థిగా కడియం పేరును ప్రకటించినప్పటికీ మహబూబాబాద్ అభ్యర్థి కోసం వేటసాగిస్తోంది. బీజేపీ విశ్వప్రయత్నం తెలంగాణ అంశం, మోడీ మంత్రం జపిస్తూ బీజేపీ జిల్లాపై భారీగా ఆశలు పెట్టుకుంటున్నది. పాత సంబంధాలను పునరుద్ధరించుకుంటూ జోష్ పెంచే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటి నుంచే ఎంపీ, ఎమ్మెల్యేల అభ్యర్థుల వేట కొనసాగిస్తోంది. బలమైన నాయకత్వం ఉన్నప్పటికీ అన్ని నియోజకవర్గాల్లో గట్టి అభ్యర్థులు లేకపోవడం ఈ పార్టీకి ఇబ్బందిగా మారింది. ఇతర పక్షాల్లోని నేతలకు గాలం వేస్తున్నారు. జిల్లాలో పాగా వేయాలని తలపిస్తున్నారు. వామపక్షాలైన సీపీఎం, సీపీఐ, ఎంసీపీఐ నాయకులు తమకు బలమున్న రెండు, మూడు నియోజకవర్గాల్లో పోటీ చేయాలనే యోచనతో ఉన్నారు. పూర్వ వైభవాన్ని సాధించాలనుకుంటున్నారు. ఈ దిశగా ఆ నియోజకవర్గాల్లో బలంతోపాటు ఈ దఫా ఓటింగ్ తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. -
నేడు కాంగ్రెస్ కృతజ్ఞత సభ
వరంగల్ సిటీ, న్యూస్‌లైన్: హన్మకొండ జేఎన్ఎస్ గ్రౌండ్లో శనివారం జరగనున్న కాంగ్రెస్ కృతజ్ఞత సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. లక్ష మంది సమీకరణ లక్ష్యంగా జిల్లా మంత్రులు, నేతలు ప్రణాళిక రూపొందించుకున్నారు. అధిష్టానం పరిశీలించే అవకాశం ఉన్నందున నేతలు సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సభకు డిప్యూటీ సీఎం రాజనర్సింహతో పాటు కేంద్ర మంత్రులు జైపాల్‌రెడ్డి, సర్వే సత్యనారాయణ, బలరామ్‌నాయక్, రాష్ట్ర మంత్రులు జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, బస్వరాజు సారయ్య, రాంరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్, శ్రీధర్‌బాబు, డీకే అరుణ, గీతారెడ్డి, ప్రభుత్వ చీఫ్‌విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, ఎంపీలు రాజయ్య, హన్మంతరావు, పొన్నం ప్రభాకర్, మధుయాష్కీ, రాపోలు ఆనందభాస్కర్, పాల్వాయి గోవర్దన్‌రెడ్డి, మాజీ పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్, జిల్లా ఎమ్మెల్యేలతో పాటు ఇతర జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనాయకులు హాజరుకానున్నారు. వారం రోజులుగా జిల్లాకు చెందిన మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, బస్వరాజు సారయ్యలు ఇక్కడే మకాం వేసి సభను జయప్రదం చేసేందుకు కృషి చేస్తున్నారు. ముఖ్యంగా జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, శ్రేణులను తరలించేందుకు యత్నిస్తున్నారు. తెలంగాణవాదులు, ఉద్యోగులు, ఇతర సంఘాల నేతలు హాజరయ్యేందుకు శ్రమిస్తున్నారు. ఒక్కో నియోజకవర్గం నుంచి పది వేల మందిని సమీకరించాలని నిర్ణయించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలతో పాటే ప్రస్తుతం నియోజకవర్గ ఇంచార్జిలుగా ఉన్న వారిపై భారం వేశారు. మంత్రులు సారయ్య, పొన్నాల ఇప్పటికే ఉద్యోగ జేఏసీ నాయకులు, న్యాయవాదులు, మహిళా గ్రూపులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలే కాకుండా తెలంగాణ ఇస్తున్న పార్టీగా కాంగ్రెస్‌కు ప్రత్యేక గుర్తింపును ఈ సభ ద్వారా తేవాలని ప్రయత్నిస్తున్నారు. అరవై ఏళ్ళ తెలంగాణ ఆకాంక్షను కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తున్నందున ఆ పార్టీకి కృతజ్ఞత తెలియజేయాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. సభ జరిగే జేఎన్ఎస్ గ్రౌండ్లో ఏర్పాట్లు పూర్తయ్యూరుు. వేదికపై నాయకులు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ఆ స్థాయిలోనే ఏర్పాటు చేశారు. స్టేడియం చుట్టుపక్కల ఉన్న రోడ్లకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేశారు. స్టేడియంలో కాంగ్రెస్ ఫ్లెక్సీలు, జెండాలతో అలంకరించారు. సభకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా, నగర కాంగ్రెస్ అధ్యక్షులు దొంతి మాధవరెడ్డి, తాడిశెట్టి విద్యాసాగర్ పరిశీలించారు. సభ జయప్రదం కావాలని మైదానంలో వేదబ్రాహ్మణులు శుక్రవారం యాగం కూడా నిర్వహించారు. వరంగల్ నగరానికి వచ్చే నాలుగు మార్గాల్లో సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, జిల్లా నాయకుల భారీ ఫ్లెక్సీలు, కాంగ్రెస్ జెండాలు, తోరణాలు కట్టారు. వాహనాలకు కేఎంసీ, ఎల్బీ కళాశాల , ఆర్ట్స్‌కళాశాల, పద్మాక్షిగుట్ట ప్రాంతాల్లో ప్రత్యేకంగా పార్కింగ్ స్థలాలు కేటాయించారు. అతిథులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు భారీగా జనం వచ్చే అవకాశం ఉన్నందున అవసరమైన భద్రత చర్యలు తీసుకోవడంతో పాటు ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నం కాకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.